Varalakshmi Vratam Special Recipes : వరలక్ష్మీ వ్రతం ప్రసాదాలు.. పులిహోర, పాయసం, దద్ద్యోజనం ఇలా సింపుల్‌గా చేసేయండి
Varalakshmi Vratam Recipes : వరలక్ష్మీ వ్రతం చేసుకుంటున్నారా? ఈ సమయంలో పులిహోర, పాయసం, దద్ద్యోజనం ఈజీగా చేసుకునేందుకు దీనిని ఫాలో అయిపోండి.

Sravana Masam 2025 Special Recipes : శ్రావణమాసంలో చాలామంది వరలక్ష్మీ వ్రతం చేసుకుంటారు. దీనిలో భాగంగా ప్రసాదాలు తయారు చేస్తారు. వివిధ రకాల ప్రసాదాలు చేసి అమ్మవారికి నైవేద్యంగా పెడతారు. అయితే వ్రతం రోజు ఎక్కువ పని లేకుండా.. తక్కువ సమయంలో పులిహోర, పాయసం, దద్ద్యోజనం ఈజీగా ఎలా చేసుకోవచ్చో.. సింపుల్ ట్రిక్‌తో వీటిని త్వరగా, రుచిగా ఎలా చేయవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
సింపుల్ ట్రిక్‌తో చక్కటి రెసిపీలు
పులిహోర, పాయసం, దద్ద్యోజనం విడివిడిగా కాకుండా.. ఒకేసారి చేసుకోవచ్చు తెలుసా? అదెలా అనుకుంటున్నారా? వీటికోసం అన్నం విడిగా కాకుండా.. ఒకేసారి వండుకొని.. దానిని విభజించి.. వివిధ రెసిపీలుగా మలచుకోవచ్చు. దీనికోసం మూడు కప్పుల బియ్యాన్ని తీసుకుని.. కుక్కర్లో వేసి ఆరు కప్పుల నీటిని వేసి.. రెండు విజిల్స్ రానివ్వాలి. వెంటనే విజిల్ తీసి ప్రెజర్‌ని తీసేయాలి. ఇప్పుడు అన్నంతో పులిహోర, పాయసం, దద్ద్యోజనం ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం.
ముందుగా అన్నాన్ని 60, 40 భాగాలుగా విభజించుకోవాలి. పులిహోరకు 60 శాతం. మిగిలింది దద్ద్యోజనం, పాయసానికి. 40 శాతం అన్నంలో పాలు అరలీటర్ పాలు పోసి పాలు అన్నాన్ని పీల్చుకునేంతవరకు ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత దానిలో 20 శాతం రైస్ తీసి దద్ద్యోజనం కోసం పక్కన పెట్టుకోవాలి. కుక్కర్లో మిగిలిన అన్నంలో మరో అరలీటర్ పాలు పోసి మెత్తగా ఉడకనివ్వాలి.
పాయసం రెసిపీ
స్టౌవ్ వెలిగించి కడాయిపెట్టి దానిలో ఒకటిన్నర కప్పుల బెల్లం వేసి.. కాస్త నీళ్లు వేయాలి. బెల్లం కరిగాక ఓ పొంగు వచ్చాక పక్కన పెట్టేయాలి. పాలుపోసి ఉడికించిన అన్నం మెత్తగా అయ్యాక స్టౌవ్ ఆపేయాలి. దానిలో యాలకుల పొడి వేసుకోవాలి. రెండు టీస్పూన్ల నెయ్యి, చిటికెడు పచ్చకర్పూరం వేసుకోవాలి. ఇప్పుడు ముందుగా సిద్ధం చేసుకున్న పాకం వేసి బాగా కలపాలి. అనంతరం స్టౌవ్ వెలిగించి చిన్నమంటపై మరో 15 నిమిషాలు ఉడికించుకోవాలి. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ రోస్ట్ చేసుకుని దానిలో వేసి స్టౌవ్ ఆపేస్తే పాయసం రెడీ.
పులిహోర రెసిపీ
అన్నంలో టీస్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్, రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి కలుపుకోవాలి. ఇప్పుడు తాలింపు కోసం ఓ చిన్న కడాయిలో రెండు టేబుల్ స్పూన్ల నూనె తీసుకోవాలి. అది కాగిన తర్వాత దానిలో వేరుశనగలు, ఆవాలు వేసి వేయించుకోవాలి. అనంతరం మినపప్పు, శనగపప్పు వేసి వేయించుకోవాలి.
పావు టీస్పూన్ ఇంగువ, ఎండుమిర్చి, జీలకర్ర, అల్లం ముక్కలతో పాటు, కరివేపాకు వేసుకుని బాగా కలపాలి. తాలింపు వేగిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న అన్నంలో వేసి కలపాలి. అనంతరం రెండు టేబుల్ స్పూన్ల నిమ్మరసం పిండి పులిహోరను బాగా కలుపుకోవాలి. అంతే టేస్టీ టేస్టీ పులిహోర రెసిపీ రెడీ.
దద్ద్యోజనం రెసిపీ
రెండు టేబుల్ స్పూన్ల నూనెలో ఆవాలు, మినపప్పు, పచ్చిశనగపప్పు వేసి వేయించాలి. అవి వేగిన తర్వాత జీలకర్ర, ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి. కరివేపాకు, ఇంగువ వేసి మరింత వేయించుకోవాలి. ఈ తాళింపును ముందుగా సిద్ధం చేసుకున్న అన్నంలో వేసుకోవాలి. ఇప్పుడు బాగా కలిపిన తర్వాత దానిలో తగినంత ఉప్పు వేసుకుని.. దానిలో పెరుగు వేసుకుని బాగా కలుపుకోవాలి. అంతే దద్ద్యోజనం కూడా రెడీ అయిపోనట్లే.
వ్రత సమయంలో వంటగదిలో ఎక్కువసేపు టైమ్ గడపాలి అనుకోనివారు ఇలా సింపుల్‌గా పులిహోర, దద్యోజనం, పాయసం తయారు చేసుకోవచ్చు.






















