Indian Abortion Laws: మనదేశంలో అబార్షన్ చట్టాలు ఏం చెబుతున్నాయి? ఎన్ని వారాల వరకు గర్భస్రావానికి చట్టం అనుమతిస్తుంది?
అమెరికాలో అబార్షన్ చట్టాలు వివాదాస్పదమయ్యాయి. మరి ఇండియాలో అబార్షన్ చట్టాలు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం.
అబార్షన్ చట్టాల్లో అమెరికా సుప్రీం కోర్టు చాలా మార్పులు చేసింది. ఆ మార్పులు అక్కడ వివాదాస్పదమయ్యాయి. కొత్త చట్టం ప్రకారం వైద్యపరమైన అత్యవసర పరిస్థితుల్లో తప్ప సాధారణ పరిస్థితుల్లో 15 వారాల కంటే ఎక్కువ వయసు ఉన్న గర్భాన్ని తీయించుకోవడానికి అవకాశం లేదు. దీంతో ఆ దేశంలో నిరసనలు మిన్నంటాయి. ‘గర్భాన్ని ఉంచుకోవాలా వద్దా అనే నిర్ణయించుకునే హక్కును మహిళ నుంచి ఎవరూ లాక్కోలేరు’ అంటూ నిరసనకారులు ఉద్యమిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మన ఇండియన్ చట్టాలు అబార్షన్ విషయంలో ఏం చెబుతున్నాయో తెలుసుకుందాం.
మనదేశంలో...
మనదేశం విషయానికి వస్తే 2021 మార్చి 25న మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్, 1971లో సవరణలు చేశారు. అత్యాచారం, వ్యభిచారం వల్ల గర్భం దాలిస్తే గర్భస్రావం చేయించుకునే అవకాశం 20 వారాల గర్భం నుంచి 24 వారాలకు పెంచారు. దీనికి ఇద్దరు వైద్యులు చెక్ చేసి అనుమతి ఇవ్వాలి. అదే 20 వారాల్లోపు గర్భస్రావానికి అయితే ఒక వైద్యుడు అనుమతి ఇస్తే చాలు. అలాగే గర్భం కారణంగా మహిళ ప్రాణానికి పెద్ద ముప్పు ఏర్పడిన పక్షంలో కూడా ఆ గర్భాన్ని తొలగించడానికి అనుమతి ఉంటుంది. లేదా పుట్టబోయే బిడ్డ శారీరక,లేదా మానసిక వైకల్యంతో ఉన్నాడని తెలిసినా కూడా గర్భవిచ్ఛిత్తికి చట్టపరమైన అనుమతి లభిస్తుంది.
20 వారాల నుంచి 24 వారాలకు ఎందుకు పెంచారు?
అబార్షన్ చేయించుకునే హక్కును 20 వారాల నుంచి 24 వారాలకు పెంచడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. అలాగే షరతులు కూడా ఉన్నాయి. ఎవరు పడితే వారు 20 వారాలు దాటిన గర్భాన్ని తీయించుకోలేరు. అత్యాచారం కారణంగా గర్భం దాల్చిన మహిళలు,దీర్ఘకాలిక లైంగిక వేధింపుల వలన గర్భం దాల్చిన వారు, మైనర్ ఆడపిల్లలు, శారీరక వైకల్యం ఉన్న మహిళలు, మానసిక ఆరోగ్యం బాగోలేని మహిళలు 24 వారాల పిండాన్ని తొలగించుకునే అవకాశం చట్టంలోని మార్పులు కల్పిస్తున్నాయి. అలాగే గర్భం దాల్చాక స్త్రీ విడాకులు తీసుకున్నా లేక భర్తను పొగొట్టుకున్నా కూడా ఆమె 24 వారాల వరకు అబార్షన్ చేయించుకోవచ్చు.
యుద్దాలు, మానవతా సంక్షోభం ఏర్పడినప్పుడు, అత్యవసర వైద్యపరిస్థితుల్లో కూడా గర్భం దాల్చిన మహిళలకు కూడా 24 వారాల వరకు కాలపరిమితి లభిస్తుంది.
అంతా మహిళ ఇష్టం..
భారతదేశంలో పెళ్లి కాని స్త్రీలు కూడా అబార్షన్ చేయించుకోవడం చట్టబద్ధమే. ఇక పెళ్లయిన స్త్రీకి మాత్రం పైన చెప్పిన షరతులన్నీ వర్తస్తాయి. వాటికి అనుగుణంగా అబార్షన్ అనుమతిస్తారు. అంటే 20 వారాల్లోపు ఆమెకు నచ్చినప్పుడు అబార్షన్ చేయించుకోవచ్చు. ఆ పరిమితి దాటితే మాత్రం ఇద్దరు వైద్యుల అనుమతి అవసరం. అయితే జీవిత భాగస్వామి అనుమతి మాత్రం అవసరం లేదు. ఈ విషయంలో మహిళకు పూర్తి స్వేచ్ఛనిచ్చింది చట్టం.
భర్తకు హక్కు లేదు...
సాధారణ స్త్రీని ఏ సమస్యా లేకుండా అబార్షన్ చేయించుకోమని ఒత్తిడి చేసే హక్కు ఎవరికీ లేదు. చివరికి భర్తకు కూడా. అలా ఒత్తిడి చేస్తే అతనిపై గృహహింస కేసు నమోదవుతుంది.
ఆర్ధిక సాయం
అబార్షన్ చేయించుకునే మహిళకు ప్రభుత్వం ఆర్దికంగానూ సాయపడుతుంది.భారత ప్రభుత్వం పబ్లిక్ నేషనల్ హెల్త్ ఇన్సూరెన్స్ ఫండ్స్, ఆయుష్మాన్ భారత్, ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కింద అబార్షన్ కవర్ అవుతుంది.సర్జికల్ అబార్షన్ కోసం ప్రభుత్వం 15,500 రూపాయలను ఆర్ధిక సాయంగా అందిస్తుంది. ఇందులో కన్సల్టేషన్, థెరపీ, హాస్పిటల్‌లో చేరడం, మందులు ఇలా అన్నీ కవర్ అవుతాయి.
సెలవులు కూడా...
అబార్షన్ అయిన లేదా చేసుకున్న ఉద్యోగినుల కోసం సెలవులను చట్టబద్ధం చేసిన దేశాలలో భారతదేశం కూడా ఒకటి.మనదేశంలో గర్భస్రావం అయిన ఉద్యోగినికి ఆరు వారాల పాటూ వేతనంతో కూడిన సెలవు లభిస్తుంది. కానీ మనదేశంలో చాలా మంది మహిళలకు తమకున్న అబార్షన్ హక్కుల గురించి అవగాహన లేదు.
Also read: బిర్యానీ మసాలా కొంటున్నారా? ఇంట్లో ఇలా చేసుకుంటే ఏడాదైనా నిల్వ ఉంటుంది