Sana Sathish: చానా చరిత్ర ఉండాది సామీ... ! టీడీపీ రాజ్యసభ క్యాండిడేట్ మామూలోడు కాదు..
తెలుగుదేశం పార్టీ ప్రకటించిన ఇద్దరు రాజ్యసభ అభ్యర్థుల్లో ఒకరి పేరు తెలుగుదేశం వాళ్లకు కూడా షాక్ ఇచ్చింది. ఎందుకంటే ఆయనకు చానా చరిత్ర ఉంది మరి...
మందలో ఒకడిగా కాదు.. వందలో ఒకడిగా నిలవాలన్నది ఆయన ఫిలాసఫీ. ఆ విషయం ఆయనే తన బయో వీడియోలో చెప్పుకున్నారు. ఆయన ఎవరా అంటారా..? ఆయన పేరు సానా సతీష్ బాబు. దాత,వ్యాపారావేత్త, సామాజిక వేత్త ఇంకా చానా..! ఇప్పుడు ఆయన గురించి ఎందుకంటారా.. రేపో మాపో ఆయన కాబోయే రాజ్యసభ ఎంపీ. తెలుగుదేశం పార్టీ తరపున ఎంపిక చేసిన రాజ్యసభ అభ్యర్థుల్లో ఆయన ఒకరు. ఆ పార్టీకి ఉన్న బలం దృష్ట్యా ఆయన ఎంపీ కావడం ఖాయం. రాజ్యసభ అంటే పెద్దల సభ అన్న అర్థం మారిపోయి చాలా కాలం అయింది కాబట్టి పార్టీలతో సంబంధం లేని వారు ఈ సీట్లలోకి వస్తుండటం పెద్ద విషయం కాదు. కానీ ఇంతకు ముందు ఉన్న ఎంపికలన్నిటిపైనా ఇష్టం లేకపోయినా వ్యతిరేకత అయితే ఉండేది కాదు. కానీ తెలుగుదేశంలో మొట్టమొదటి సారి ఈ ఎంపికపై బహిరంగంగానే వ్యతిరేకత వచ్చింది. నాయకుల స్థాయిలో ఎవరూ మాట్లాడకపోయినా పార్టీ క్యాడర్ మాత్రం అసంతృప్తితో ఉంది.
ఎవరీ సానా సతీష్ బాబు..?
తెలుగుదేశం పార్టీ రాజ్యసభ అభ్యర్థిగా ఎంపికైన సానా సతీష్ ఎవరు...? Who is Sana Sathish Babu..?
సానా సతీష్ బాబుది కాకినాడ. మెకానికల్ ఇంజనీరింగ్ చదివిన ఆయనకు కారుణ్య నియామకం కింద విద్యుత్ శాఖలో సబ్ ఇంజనీర్‌గా చేరారు. పదేళ్ల ఉద్యోగం చేశాక రాజీనామా చేసి హైదరాబాద్ చేరారు. చాలా తక్కువ వ్యవధిలో వ్యాపార పరంగా ఎదిగారు. రియల్ ఎస్టేట్, ఐటీ, పవర్ అండ్ ఎనర్జీ, సీపోర్టు రంగాల్లోని కంపెనీల్లో పార్టనర్‌గా చేరారు. MEDALENE, VANPIC సీపోర్ట్, MAHA KALPA ఇన్ ఫ్రా, Matrix Natural Resources వంటి భారీ కంపెనీల్లో భాగస్వామ్యం ఉంది. క్రికెట్ పై మక్కువ ఉన్న ఆయన తూర్పుగోదావరి క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శిగా చాలాకాలం ఉన్నారు.
టీడీపీలో హవా
సతీష్‌బాబు టీడీపీలో క్రీయాశీలకంగా ఉన్న వ్యక్తేం కాదు. ఆ పార్టీలో చాలామందికి ఆయన ఎవరో తెలీదు కూడా..! సానా పేరు ఇంతకుముందు కూడా వినిపించినప్పుటికీ .. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కువుగా మారుమెగింది. కొన్ని నెలల కిందటే.. సతీష్ బాబు తెలుగుదేశం క్రియాశీలక రాజకీయాల్లో తెరమందుకు వస్తున్నారని ప్రచారం జరిగింది. తెరవెనుక ఆయన చేసే పనులపై ఎప్పటి నుంచో మాట్లాడుకుంటున్నారు. మొదటి నుంచీ లాబీయిస్టుగా ఉన్న సతీష్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా లాబీయింగ్ చేసినట్లు ఆరోపణలున్నాయి.
సీబీఐలో కుంపట్లు- ఈడీ కేసులు
సానా సామాన్యుడు కాదు.. చానా చరిత్ర ఉంది అని ఎందుకు చెప్పాం అంటే ఆయన బ్యాక్ గ్రౌండ్ అలాంటిది మరి.. ఒక సామాన్య ఉద్యోగిగా ఉండి.. కోట్ల రూపాయల సామ్రాజ్యం నిర్మించడం మాత్రమే కాదు.. సీబీఐ, ఈడీ కేసుల్లోనూ ఆయన పేరు మారుమోగింది. ఏకంగా ఇద్దరు సీబీఐ డైరక్టర్ల మధ్య గొడవే రగిల్చింది. మనీలాండరింగ్ కేసుల్లో ఈడీ ఆయన్ను అరెస్టు చేసింది. 2017లో సంచలనం సృష్టించిన మీట్ ఎక్స్‌పోర్టర్ మెయిన్ ఖురేషీ కేసులో మెయిన్ పాత్రదారి సానా సతీష్. మనీ లాండరింగ్ చేశారని ఆయన్ను అప్పుడు ఈడీ అదుపులోకి తీసుకుంది.
అప్పట్లో సతీష్ ఇచ్చిన స్టేట్‌మెంట్ సీబీఐలో కుంపట్లు రాజేసింది. ఏకంగా ఆ సంస్థ స్పెషల్ డైరక్టర్ రాకేష్ ఆస్థానాపై కేసు నమోదైంది. అప్పటి డైరక్టర్ ఆలోక్ వర్మ పదవి ఊడిపోయింది. ప్రత్యేక డైరక్టర్, చాలా మంది సీనియర్ అధికారులకు స్థానచలనం కలిగింది. మెయిన్ ఖురేషీ కేసులో సతీష్ ను విచారణకు పిలిచి వేధించకుండా ఉండేందుకు అప్పటి స్పెషల్ డైరక్టర్ రాకేష్ ఆస్థానాకు డబ్బులు ఇచ్చినట్లుగా సతీష్ చెప్పినట్లు ఆరోపణలు వచ్చాయి. దాని ఆధారంగానే రాకేష్ పై సీబీఐ కేసు నమోదు చేసింది. 2017 అక్టోబర్ , నవంబర్ లో ప్రతీవారం విచారణకు రావలసిందిగా సీబీఐ సమన్లు పంపింది. అయితే భవిష్యత్‌లో విచారణ పేరుతో వేధించకుండా ఉండేందుకు ఐదు కోట్లు చెల్లించేందుకు ఒప్పందం కుదురిందని మూడు కోట్లు సీబీఐ అధికారులకు ముడుపుల రూపంలో ఇచ్చారని సతీష్ చెప్పినట్లు వార్తలు వచ్చాయి. ఈ విషయం బయటకు వచ్చాక రాకేష్‌పై కేసు నమోదైంది. ఆ తర్వాత ఆయన.. మిగిలిన రెండుకోట్లు డైరక్టర్ అలోక్ వర్మకు ఇస్తున్నారని ఆరోపణలు చేశారు. దీంతో డైరక్టర్ – స్పెషల్ డైరక్టర్ మధ్య యుద్ధమే జరిగింది. ఈ దెబ్బతో ప్రభుత్వం ఇద్దరినీ తొలగించి.. మన్నెం నాగేశ్వరరావును డైరక్టర్‌గా నియమించింది. ఆ కేసు ఇప్పటికీ కొనసాగుతోంది.
పవన్‌తో పోటీ – అప్పుడు ఓటమి ఇప్పుడు గెలుపు
చంద్రబాబు స్కిల్ కేసులో అరెస్టైనప్పుడు.. తూర్పుగోదావరి జిల్లాలో తెలుగుదేశం కార్యక్రమాల నిర్వహణకు సతీష్ ఆర్థికంగా అండగా నిలబడ్డారని.. ఆ కారణంతో ఆయన ఎన్నికలకు ముందు కాకినాడ లోక్‌సభ టికెట్ కోసం ప్రయత్నించారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. అయితే కాకినాడ టికెట్‌ను పవన్ తన సన్నిహితుడైన ఉదయ్‌కు ఇప్పించే విషయంలో చాలా పట్టుదలగా వ్యవహరించారు. దీంతో సానాకు టికెట్ దక్కలేదు. అప్పుడు పవన్ కారణంగా ఆయనకు చేదు అనుభవం ఎదురైంది. ఈసారి రాజ్యసభ విషయంలో మళ్లీ పవన్ కల్యాన్‌ను ఫేస్ చేయాల్సి వచ్చింది. . టీడీపీ నుంచి సానా సతీష్, జనసేన నుంచి పవన్ కల్యాన్ సోదరుడు నాగబాబు పోటీకి వచ్చారు. ఈ సారి సానా సతీష్ తన అభ్యర్థిత్వం విషయంలో గట్టిగా నిలబడటంతో ఆయనకు టికెట్ ఇచ్చి.. పవన్ ను శాంతింపజేయడం కోసం చంద్రబాబు నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకోవలసి వచ్చింది.