Post Covid Preganancy: పోస్ట్ కోవిడ్ పరిస్థితులు గర్భధారణపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయి?
కరోనాకు ముందు పరిస్థితులతో పోలిస్తే కరోనా తరువాత చాలా మార్పులు వచ్చాయి. ఈ మార్పులు గర్భధారణపై ప్రభావం చూపిస్తాయా? వైద్యులు ఏమంటున్నారు?
కరోనా ఇంకా పోలేదు... కేసులు నమోదవుతూనే ఉన్నాయి. పోస్ట్ కోవిడ్ (కరోనా వచ్చిన తరువాత) పరిస్థితులు కూడా ఆశాజనకంగా లేవు. ఇప్పుడు చాలా కొత్త జంటల ముందున్న ప్రశ్నలు ‘ఇప్పుడు గర్భం ధరించవచ్చా? లేక మరికొంచెం సమయం తీసుకోవాలా? ఇప్పుడు గర్భం ధరిస్తే... సమస్యలేమైనా వస్తాయా? అసలు గర్భం ధరిస్తామా... ఇలా రకరకాల సందేహాలతో సతమతమవుతున్నారు. దీనికి వైద్యులు ఎలాంటి సలహాలు , జాగ్రత్తలు చెబుతున్నారో చూద్దాం.
నిజానికి తల్లి ఆరోగ్యంగా ఉంటే చాలు, ఆమె ఎప్పుడైనా గర్భం ధరించేందుకు ప్రయత్నించవచ్చు. ఇప్పటి వరకు కరోనా తరువాతి పరిస్థితులు గర్భస్రావానికి కారణమవుతాయని ఏ శాస్త్రీయ నిరూపణ కాలేదు. అలాగే గర్భంలో శిశువు అభివృద్ధిని వైరస్ ప్రభావితం చేస్తుందని సూచించడానికి ఎటువంటి ఆధారాలు కూడా లేవు. ప్రజల్లో మాత్రం ఈ విషయంలో భయాలు అలాగే ఉన్నాయి. అయితే గర్భం ధరించే ముందు ముఖ్యంగా తల్లి ఆరోగ్య చరిత్ర కూడా పరిగణనలోకి తీసుకోవాలి. మునుపటి గర్భధారణలో ఏమైనా సమస్యలు ఉన్నాయా? గర్భస్రావం జరిగిందా? ఎన్ని సార్లు జరిగింది? ఎందుకు జరుగుతోంది? ఇవన్నీ వైద్యులతో చర్చించాలి. అలాంటి పరిస్థితిని కలిగి ఉన్నట్లయితే గర్భధారణ సమయంలో మీకు అదనపు జాగ్రత్త అవసరం. అలాంటి దీర్ఘకాలిక సమస్యలు ఉన్నప్పుడు పోస్ట్ కోవిడ్ సమయం మీకు సరైనది కాదని భావించవచ్చు.
పోస్ట్ కోవిడ్ పరిస్థితులు మనుషుల మానసిక ఆరోగ్యంపై మాత్రం ప్రభావం చూపిస్తున్నాయని ఇప్పటికే పలు అధ్యయనాలు తేల్చాయి. కనుక మీరు మానసికంగా కూడా సంసిద్ధంగా ఉన్నారని తేల్చుకున్నాకే గర్భం ధరించేందుకు ప్రయత్నించండి. మానసిక ఆందోళనలు కలుగుతున్న క్రమంలో వైద్యుని సలహాతో నిర్ణయం తీసుకోవడం ఉత్తమం. ముఖ్యంగా కరోనా వచ్చి తగ్గిన వారిలో ఈ మానసిక ఆందోళన కలుగుతోంది.
వ్యాక్సిన్ వేయించుకున్నాకే ప్రయత్నిస్తే మంచిదా?
గర్భధారణకు టీకాకు సంబంధం లేదు. టీకా వేసుకున్నాక గర్భం ధరిస్తే చాలా మంచిది... యాంటీ బాడీస్ బిడ్డకు వచ్చే అవకాశం ఉందని కొన్ని సర్వేలు చెబుతున్నాయి.
ఎలా సిద్ధమవ్వాలి?
పోస్ట్ కోవిడ్ పరిస్థితుల్లో గర్భం ధరించాలని భావించేవాళ్లు ముందు నుంచే మానసికంగా, శారీరకంగా సిద్ధమవ్వాలి.
1. ఫోలిక్ యాసిడ్ ను తీసుకోవడం ప్రారంభించాలి. పాలకూర, బఠాణీలు, చికెన్ లివర్, బ్రకోలి, క్యాబేజ్, ఉల్లికాడలు, కిడ్నీ బీన్లు వంటివి తినాలి.
2. సూర్యరశ్మి నుంచి తగినంత విటమిన్ డి పొందలేని పరిస్థితుల్లో సాల్మన్, సార్డైన్స్, చికెన్ లివర్, గుడ్డు పచ్చ సొన వంటి వాటిని తినాలి.
3. కాఫీ, టీ ల ద్వారా కెఫీన్ అధికంగా శరీరంలో చేరకుండా చూసుకోవాలి.
4. బరువును అధికంగా పెరగకుండా జాగ్రత్త పడాలి.
Also read: ఏ వయసులో ప్రోటీన్ షేక్స్ తీసుకుంటే మేలు? కొత్త అధ్యయనం ఏం చెబుతోంది?
Also read: భోజనం చేశాక ఈ పనులు చేయకండి... అనారోగ్య సమస్యలు తప్పవు
Also read: బెల్లం, పంచదారల్లో ఏది ఆరోగ్యానికి మంచిది?