vangiBath: వాంగీ బాత్, వంకాయలతో ఇలా వేడి వేడి రైస్ చేసి తింటే అదిరిపోతుంది
వంకాయలతో చేసే టేస్టీ రైస్ వాంగీ బాత్.
వంకాయల పేరు చెప్పగానే కొంతమంది ముఖం ముడుచుకుంటారు, కానీ వాంగీ బాత్ తింటే మళ్ళీ మళ్ళీ కావాలని అడుగుతారు. వంకాయలు అనగానే అందరూ గుత్తి వంకాయ కూరనే గుర్తు చేసుకుంటారు. దానికి మించిన రుచిగా ఉంటుంది వాంగీ బాత్. తెలుగులో చెప్పాలి అంటే వంకాయ రైస్. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. దీని తయారు చేయడం కూడా చాలా సులువు. పిల్లల కోసం లంచ్ బాక్సులు పెట్టే సమయం ఆసన్నమైంది. సింపుల్ గా వాంగిబాత్ పెడితే మీకు సమయం కలిసొస్తుంది. వారికి రుచిగానే ఉంటుంది. ఇందులో పోషక విలువలు కూడా ఎక్కువే. కాబట్టి దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం.
కావాల్సిన పదార్థాలు
బియ్యం - ఒకటిన్నర కప్పు
వంకాయలు - పావుకిలో
ఉల్లిపాయలు - మూడు
క్యాప్సికం - ఒకటి
నెయ్యి - రెండు టీ స్పూన్లు
వేరుశెనగ పలుకులు - మూడు టేబుల్ స్పూన్లు
ఆవాలు - ఒక స్పూను
వాంగీ బాత్ పౌడర్ - ఒక స్పూన్
నీళ్లు - మూడున్నర కప్పులు
శెనగపప్పు - ఒక స్పూను
కొత్తిమీర తురుము - రెండు స్పూన్లు
మినప్పప్పు - ఒక స్పూను
ఉప్పు - రుచికి సరిపడా
పసుపు - అర స్పూన్
తయారీ ఇలా
1. వాంగీ బాత్ పౌడర్ మార్కెట్లో దొరుకుతుంది. అన్ని సూపర్ మార్కెట్లను ఇది అందుబాటులో ఉంటుంది. కొని తెచ్చుకుంటే సరిపోతుంది.
2. అన్నాన్ని ముందుగానే వండుకోవాలి. మరీ మెత్తగా కాకుండా పొడిపొడిగా వండుకోవాలి.
3. ఉల్లిపాయలు, వంకాయలు పొడవుగా ముక్కలు కోసుకుని పెట్టుకోవాలి.
4. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నెయ్యి వేయాలి.
5. అందులో ఆవాలు, శెనగపప్పు, మినప్పప్పు వేసి వేయించాలి.
6. అవి వేగాక పల్లీలు కూడా వేసి వేయించాలి. తర్వాత నిలువుగా కోసిన ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకులు వేసి వేయించాలి.
7. ఆ తరువాత క్యాప్సికంలు, వంకాయ ముక్కలు కూడా వేయించాలి.
8. మూత పెట్టి రెండు నిమిషాలు ఉంచాలి. ఇప్పుడు ముందుగా వండి పెట్టుకున్న అన్నాన్ని వేసి కలపాలి.
9. దీనిపై కొత్తిమీర చల్లుకుంటే వాంగీ బాత్ రైస్ రెడీ అయినట్టే. ఇది చాలా రుచిగా ఉంటుంది.
10. లంచ్ బాక్స్‌కు ఉత్తమ ఎంపిక.
11. పిల్లలు, పెద్దలు ఇద్దరూ ఇష్టంగా తింటారు.
వంకాయలను తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. దీనిని తినడం వల్ల శరీరంలో కొవ్వు కరుగుతుంది. వంకాయలో శరీరానికి అత్యవసరమైన ఫోలేట్, పొటాషియం, విటమిన్ బి6, విటమిన్ బి3, యాంటీ ఆక్సిడెం్లు, మెగ్నిషియం ఉంటాయి. ఇవి గుండె పోటును, బ్రెయిన్ స్ట్రోక్ వంటివి వచ్చే అవకాశం ఉంది. మధుమేహం ఉన్న వారు వంకాయలు తినడం వల్ల మేలు జరుగుతుంది.
Also read: ఇనుపకళాయిల్లో వండుకుంటే ఆ సమస్యలన్నీ దూరం
Also read: పెళ్లయ్యాక నా భర్త ‘గే’ అని తెలిసింది, ఏం చేయమంటారు?
Also read: వేసవిలో చలువ చేసే చలిమిడి, పిల్లలకు రుచిగా చేసి ఇవ్వండి
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.