Harish Rao News: సీఎం రేవంత్ సొంత జిల్లాలోనే ఇంత దారుణమా? రాష్ట్ర వ్యాప్తంగా భయానక పరిస్థితులు: హరీష్ రావు
Telangana News సీఎం రేవంత్ సొంత జిల్లాలోనే వరుష ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతున్నాయంటే రాష్ట్ర వ్యాప్తంగా భయానక పరిస్థితులు ఎలా ఉంటాయో అర్థం చేసుకోవచ్చునని బీఆర్ఎస్ నేత హరీష్ రావు అన్నారు.
Harish Rao slams Revanth Reddy over food poison incidents in Telangana | హైదరాబాద్: సొంత జిల్లాను పట్టించుకోని నిర్లక్ష్యపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు మండిపడ్డారు. విగ్రహాల మీద ఉన్న ధ్యాస విద్యార్థుల మీద లేదా? గురుకులాల్లో వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతుంటే ఏం చేస్తున్నారని ప్రభుత్వాన్ని నిలదీశారు. ఢిల్లీ పెద్దలను ప్రసన్నం చేసుకోవడంపై రేవంత్ రెడ్డికి ఉన్న ధ్యాస, పిల్లల భవిష్యత్తుపై లేదా? అని ప్రశ్నించారు.
రాష్ట్రం సంగతి దేవుడెరుగు, సొంత జిల్లాలో ఇంత దారుణమా
రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని పట్టించుకోవడం కాదు, కనీసం ఆయన సొంత జిల్లాలోని గవర్నమెంట్ స్కూల్స్, గురుకులాలను సైతం పట్టించుకోని నిర్లక్ష్యపు ముఖ్యమంత్రి అంటూ నిప్పులు చెరిగారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల్లో వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలు జరిగాయి. పలు సందర్భాలలో ప్రభుత్వ హాస్టల్ విద్యార్థులు ఆసుపత్రుల పాలవుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు? సీఎం రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నారని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు నిలదీశారు.
విగ్రహాల మీద ఉన్న ధ్యాస విద్యార్థుల మీద లేదా?
— Harish Rao Thanneeru (@BRSHarish) December 10, 2024
ఢిల్లీ పెద్దలను ప్రసన్నం చేసుకోవడం పై ఉన్న ధ్యాస, పిల్లల భవిష్యత్తు పై లేదా?
రాష్ట్ర వ్యాప్తంగా కాదు, కనీసం సొంత జిల్లా ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలను సైతం పట్టించుకోని నిర్లక్ష్యపు ముఖ్యమంత్రి ఈ @revanth_anumula
ఉమ్మడి మహబూబ్… pic.twitter.com/KDq8DtPuMM
వరుసగా ఫుడ్ పాయిజన్ ఘటనలపై హరీష్ రావు ఫైర్
10 రోజులు కాకముందే తాజాగా వికారాబాద్ జిల్లా తాండూరు గిరిజన బాలికల హాస్టల్ లో ఫుడ్ పాయిజన్ జరిగి 15 మంది ఆసుపత్రి పాలయ్యారని హరీష్ రావు తెలిపారు. సీఎం రేవంత్ సొంత జిల్లాలోనే పరిస్థితి ఇలా ఉంటే, తెలంగాణ వ్యాప్తంగా పరిస్థితులు ఇంకెంత దారుణంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా వరుస ఫుడ్ పాయిజన్ కేసులు నమోదవుతున్నా ప్రభుత్వం మొద్దు నిద్ర వీడక పోవడం దుర్మార్గం. విద్యార్థులు ప్రాణాలు కోల్పోతున్నా పట్టించుకోవడం లేదని హరీష్ రావు ఆరోపించారు. విద్యార్థులకు కల్తీ ఆహారం పెడితే జైలుకు పంపిస్తామని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఇప్పుడు మాటలు నీటి మూటలే అయ్యాయని.. కాంగ్రెస్ ది మాటల సర్కారే కానీ చేతల ముఖ్యమంత్రి కాదు, చేతల ప్రభుత్వం కాదని విమర్శించారు. ప్రభుత్వం నిర్లక్ష్యతో రాష్ట్రంలో ఇంకెంత మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోవాలి? ఇంకెందరు ఆస్పత్రి పాలు కావాలని హరీష్ రావు మండిపడ్డారు.
తాము ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని చెప్పి బాలికలు ఆవేదన వ్యక్తం చేశారు. ఆహారంలో నాణ్యతా లోపం కారణంగా పదే పదే ఫుడ్ పాయిజన్ జరిగి విద్యార్థినులు వాంతులు చేసుకుంటున్నారు. తలనొప్పి, విరేచనాలు, ఇతర అనారోగ్య సమస్యలతో ఆస్పత్రుల్లో చేరి చికిత్స పొందుతున్నామని బాలికలు తెలిపారు. కానీ ప్రభుత్వం దీనిపై స్పందించి ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ప్రభుత్వ స్కూళ్లు, గురుకుల విద్యార్థులు, విద్యార్థినుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.