Solar Eclipse: నేడే సంపూర్ణ సూర్య గ్రహణం... మనకి కనిపించదు, అయినా సరే గ్రహణ సమయంలో ఈ పనులు చేయకూడదంటారు
2021లో చివరి సూర్య గ్రహణం ఇది. డిసెంబర్ 4వ తేదీన ఏర్పడనుంది.
ప్రపంచవ్యాప్తంగా సూర్య, చంద్ర గ్రహణాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ ఏడాది చివరి సంపూర్ణ సూర్యగ్రహణం శనివారం ఏర్పడనుంది. ఉదయం 10.59 నిమిషాలకు మొదలైన గ్రహణం మధ్యాహ్నం 12.30కు సంపూర్ణమవుతుంది. మధ్యాహ్నం 1.33 నిమిషాలకు సంపూర్ణ గ్రహణం ముగుస్తుంది. అప్పట్నించి గ్రహణం వీడడం మొదలై మధ్యాహ్నం 3.07 నిమిషాలకు పూర్తిగా విడుస్తుంది. అంటే మొత్తం నాలుగ్గంటలకు పైగానే గ్రహణ సమయం వస్తోంది. ఇది సంపూర్ణ సూర్య గ్రహణం కావడంతో పలు దేశాల ప్రజలు ఈ అద్భుతాన్ని వీక్షించేందుకు సిద్ధమవుతున్నారు.
మనకి కనిపిస్తుందా?
మనకి నేడు ఏర్పడే సూర్యగ్రహణం కనిపించదు. ఆస్ట్రేలియాలో దక్షిణ భాగంలో నివసిస్తున్న ప్రజలకి, ఆఫ్రికా, ఉత్తరమెరికా, న్యూజిలాండ్ ప్రజలకు పాక్షికంగా కనిపిస్తుంది. అంటార్కిటికా ప్రాంతంలో మాత్రం సంపూర్ణ సూర్యగ్రహణం పూర్తిగా కనిపిస్తుంది. మనకి కనీసం ఒక శాతం కూడా కనిపించదు. కనపించకపోయినంత మాత్రాన మనకి సూర్యగ్రహణం లేదని చెప్పలేం. అందుకే ప్రాచీన కాలంగా ప్రజలు అనుసరిస్తున్న నియమాలు, నమ్మకాలను నేడు కూడా ఆచరిస్తారు.
గ్రహణ సమయల్లో ఈ పనులు చేయకూడదంటారు...
మన సంస్కృతులు, సంప్రదాయాల్లో భాగంగా ప్రాచీన కాలం నుంచి గ్రహణ సమయంలో కొన్ని పనులు చేయకూడదనే నమ్మకాలు ప్రబలంగా ఉన్నాయి.
1. గ్రహణం వస్తే మాత్రం గర్భిణిలకు నరకమే. గ్రహణ సమయం వీడే వరకు వారు బొమ్మల్లా కదలకుండా పడుకోవడమో, కూర్చోవడమో చేయాలంటారు. దురదవేసినా గోక్కోకూడదు. ముఖ్యంగా వారు చాకు ముట్టుకోకూడదని, పండ్లను కోయడం వంటి పనులు చేయకూడదని చెబుతారు. ఇలా చేస్తే బిడ్డ వేళ్లు లేకుండా పుడతారని మనదేశంలోని చాలా ప్రాంతాల ప్రజలు నమ్ముతారు.
2. గ్రహణ సమయంలో ఎవరైనా అనుకోకుండా తమను తాము గాయపరుచుకుని రక్త స్రావం అవుతుంటే, ఆ రక్త స్రావం త్వరగా ఆగదని, గాయం కూడా శాశ్వత మచ్చను వదిలివేస్తుందని నమ్ముతారు. అందుకే పదునైన వస్తువులను గ్రహణ సమయంలో ముట్టుకోవద్దని చెబుతారు.
3. సాధారణ రోజుల్లో కన్నా గ్రహణసమయంలో దానం చేస్తే అది పదిలక్షల రెట్లు పుణ్యఫలాలను ఇస్తుందని నమ్మకం.
4. గ్రహణసమయంలో స్నానం చేసి జంతువులకు ఆహారాన్ని పెడితే చాల మంచిదని అనేక మంది పాటిస్తారు.
5. తినడం, తాగడం, నిద్రపోవడం, సెక్స్ వంటివి పూర్తిగా నిషిద్ధంగా భావిస్తారు.
6. గ్రహణ సమయంలో ఎవరూ వంట చేయరు. గ్రహణానికి ముందు వండిన ఆహారపదార్థాలను కూడా పారేస్తారు. గ్రహణం విడిచాక వండుకుని తింటారు. సూర్యుని నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాలు అప్పటికే వండిన ఆహారపదార్థాలను విషపూరితం చేస్తాయని వారి నమ్మకం.
ఆయుర్వేం కూడా నమ్ముతోంది...
సైన్సు ఇవన్నీ నిజమని సమర్థించనప్పటికీ, ఆయుర్వేదం మాత్రం నమ్ముతోంది. గ్రహణసమయంలో ఆహారం వండడం, తినడం వంటి పనులకు దూరంగా ఉండాలని చెబుతోంది.
ఇలా చూడొచ్చు...
మనదేశంలో సంపూర్ణ సూర్యగ్రహణం కనిపించదు. ఇలా గ్రహణాన్ని చూడలేని ప్రజల కోసం నాసా ఏర్పాట్లు చేసింది. అంటార్కిటికాలని యూనియన్ గ్లేసియర్ ప్రాంతం నుంచి ఈ గ్రహణాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయబోతోంది. ఇది యూట్యూబ్, నాసా లైవ్ లో ప్రసారం చేస్తారు.
Read also: ఇలాంటి పేపర్ ప్లేట్లలో రోజూ భోజనాలు లాగిస్తున్నారా? అయితే ఈ రోగాలు రాక తప్పవు
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి.