Corona Virus: కరోనాలాంటి వైరస్‌లను అంతం చేయలేం... పర్యావరణంలో భాగంగా కలిసిపోవడమే వాటి ముగింపు, WHO కీలక వ్యాఖ్యలు
కరోనా వైరస్‌కు సంబంధించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు ప్రపంచవ్యాప్త ఆరోగ్య సంస్థ అధికారి.
కరోనా వైరస్‌కు అంతం లేదా? అది మన జీవితంలో భాగమైపోవాల్సిందేనా? దానితో సహజీవనం చేస్తూ బతకాల్సిందేనా? తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికారి చేసిన వ్యాఖ్యలు వింటే ఈ సందేహాలు రాకమానవు. కోవిడ్ - 19 వైరస్‌ను అంతం చేయడం సాధ్యం కాదని, అలాంటి మహమ్మారి వైరస్‌లు పర్యావరణ వ్యవస్థలో భాగమవుతాయని అన్నారు ప్రపంచఆరోగ్య సంస్థలోని ఓ ఉన్నతాధికారి. అయితే ఈ ఏడాది కరోనా వైరస్ కారణంగా ప్రపంచంలో ఏర్పడిన అత్యవరసర ఆరోగ్య స్థితి మాత్రం మారుతుందని, సాధారణ జీవితం సాధ్యమవుతుందని తెలిపారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ ఏర్పాటు చేసిన దావోస్ ఎజెండా 2022 సమ్మిట్లో ప్రపంచ ఆరోగ్యసంస్థ హెల్త్ ఎమెర్జెన్సీ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మైకెల్ ర్యాన్ ఈ విధంగా మాట్లాడారు. ప్రపంచ జనాభాలో అధికశాతం మంది టీకాలు వేసుకోవడం వల్ల కోవిడ్ తీవ్రత తగ్గిందని, ఇదే కొనసాగితే ఈ ఏడాది ప్రపంచంలో ప్రజారోగ్య అత్యవసర స్థితికి ముగింపు పలకవచ్చని అభిప్రాయపడ్డారు. అదే కరోనాకు కూడా ముగింపు అనుకోవాలి తప్ప, పూర్తిగా ఆ వైరస్‌ను అంతం చేయడం అసాధ్యమని చెప్పారు.
33 కోట్ల కేసులు
2019 ఏడాది చివరలో చైనాలోని వూహాన్లో వెలుగుచూసిన ఈ మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా పాకింది. ఇప్పటివరకు దాదాపు 33 కోట్ల మందికి సోకింది. 55.5 లక్షల మంది ఆ వైరస్ కారణంగా మరణించినట్టు రికార్డులు చెబుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ జనవరి 30, 2020న ఈ వైరస్ వ్యాప్తిని ‘అంతర్జాతీయ ప్రజారోగ్య అత్యవసర పరిస్థితి’గా, మార్చి 11, 2020న కరోనాను ‘మహమ్మారి’గా ప్రకటించింది. ఇంతవరకు ఆ అత్యవసర పరిస్థితిని ఎత్తేయలేదు. దశల వారీగా వేరియంట్లు దాడి చేస్తుండడంతో వివిధ దేశాల్లో ఇంకా లాక్డౌన్లు, ప్రయాణ నిషేధాలు అమలులో ఉన్నాయి. ఇప్పుడు ఒమిక్రాన్ వేరియంట్ చాలా జోరుగా వ్యాప్తి చెందుతుండడంతో మళ్లీ కరోనా ఆంక్షలు, నిర్భంధాలు మొదలయ్యాయి.
WHO ప్రకారం, 194 సభ్యదేశాల్లో 36 దేశాల్లో 10 శాతం కంటే తక్కువ టీకాలు వేశారు. అలాగే 88 దేశాల్లో 40శాతం కన్నా తక్కువ టీకాలు ప్రజలకు వేశారు. ఎంత త్వరగా వ్యాక్సినేషన్ పూర్తయితే అంత త్వరగా ఆంక్షలు లేని, నిర్భంధాలు లేని జీవితాన్ని తిరిగి పొందవచ్చు.