Balance Test: ఇలా ఒంటికాలిపై పది సెకన్ల పాటూ నిల్చోగలరా? ఈ టెస్టు మీ ఆయువు గురించి చెప్పేస్తుంది
ఆరోగ్యాన్ని పరీక్షించుకోవడానికి చిన్న చిన్న బ్యాలెన్స్ టెస్టులు కూడా బాగా పనిచేస్తాయి.
మనిషి సామర్థ్యాన్ని అంచనా వేయడానికి పెద్ద పెద్ద టెస్టులు అవసరం లేదు, చిన్న పరీక్షలు సైతం వారి శరీర సమర్థలను అంచనా వస్తాయి. శరీరాన్ని సమతుల్యం చేయగల వ్యక్తి దీర్ఘాయువును కలిగి ఉంటాడు. ఒక వ్యక్తి ఎంత ఆరోగ్యంగా ఉన్నాడు, ఎంత కాలం అతను జీవించగలడో నిర్ధారించడానికి బ్యాలెన్స్ టెస్టును కూడా పరీక్షల జాబితాలో చేర్చాలని వాదిస్తున్నారు కొంతమంది ఆరోగ్యనిపుణులు. బ్యాలెన్స్ టెస్టు చాలా సింపుల్ గా ఉంటుంది. దీని ద్వారా వ్యక్తి ఆయువుప్రమాణాన్ని తెలుసుకోవచ్చని అంటున్నారు వైద్యులు.
ఏంటి బ్యాలెన్స్ టెస్ట్?
ఒంటి కాలిపై నిల్చోవాలి. అలాగని నేలపై ఆన్చిన పాదం వెనుక వైపు కాస్త పైకెత్తి ఉంచాలి. అంటే పాదం ముందువైపును మాత్రమే నేలపై ఆన్చి మొత్తం బ్యాలెన్స్ చేయాలి. ఇలా పది సెకన్ల పాలూ నిల్చోవాలి. పదిసెకన్లే కదా అని తీసిపారేయకండి చాలా మంది చేయలేకపోయారు. ఈ బ్యాలెన్స్ టెస్టు చాలా శక్తిమంతమైనది అంటున్నారు వైద్యులు. ఇది ఆరోగ్యాన్ని, ఆయువును కూడా తేల్చిచెబుతుందని అంటున్నారు. అందుకు వారు చేసిన అధ్యయనమే సాక్ష్యం. ఈ బ్యాలెన్స్ టెస్టులో పాల్గొంటున్నప్పుడు బూట్లు, సాక్సులు తీసివేయాలి. చేతులను నడుము మీద పెట్టుకోవాలి.
అధ్యయన ఫలితం
అధ్యయనంలో ఈ బ్యాలెన్స్ టెస్టును ప్రతి అయిదుగురిలో ఒకరు విఫలమైనట్టు తేలింది. వారిలో 71 నుంచి 75 ఏళ్ల వయసు గలవారిలో 54 శాతం మంది విఫలమయ్యారు. 51 నుంచి 55 వయసు వారిలో 5 శాతం మంది విఫలమయ్యారు.బ్రిటిష్ జర్నల్ ఆఫ్ స్పోర్ట్స్ మెడిసిన్ లో ప్రచురించిన కథనం ప్రకారం ఈ బ్యాలెన్స్ టెస్టులో పాల్గొన్న వారికి ఏడేళ్ల పాటూ ఫాలో అప్ చేశారు అధ్యయనకర్తలు. వారిలో ఏడు శాతం మంది మరణించినట్టు కనుగొన్నారు. పదిసెకన్ల పాటూ ఒంటి కాలిపై నిలబడలేకపోవడం ముందస్తు మరణ ప్రమాదాన్ని 84 శాతం పెరుగుతుందని నిపుణులు నిర్ధారించారు.
అధిక శాతం మంది ఒంటి కాలిపై పది సెకన్లు కూడా నిల్చోలేకపోయారు. అయితే దీనికి కచ్చితంగా కారణాన్ని మాత్రమ చెప్పలేము అంటున్నారు అధ్యయనకర్తలు. వారి ఆరోగ్య సరిగా లేకపోవడం, శక్తి హీనంగా ఉండడం వంటివి కారణాలు కావచ్చు. అధ్యయనంలో ఎందుకు ఒంటికాలిపై ఎక్కువ శాతం మంది ప్రజలు నిల్చోలేకపోయారు అనే దానికి సరైన కారణం చెప్పలేకపోయారు. అందుకే దీన్ని గందరగోళ కారకాలతో కూడిన పరిశీలనాత్మక అధ్యయనంగా చెప్పారు శాస్త్రవేత్తలు.
ఇది చాలా సింపుల్ టెస్టు కాబట్టి మీరూ ఇంటి దగ్గర ప్రయత్నించవచ్చు. ఒకవేళ పది సెకన్ల పాటూ నిల్చోలేకపోతే భయాందోళనలకు గురి కావద్దు. మంచిగా ఆహారాన్ని తింటూ, వ్యాయామం చేస్తూ ఉంటే బ్యాలెన్స్ టెస్టులో విజయం సాధిస్తారు.
Also read: బొప్పాయి, నిమ్మరసం కలిపి తినకూడదా? విషంగా మారుతుందా?