(Source: ECI | ABP NEWS)
అబ్బాయిలూ, మీకు ‘అక్కడ’ నొప్పిగా ఉంటుందా? జాగ్రత్త, ప్రమాదంలో పడతారు!
వృషణాల అవగాహనా నెలగా ఈ నెల ను ప్రకటించారు కనుక ఈ సందర్భంగా వృషణాల్లో కలిగే ఇబ్బందుల గురించి, అనారోగ్యాల గురించి తెలుసుకుందాం.

వృషణాల గురించిన చాలా మంది పురుషులకు సరైన అవగాహన ఉండదు. వృషణాల సమస్యల్లో కేవలం టెస్టిక్యులార్ క్యాన్సర్ ఒకటే కాదు. రకరకాల ఇతర సమస్యలు కూడా ఉన్నాయి.
టెస్టిక్యూలార్ టోర్షన్
వృషణాలు మెలితిరిగి పోవడం
ప్రతి 4 వేల మంది యువకుల్లో ఒకరు ఈ సమస్యతో బాధపడుతున్నారు. దీని వల్ల కలిగే బాధ ఒకవైపు ఉంటే, ఈ సమస్య మొదలైన 6 గంటల్లోపు చికిత్స జరగకపోతే వృషణాలు తొలగించాల్సిన అవసరం ఏర్పడవచ్చు. నొప్పితో ఆలస్యంగా హాస్పిటల్ కు వచ్చేవారే ఎక్కువ అని నిపుణులు చెబుతున్నారు.
ఈ సమస్యలో వృషణాలు మెలితిరిగి పోవడం వల్ల వాటికి రక్త ప్రసరణ నిలిచిపోయి అవి జీవం కోల్పోతాయి. అందువల్ల ప్రభావిత వృషణం తొలగించాల్సి వస్తుందని డాక్టర్లు చెబుతున్నారు. సమస్య వచ్చినపుడు చర్చ జరగడం కంటే ప్రమాదం ఎవరికైనా ఎదురయ్యే పరిస్థితి ఉన్నపుడు దాని గురించి ముందు మాట్లాడి అవగాహన కలిగి ఉండడం అవసరమని ప్రొఫెసర్ జెమ్స్ అంటున్నారు.
చాలా మంది ఈ సమస్యను గుర్తించడంలో విఫలం అవుతారు. అందువల్ల ఈ సమస్య వచ్చినపుడు సమయం మించిపోవడం వల్ల వృషణాలను కోల్పోవలసి వస్తోందనేది నిపుణుల వాదన. దీని గురించి అవగాహన కల్పించేందుకు పాఠశాలల్లో బోధించాలని వీరి సూచన. ఇలా అవగాహన కలిగి ఉండడం వల్ల టెస్టిక్యులార్ టోర్షన్ సంకేతాలను త్వరగా గుర్తించగలుగుతారు.
ఈ లక్షణాలు కనిపిస్తే అప్రమత్తంగా ఉండాలి
వృషణాల్లో తీవ్రమైన నొప్పి, పొత్తికడుపులో నొప్పి, వాంతులు కావడం, రెస్ట్ లెస్ గా అనిపించడం. కుదురుగా ఉండలేక పోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. గంట కంటే ఎక్కువ సమయం పాటు నొప్పి కొనసాగితే వెంటనే డాక్టర్ ను సంప్రదించాలని గుర్తించగలగాలి.
నొప్పి రాగానే చాలా మంది పెయిన్ కిల్లర్స్ వాడి నొప్పి నుంచి కొన్ని గంటల పాటు ఉపశమనం పొందగలుగుతారు. సరైన చికిత్స కోసం డాక్టర్లను సంప్రదించరు. కేవలం ఆరుగంటల వ్యవధి మాత్రమే ఉందన్న అవగాహన లేకపోవడం వల్ల చాలా మంది తమ వృషణాలను కాపాడుకోలేకపోతున్నారు.
ట్విస్ట్ ఎంత తీవ్రంగా ఉన్నదన్న దాన్ని బట్టి వృషణాన్ని కాపాడడం సాధ్యపడుతుంది. చాలా మంది ఆటల్లో ఏదో దెబ్బతగిలి ఉంటుందని అనుకుంటారు. అందువల్ల చికిత్స అందడంలో జాప్యం జరుగుతోంది. శరీరంలోని అత్యంత సున్నితమైన అవయవాన్ని కోల్పోవడం వల్ల చాలామంది లో మానసిక కుంగుబాటు కనిపిస్తుంది. కొన్ని సార్లు వృషణాలు కోల్పోవడం వల్ల పొటన్సీ కోల్పోతారు. ఇది వారి జీవిత ముఖచిత్రాన్నే మార్చేస్తుంది.
పిల్లల్లో కూడా.. పెద్దలూ నిర్లక్ష్యం వద్దు
అందుకే దీని గురించిన పూర్తి అవగాహన అటు తల్లిదండ్రులకు ఇటు పిల్లలకు కలిగించడం అవసరం. అమ్మాయిలకు వక్షోజాల స్వీయ పరీక్ష గురించి తెలియజేసినట్టుగా అబ్బాయిలకు వృషణాల పరీక్ష గురించి కూడా తెలియజేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇలా చెయ్యడం వల్ల వృషణాల్లో ఏర్పడే కణితుల వంటివాటిని త్వరగా గుర్తించే వీలు ఉంటుంది. అందువల్ల వృషణాలను కాపాడుకోవడం సులభం అవుతుంది.
టెస్టిక్యులార్ టార్షన్ సమస్యకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న చికిత్స వెంటనే సర్జరీ చేసి ఆ ట్విస్ట్ ను సరిచెయ్యడం. ఇది అత్యవసర స్థితి. ఆలస్యం వల్ల వృషణాలను కోల్పోయే ప్రమాదం ఉంటుంది. ఇది స్కూల్ ఏజ్ పిల్లల నుంచి యుక్తవయసు వారి వరకు ఎవరికైనా రావచ్చు.





















