Stomach Upset: వేసవిలో పొట్ట అప్‌సెట్ అవుతోందా? అయితే తినాల్సిన ఆహారాలు, తినకూడని పదార్థాలు తెలుసుకోండి
వేసవిలో త్వరగా పొట్ట అప్‌సెట్ అవుతుంది. కొన్ని రకాల ఆహారాలను తినడం మానేస్తేనే మంచిది.
Stomach Upset: మండే ఎండల్లో తినే ఆహారాన్ని జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాలి. విందు, వేడుకల్లో పాల్గొన్నప్పుడు విలాసవంతమైన ఆహారాన్ని తిన్నాక... కొంతమందిలో పొట్ట గడబిడ మొదలవడం సహజం. పొట్టలో అసౌకర్యంగా అనిపించడం, ఇబ్బంది పడడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి వేసవిలో తినాల్సిన ఆహారాలను, తినకూడని ఆహారాలను తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కొన్ని రకాల ఆహారాలు తినడం వల్ల మలబద్ధకం, విరేచనాలు, పొట్టలో ఇన్ఫెక్షన్, అసౌకర్యం వంటివి కలుగుతాయి. అలాగే విపరీతమైన అలసట, బలహీనత వంటివి కూడా కలిగే అవకాశం ఉంది. అందుకే వేసవిలో తేలికపాటి ఆహారాన్ని మాత్రమే తినాలి. ముఖ్యంగా కొన్ని రకాల పదార్థాలు కచ్చితంగా మెనూలో ఉండేలా చూసుకోవాలి. వీటిని తినడం వల్ల పొట్టలో అసౌకర్యం కలగడం తగ్గుతుంది.
అల్లం
దీనిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఎక్కువ. ఇవి పొట్ట అసౌకర్యానికి గురికాకుండా కాపాడతాయి. పొట్ట నొప్పిని తగ్గిస్తాయి. కాబట్టి ప్రతి కూరలో అల్లాన్ని భాగం చేసుకోండి, లేదా అల్లం టీ తాగడం అలవాటు చేసుకోండి.
అవిసె గింజలు
అవిసె గింజల్లో డైటరీ ఫైబర్, ఒమేగా త్రీ ఫ్యాటీ ఆమ్లాలు అధికంగా ఉంటాయి. వీటిని తినడం వల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. ఆహారం సులభంగా జీర్ణం అవుతుంది. పొట్టనొప్పి రావడం తగ్గుతుంది.
అరటి పండ్లు
ప్రతి ఇంట్లో అరటి పండ్లు ఉండడం చాలా ముఖ్యం. వీటిలో ప్రీ బయోటిక్ లక్షణాలు అధికంగా ఉంటాయి.పెప్టిన్ అని పిలిచే కంటెంట్ దీనిలో ఉంటుంది. ఇది పేగులలో అదనపు ద్రవాన్ని గ్రహిస్తుంది. మలం నీళ్ళలా కాకుండా గట్టిగా అయ్యేలా చేస్తుంది. దీనివల్ల అతిసారం, విరేచనాలు వంటివి తగ్గుతాయి. కాబట్టి వేసవిలో రోజూ అరటిపండు తినడం వల్ల మేలు జరుగుతుంది.
పెరుగు
ప్రోబయోటిక్స్ అధికంగా ఉండే ఆహారం పెరుగు. దీన్ని తినడం వల్ల పేగులకు మేలు జరుగుతుంది. పొట్టలో మంచి బాక్టీరియా పెరుగుతుంది. గ్యాస్, ఉబ్బరం వంటివి తగ్గుతాయి. పేగు కదలికలను చురుగ్గా మారుస్తుంది.
బియ్యం, ఓట్ మీల్, టోస్ట్ వంటివి కడుపు నొప్పిని తగ్గించే అవకాశం ఉంది. గ్యాస్ట్రో ఇంటస్టినల్ సమస్యలతో బాధపడేవారు సాదా వైట్ రైస్ తినడం వల్ల వారికి ఉపశమనం లభిస్తుంది. సాదా వైట్ రైస్ జీర్ణం కావడం సులభంగా ఉంటుంది. ఇది కార్బోహైడ్రేట్లతో నిండి ఉంటుంది. కాబట్టి శక్తిని కూడా అందిస్తుంది.
పొట్ట అసౌకర్యంగా ఉన్నప్పుడు కొన్ని ఆహారాలను దూరంగా ఉంచాలి. వాటిలో ముఖ్యమైనవి పుల్లని పండ్లు, స్పైసీ ఫుడ్, నూనెలో వేయించిన ఆహారాలు, కృత్రిమ స్వీట్నర్లతో తయారు చేసిన ఆహారాలు, కూల్ డ్రింకులు, పచ్చి కూరగాయలు వంటి వాటిని తినకూడదు.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.