(Source: ECI/ABP News/ABP Majha)
Hair Care: ఓ మై గాడ్, మహిళలకూ బట్టతల వస్తుందా? ఎందుకొస్తుంది? చికిత్స ఉందా?
బట్టతల మగవారికే కాదు ఆడవాళ్ళకి వస్తుందట. అందుకే జుట్టు ఎక్కువగా రాలిపోతుంటే అశ్రద్ధ చెయ్యకండి.
బట్టతల అనగానే అది పురుషులకి వస్తుందని అనుకుంటారు. కానీ స్త్రీలకి కూడా వస్తుందండోయ్. అయితే బట్టతల మహిళలకి వస్తే చూడటానికి అందవిహీనంగా కనిపిస్తారు. అది వాళ్ళ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. అందుకే జుట్టు రాలడాన్ని నియంత్రించాలి. లేదంటే ఆడవాళ్ళు కూడా బట్టతల బారిన పడే పరిస్థితి వచ్చేస్తుంది.
జుట్టు పల్చన పడిపోతూ రాలిపోతుంటే అసలు అశ్రద్ధ చేయవద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మహిళల్లో జుట్టు ఎక్కువగా రాలిపోవడాన్ని ఆండ్రోజెనెటిక్ అలోపేసియా అని పిలుస్తారు. విపరీతంగా రాలిపోతూ ఉంటుంది. దాని వల్ల తల మాడు మీద జుట్టు లేకుండా చివరికి బట్టతల వచ్చేస్తుంది. కాలుష్యం, ఒత్తిడి, మానసిక ఆందోళనతో పాటు రకరకాల కారణాల వల్ల జుట్టు రాలిపోవడం జరుగుతుంది. మహిళల్లో బట్టతల వస్తుందనేది మూడు విధాలుగా ఉంటుంది.
టైప్ 1: జుట్టు సన్నగా అయిపోతుంది
టైప్ 2: మాడు మీద జుట్టు అంటే పాపిట తీసుకునే భాగంలో జుట్టు పల్చబడటం జరుగుతుంది
టైప్ 3: స్కాల్ఫ్ పైభాగంలో జుట్టు ఊడిపోయి మాడు స్పష్టంగా కనిపిస్తుంది
మహిళల్లో బట్టతల రావడానికి కారణాలు
హార్మోన్లు: ఆండ్రోజెన్ స్థాయిలు పెరగడం వల్ల జుట్టు రాలడం, పల్చబడటం జరుగుతుంది.
జన్యుపరంగా: అనాజెన్ దశకి వస్తే జుట్టు రాలడం, కొత్త జుట్టు పెరుగుదలకి ఎక్కువ సమయం తీసుకోవడం జరుగుతుంది. అలాగే మందంగా ఉన్న జుట్టు పొట్టిగా, సన్నగా మారిపోతుంది.
విటమిన్ లోపాలు: 50 శాతం కంటే ఎక్కువ మంది స్త్రీలు ఐరన్ లోపం వల్ల రక్తహీనతతో బాధపడుతున్నారు. ఇది జుట్టు రాలడాన్ని మరింత ఎక్కువ చేస్తుంది. అలాగే జుట్టు కూడా పెరగకుండా చేస్తుంది.
వృద్ధాప్యం: మెనోపాజ్ తర్వాత ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ ఉత్పత్తి తక్కువగా ఉండటం వల్ల జుట్టు రాలడం జరుగుతుంది. ఈ హార్మోన్లు జుట్టు పెరుగుదలని ప్రోత్సాహిస్తాయి.
ఒత్తిడి: తీవ్ర మానసిక ఆందోళన, ఒత్తిడి వల్ల కూడా జుట్టు రాలిపోతుంది. అధిక ఒత్తిడి వల్ల కార్టికొస్టె రాన్ స్థాయిలని పెంచుతుంది. దీని వల్ల వెంట్రుకల కుదుళ్లు విశ్రాంతి దశలోకి వెళ్ళిపోవడం వల్ల కొత్త జుట్టు పెరగకుండా ఆగిపోతుంది.
అంతర్గత వ్యాధులు: డయాబెటిస్, హైపర్ టెన్షన్, క్యాన్సర్ వంటి ఇతర దీర్ఘకాలిక పరిస్థితులు కూడా జుట్టు రాలడానికి దారితీస్తాయి. ఎందుకంటే వెంట్రుకల కుదుళ్ళకి ఆక్సిజన్, పోషకాల పరిమితంగా అందుతాయి. బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ వెంట్రుకల కుదుళ్ళ మీద దాడి చేయడం వల్ల జుట్టు రాలడానికి కారణమవుతుంది.
స్కాల్ఫ్ డిసీజ్: రింగ్ వార్మ్, సోరియాసిస్ లేదా చుండ్రు వంటి ఫంగల్ ఇన్ఫెక్షన్ వల్ల కూడా జుట్టు రాలిపోతుంది.
బట్టతల అనేది అతి కొద్ది మంది స్త్రీలని మాత్రమే ప్రభావితం చేస్తుంది. దీన్ని త్వరగా గుర్తించి చికిత్స తీసుకుంటే సమస్య నుంచి బయటపడొచ్చని వైద్యులు సూచిస్తున్నారు.
చికిత్స
మొదటగా జుట్టు మీద ప్రయోగాలు చేయడం మానుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎంత త్వరగా చికిత్స ప్రారంభిస్తే అంత మంచి ఫలితాలు పొందుతారు. స్కాల్ఫ్, హెయిర్ హెల్త్ ని బట్టి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. మగవారి బట్టతలతో పోలిస్తే ఆడవారి బట్టతలకి చికిత్స చేయడం సవాలుతో కూడుకున్న విషయం. జుట్టు పెరగడానికి మందులు వేసుకోవడంతో పాటు ప్లేట్ లేట్ రిచ్ ప్లాస్మా(PRP) చికిత్స తీసుకోవచ్చు. ఈ ప్రక్రియలో భాగంగా రోగి నుంచి 20 ఏంఎల్ రక్తాన్ని తీసుకుని ప్లేట్ లేట్ వేరు చేయడం కోసం సెంట్రీఫ్యూజింగ్ చేయడం జరుగుతుంది. స్కాల్ఫ్ ను శుభ్రం చేసిన తర్వాత PRP జుట్టు కుదుళ్ళలోకి ఇంజెక్ట్ చేస్తారు. ఇది జుట్టు రాలడాన్ని నియంత్రిస్తుంది. 6-9 నెలల్లో జుట్టు పెరుగుదలని ప్రోత్సహిస్తుంది. వీటితో పాటు పోషకాలు నిండిన ఆహారం తీసుకోవాలి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఆహారం లేదా సప్లిమెంట్స్ రూపంలో కూడా తీసుకోవచ్చు.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also Read: మధుమేహాన్ని అదుపులో ఉంచాలా? జస్ట్, ఈ సింపుల్ చిట్కాలు పాటిస్తే చాలు