Corona Virus: కేసులు మళ్లీ పెరుగుతున్నాయి, బూస్టర్ డోసు తీసుకున్నా సరే వీళ్లు జాగ్రత్తగా ఉండాల్సిందే
కరోనా వైరస్ తీవ్రత తగ్గినప్పటికీ ఇంకా తన ఉనికిని చాటుతూనే ఉంది.
కరోనా వైరస్ రెండున్నరేళ్ల నుంచి ప్రపంచాన్ని వణికిస్తూనే ఉంది. ఇప్పుడు దాని తీవ్రత తగ్గింది కానీ, ఉనికి ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇంకా కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ప్రస్తుతం రోజుకు 15000 కుపైగా కేసులు నమోదవుతున్నాయి. కోవిడ్ వ్యాక్సినేషన్ జోరుగా సాగుతోంది. బూస్టర్ డోస్ లు వేయించుకునే వారి సంఖ్య కూడా పెరిగింది. అయినా కూడా కొంతమంది ఇంకా జాగ్రత్తగానే ఉండాలని సూచిస్తున్నారు వైద్యనిపుణులు. సాధారణ వ్యక్తులతో పోలిస్తే కొందరిలో కరోనా వైరస్ త్వరగా దాడి చేసే అవకాశం ఎక్కువ. అందుకే వీరు బూస్టర్ డోస్ తీసుకున్నా సరే, జన సమూహంలోకి వెళ్లినప్పుడు కచ్చితంగా జాగ్రత్తలు పాటించాల్సిందే.
వృద్ధులు
వయసు మీరిన వారిలో సంక్రమణ తీవ్రత అధికంగా ఉంటుంది. వారిపై ఏ బ్యాక్టిరియా, వైరస్ అయిన త్వరగా వారిపై దాడి చేస్తుంది. వీరు బూస్టర్ డోస్ తీసుకున్నప్పటికీ ఇంకా వైరస్ సోకే ప్రమాదం అధికంగా ఉంటుంది. లేదా ఆ వైరస్ కారణంగా కొన్ని రోజుల పాటూ అనారోగ్యం బారిన పడొచ్చు. వారికి శ్వాస అందకపోవడం వంటి సమస్యలు మొదలవ్వచ్చు. అందుకే ఇప్పటికీ వీరు మాస్క్ లు వాడాలి. నలుగురిలోకి వెళ్లినప్పుడు కాస్త సామాజిక దూరం పాటించాలి.
పిల్లలు
పిల్లలపై నిజానికి కరోనా ప్రభావం తక్కువగానే పడింది. వారిలో బలమైన రోగినిరోధక శక్తి వారిని కాపాడిందనే చెప్పాలి. కోవిడ్ కేసులు పిల్లల్లో అధికంగా నమోదవ్వలేదు కానీ, అతి తక్కువుగా నమోదైన కేసుల్లో మాత్రం పిల్లలు మరణం అంచుల దాకా వెళ్లొచ్చిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఏ పిల్లల్లో ఎంత రోగనిరోధక శక్తి ఉందో చెప్పలేం. ముందు జాగ్రత్తగా వారికి మాస్కులు పెట్టి పంపడం ఉత్తమం.
దీర్ఘకాలిక రోగాలతో పోరాడుతున్నవారు...
చాలా మంది వివిధ రోగాలతో ఇబ్బంది పడుతున్నారు. అలాంటివారికి కూడా వైరస్ త్వరగా సోకుతుంది. అసలే ఇతర రోగాల వల్ల ఇబ్బంది పడుతున్న వ్యక్తికి సాధారణంగానే రోగినిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. కాబట్టి వైరస్ త్వరగా దాడి చేసి ఆక్రమిస్తుంది. మధుమేహం ఉన్న వారు ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాలి.
ఈ జాగ్రత్తలు...
కరోనా పోయిందనుకుని చాలా మంది కనీస జాగ్రత్తలు పాటించడం లేదు. కానీ ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే.
1. మాస్క్ తప్పనిసరిగా వేసుకోవాలి.
2. చేతులు శుభ్రంగా ఉంచుకోవాలి.
3. అపరిశుభ్ర చేతులతో కళ్లు, ముఖాన్ని ముట్టుకోవద్దు.
4. దగ్గు, తుమ్ములు వచ్చేటప్పుడు కవర్ చేసుకుని తుమ్మండి.
5. మనుషులతో సామాజిక దూరం పాటించండి.
Also read: మనదేశంలో అబార్షన్ చట్టాలు ఏం చెబుతున్నాయి? ఎన్ని వారాల వరకు గర్భస్రావానికి చట్టం అనుమతిస్తుంది?