Chemicals In Milk Products: పాలు కావాలా నాయనా? జాగ్రత్త, ఇక సంసారానికి పనికిరారట!
పాలు ఆరోగ్యానికి మంచివే. కానీ, అందులో కొనుగొన్న రెండు రకాల రసాయనాల వల్ల పురుషుల్లో సంతానోత్పత్తి సమస్యలు ఏర్పడతాయట.

పాలు, పాల ఉత్పత్తులు ఆరోగ్యానికి మంచివేనని తెలిసిందే. అయితే, పురుషులకు మాత్రం అవి అంత మంచివి కావని తాజా అధ్యయనం ఒకటి పేర్కొంది. పాల ఉత్పత్తులు, మాంసం, షెల్ ఫిష్‌లు పురుషుల సంతానోత్పత్తిని దెబ్బతీస్తాయని లండన్ బ్రూనెల్ యూనివర్శిటీకి చెందిన వైద్య నిపుణులు వెల్లడించారు.
పాల ఉత్పత్తులు, మాంసం, షెల్ ఫిష్‌లోని బిస్ఫినాల్స్, డయాక్సిన్ అనే రెండు ప్రమాదకర రసాయనాలు ఆశ్చర్యపరిచే స్థాయిలో ఉన్నాయని నిపుణులు తెలిపారు. వాటి వల్ల పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ తగ్గిపోతుందని వెల్లడించారు. బిస్ఫినాల్ A (BPA) అనే రసాయనం ఎక్కువగా ప్లాస్టిక్ ఫుడ్ కంటైనర్‌లలో ఉంటుంది. ఇది ఎక్కువగా ప్లాస్టిక్ సీసాల్లో కూడా కనిపిస్తుంది.
రెండో రసాయనమైన డయాక్సిన్లు అత్యంత విషపూరితమైనవి. ఇవి రోగనిరోధక వ్యవస్థకు సమస్యలను కలిగిస్తాయి. హార్మోన్లపై కూడా ప్రభావం చూపుతుంది. ప్రొఫెసర్ ఆండ్రియాస్ కోర్టెన్‌క్యాంప్ ఓ వార్త సంస్థతో మాట్లాడుతూ.. ‘‘పాల ఉత్పత్తులు, మాంసం, షెల్ ఫిష్‌లోని హాజర్డ్ ఇండెక్స్ పరిమాణాన్ని చూసి ఆశ్చర్యపోయాం. జెరూసలేంలోని నిపుణులు నివేదిక ప్రకారం.. ఈ రసాయనాల వల్ల గత 40 ఏళ్లుగా పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ క్షీణిస్తున్నట్లు తెలిసింది’’ అని తెలిపారు.
ఈ రసాయనాల వల్ల అంగస్తంభన, పురుషాంగం వైకల్యం వంటి ఇతర సమస్యలు కూడా పెరిగాయని తెలిపారు. ఎన్విరాన్‌మెంట్ ఇంటర్నేషనల్ జర్నల్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం.. 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు గల 100 మంది పురుషుల మూత్ర నమూనాలలో తొమ్మిది రసాయనాలను కనుగొన్నారు. వాటిలో అసురక్షిత పదార్థాల కలయికను గుర్తించారు. అయితే, పురుషుల్లో ఈ సమస్యలు ఏర్పడటానికి అందులోని రసాయనాలు మాత్రమే కారణం కాదన్నారు. పాల ఉత్పత్తులైన చీజ్, వెన్న వంటి కొవ్వు పదార్థాలు, కొవ్వు కలిగిన మాంసం వీర్య నాణ్యతను దెబ్బతీస్తాయని వెల్లడించారు.
కొన్ని ముఖ్య ఆహారాలలో థాలేట్‌లు ఉన్నాయని గత అధ్యయనాలు పేర్కొన్నాయి. ఈ రసాయనాలు ప్లాస్టిక్‌లను మృదువుగా చేయడానికి ఉపయోగిస్తారు. ఈ రసాయనం శరీరంలోని హార్మోన్లను ఉత్పత్తి చేసే గ్రంధుల శ్రేణి ‘ఎండోక్రైన్’ వ్యవస్థలో అనేక ఆరోగ్య సమస్యలకు కారణమవుతుంది. థాలేట్‌లు సంతానోత్పత్తి, పునరుత్పత్తి సమస్యలతో కూడా ముడిపడి ఉన్నాయి. 2020లో జరిపిన ఒక అధ్యయనంలో ఈ రసాయనం యుక్తవయస్సులో మార్పులను, వృషణాల డైస్జెనిసిస్ సిండ్రోమ్, క్యాన్సర్‌తోపాటు స్త్రీ, పురుషుల్లో సంతానోత్పత్తి రుగ్మతలను ప్రేరేపిస్తుందని తెలుసుకున్నారు. ఈ రోజుల్లో ప్రతి ఆహారాన్ని ప్లాస్టిక్‌తోనే ప్యాక్ చేస్తున్నారు. దీంతో ఆయా ఆహారాలతో కలిసి వాటిలో ఉండే ప్రమాదకర రసాయనాలు మన శరీరంలోకి చేరి పెద్ద ప్రమాదాన్నే తెచ్చిపెడుతున్నాయి. ఇప్పటికైనా ప్లాస్టిక్ వస్తువుల వినియోగానికి దూరంగా ఉంటే మంచిది. మీరు ఏమంటారు?
Also Read: చేపలు తింటే చర్మ క్యాన్సర్ వస్తుందా? షాకింగ్ న్యూస్ చెప్పిన పరిశోధకులు
Also Read: కీలక నిర్ణయాలు తీసుకొనే ముందు సెక్స్ చేయాలట! నిపుణులు ఏం చెప్పారో చూడండి
గమనిక: ఈ అధ్యయనంలో నిపుణులు పేర్కొన్న వివరాలను మీ అవగాహన కోసం యథావిధిగా అందించాం. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ బాధ్యత వహించదని గమనించగలరు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

