Typhoid: చినుకు పడగానే విజృంభిస్తున్న టైఫాయిడ్, ఇది అంటువ్యాధి, ఈ జాగ్రత్తలు తీసుకోకతప్పదు
టైఫాయిడ్ కేసులు తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్నాయి. అధికంగా వానాకాలంలోనే నమోదవుతాయి ఈ కేసులు.
తెలుగు రాష్ట్రాల్లో ఇలా చినుకులు మొదలయ్యాయో లేదో, అలా టైఫాయిడ్ కేసులు బయటపడడం ప్రారంభమయ్యాయి. అపరిశుభ్ర వాతావరణం, నీరు నిలిచి దుర్గంధం వెదజల్లడం, ఆహారం, నీరు కలుషితం కావడం... ఇలా వివిధ కారణాల టైఫాయిడ్ జ్వరం సోకుతుంది. టైఫాయిడ్ జ్వరం వచ్చిందంటే మనిషిని నీరసంతో నిలువునా కుంగదీస్తుంది. ఆసుపత్రిలో చేర్చాల్సిన అవసరాన్ని కల్పిస్తుంది.
ఏ బ్యాక్టిరియా కారణం?
టైఫాయిడ్ జ్వరం కలగడానికి సాల్మొనెల్లా టైఫీ అనే బ్యాక్టిరియా సోకడం వల్ల టైఫాయిడ్ జ్వరం వస్తుంది. ఇది కలుషిత ఆహారం, నీటిపై జీవిస్తుంది. వాటిని తినడం, తాగడం వల్ల శరీరంలో చేరి టైఫాయిడ్‌కు కారణం అవుతుంది.
ఇది అంటువ్యాధి
టైఫాయిడ్ దోమల ద్వారా వ్యాపిస్తుందని కొంతమంది భావన. కానీ అది నిజం కాదు. ఈ బ్యాక్టిరియాను ఏ జీవి మోసుకుని తిరగదు. కేవలం మనిషి మాత్రమే దీని వాహకం. మనిషి ద్వారా మనిషికి సోకుతుంది. టైఫాయిడ్ సోకిన వ్యక్తి తాగిన నీళ్లు తాగినా, అతని తిన్న ఆహారం తిన్నా, అతను వండిన ఆహారం తిన్నా సోకే ప్రమాదం ఉంది. కాబట్టి టైఫాయిడ్ సోకిన వ్యక్తికి సేవ చేసేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి.
లక్షణాలు ఇలా ఉంటాయి?
టైఫాయిడ్ సోకిన వ్యక్తి లక్షణాలు సాధారణంగా ఉంటాయి. కాబట్టి దాన్ని మామూలు జ్వరమే అనుకుంటారు. కానీ ఒక్కోసారి ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉంది.
1. జ్వరం ఒకంతట తగ్గదు. 103 డిగ్రీల వరకు జ్వర తీవ్రత చేరుకుంటుంది.
2. వాంతులు వేధిస్తాయి.
3. తలనొప్పిగా అనిపిస్తుంది.
4. ఆకలి వేయదు, తినాలనిపించదు.
5. కొందరిలో విరేచనాలు అవుతాయి, మరకొందరిలో మలబద్ధకం వేధిస్తుంది.
ఎప్పుడు ప్రాణాంతకం?
టైఫాయిడ్ సోకిన వారిలో చాలా మటుకు పైన చెప్పిన లక్షణాలతోనే బాధపడతారు. మరికొందరిలో మాత్రం బయటికి తెలియకుండా అంతర్గత రక్తస్రావం జరుగుతుంది. అలాంటప్పుడు ప్రాణాలకు ప్రమాదం ఏర్పడవచ్చు. టైఫాయిడ్ అని సందేమం వస్తే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించాలి.
ఇది కూడా మహమ్మారే
పేద దేశాలను పట్టి పీడస్తున్న మహమ్మారి టైఫాయిడ్. అక్కడ ఉండే అపరిశుభ్ర వాతావరణంలో ఈ బ్యాక్టిరియా చెలరేగిపోతుంది. ఏటా ప్రపంచవ్యాప్తంగా కేవలం టైఫాయిడ్ వల్లే దాదాపు లక్షన్నర మంది మరణిస్తున్నారు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
వానాకాలంలోనే టైఫాయిడ్ అధికంగా చెలరేగిపోతుంది. కాబట్టి నీళ్లను కాచి చల్లార్చి తాగాలి. రోడ్డు మీద అమ్మే పానీయాలు తాగడం మానివేయాలి.ఆహారాన్ని వేడిగా ఉన్నప్పుడే తినాలి. పండ్లు, కూరగాయలు తొక్కలు తీసేశాక బాగా శుభ్రం చేశాకే, తినడం లేదా వండడం చేయాలి.
Also read: కేసులు మళ్లీ పెరుగుతున్నాయి, బూస్టర్ డోసు తీసుకున్నా సరే వీళ్లు జాగ్రత్తగా ఉండాల్సిందే