Relationships: పెళ్లయ్యాక నా భర్త ‘గే’ అని తెలిసింది, ఏం చేయమంటారు?
పెళ్లయ్యాక తన భర్తకు ఆడవాళ్లు నచ్చరని తెలుసుకున్న భార్య ఆవేదన ఇది.
ప్రశ్న: మాది పెద్దలు చేసిన వివాహం. పెళ్లయి ఏడాది అయ్యింది. కానీ ఇప్పటికీ మా లైంగిక జీవితం మొదలవలేదు. మొదట్లో నేను ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. రోజులు గడుస్తున్న కొద్ది ఆయన దగ్గర అవుతాడని అనుకున్నాను. కానీ అలా జరగలేదు. పెళ్లయిన మొదటి రాత్రి నుంచి తన పని తాను చేసుకుంటూ, నన్ను పట్టించుకోవడమే లేదు. మా లైంగిక జీవితాన్ని ప్రారంభించడానికి నేనే మొదటి అడుగు వేశాను. నేను ప్రయత్నించిన ప్రతిసారి అతను ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకుంటున్నాడు. నేను పెద్దవారికి ఇంతవరకు ఈ విషయాన్ని చెప్పలేదు. అతను ఎందుకలా చేస్తున్నాడో తెలుసుకోవడం కోసం అతనిపైన నిఘా పెట్టాను. గత వారం నాకు అతను ‘గే వెబ్ సైట్లు’ వెతకడం చూశాను. అప్పుడు నాకు విషయం అర్థమైంది. అతను ఒక గే అయ్యే అవకాశం ఉందని అర్థమైంది. ఇలాంటి సమయంలో నేను ఏం చేయాలో వివరించండి.
జవాబు: పెళ్లికూతురుగా అడుగు పెట్టాక గుండెల్లో ఎన్నో ఆశలు నిండి ఉంటాయి. కానీ మీ భర్త ప్రవర్తనతో మీరు చాలా నిరాశకు గురి అయి ఉంటారు. పెళ్లికి ముందే మీ భర్త మీకు ఈ విషయాన్ని చెప్పి అనుమతి తీసుకుంటే బాగుండేది. ఏడాది పాటు మీరు ఈ విషయాన్ని గుండెల్లోనే దాచుకున్నారంటే మీరు ఎంతో సహనశీలి అని అర్థమవుతుంది. ప్రతి విషయాన్ని అర్థం చేసుకుంటారని కూడా తెలుస్తోంది. అయితే మీలో మీరు బాధపడడం కంటే అతనితోనే ఈ విషయాన్ని నేరుగా తేల్చుకోవడం ముఖ్యం. మీ విషయంలో అతను ఏమనుకుంటున్నాడో, ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నాడో తెలుసుకోండి. ఆ సంభాషణ స్నేహపూర్వకంగా ఉండేలా చూసుకోండి. మీకు పెళ్లి అయి ఏడాది అయ్యింది, అంటే మీ జీవితంలో మీరు ఏడాదికాలాన్ని నష్టపోయారు. కానీ ఇప్పటికీ సమయం మించిపోలేదు. అతను మీతో జీవితాన్ని పంచుకోవాలని అనుకోనప్పుడు, మీరు దూరమవడమే మంచి పద్ధతి. అతనితో బలవంతంగా కాపురం చేయించడం, కలిపి ఉంచడం చాలా కష్టతరం.
ఈ విషయంలో మీరు పెద్దవాళ్ల మద్దతును కూడా తీసుకోవడం చాలా అవసరం. అది మీకు మానసికంగా కృంగిపోకుండా ధైర్యాన్ని ఇస్తుంది. మీరు ఆర్థికంగా, భౌతికంగా అన్ని రకాలుగా నష్టపోయారని అర్థం అవుతుంది. అయితే మీరు అతను ఎందుకలా చేశాడో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రస్తుత కాలంలో ప్రతి మనిషి తనకు నచ్చిన జీవితాన్ని జీవించే హక్కును కలిగి ఉన్నారు. అతను ఒకవేళ నిజంగా ‘గే’ అయినా కూడా మీరు దాన్ని ప్రశ్నించలేరు. అతని జీవనశైలిని మార్చలేరు. కాబట్టి మీ ఇద్దరికీ శాంతియుత జీవనానికి అవసరమయ్యే పరిష్కారాన్ని కనుగొనడం ముఖ్యం. అతను తన గే జీవితాన్నే గడపడానికి ఇష్టపడుతున్నట్టయితే, మీరు అతని జీవితం నుంచి బయటికి వెళ్లి కొత్త జీవితాన్ని ప్రారంభించడం ముఖ్యం. మీ వయసు చిన్నది. మళ్లీ పెళ్లి చేసుకోవడంలో ఎలాంటి తప్పులేదు. అతను గే అన్న విషయాన్ని, ఏడాదిగా మిమ్మల్ని దూరం పెట్టిన విషయాన్ని ముందుగా మీ అత్తమామలకు చెప్పండి. వారు కూడా ఈ విషయాన్ని జీర్ణించుకోవడానికి చాలా సమయం పడుతుంది. తర్వాత మీ తల్లిదండ్రులకు కూడా చెప్పండి. వారు ఎలాంటి నిర్ణయాన్ని తీసుకుంటారో అడగండి. మీరు చదువుకున్న వారైతే ముందుగా మీరు ఆర్థికంగా స్థిరపడండి. ఉద్యోగం వెతుక్కోండి. ఆర్థిక స్వాతంత్ర్యం మీకు గుండె ధైర్యాన్ని పెంచుతుంది. ఈ విషయంలో మీరు ఎలాంటి పొరపాటు నిర్ణయాలు తీసుకోకుండా మీ జీవితాన్ని మళ్ళీ అందంగా నిర్మించుకుంటారని మేము ఆశిస్తున్నాము.
Also read: వేసవిలో చలువ చేసే చలిమిడి, పిల్లలకు రుచిగా చేసి ఇవ్వండి
Also read: మనదేశంలో 10 కోట్ల మందికి పైగా మధుమేహ రోగులు, ఆ రాష్ట్రంలోనే ఎక్కువమంది
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.