Tomato Dosa: టమోటా దోశ ఇలా చేస్తే వదలకుండా తినేస్తారు ఎవరైనా
కాస్త కొత్తగా టమోటాలతో దోశ ప్రయత్నించి చూడండి. అదిరిపోతుంది.
దోశెలంటే ఎంతో మందికి ప్రాణం. కానీ ఎప్పుడూ ఒకేలా వేసుకుని తింటే బోరు కొట్టడం లేదా? అందుకే కాస్త కొత్తగా ప్రయత్నించండి. టమోటాలతో దోశె వేసుకుని చూడండి. పిల్లలు వదలకుండా తినేస్తారు. వీటిని చేయడం పెద్ద కష్టమేం కాదు. సింపుల్‌గా చేయవచ్చు.
కావాల్సిన పదార్థాలు
బియ్యం - ముప్పావు కప్పు
మినపప్పు - అర కప్పు
టమోటాలు - మూడు
ఎండుమిర్చి - మూడు
ధనియాలు - రెండు స్పూనులు
నూనె - తగినంత
నీళ్లు - రెండు కప్పులు
ఉప్పు - రుచికి సరిపడా
తయారీ ఇలా...
1. బియ్యం, మినపప్పును ముందుగానే నానబెట్టుకోవాలి. ముందు రోజు రాత్రి నానబెట్టుకుంటే బాగా మెత్తగా నానుతాయి.
2. ఉదయం టిఫిన్ వండే ముందు బియ్యం, మినపప్పు, ధనియాలు వేసి మెత్తగా రుబ్బుకోవాలి. దోశెపిండిలా రుబ్బుకోవాలి.
3. ఎండు మిర్చి, టమాటోలు కూడా మిక్సీలో మెత్తగా రుబ్బుకోవాలి.
4. దోశెపిండిలో టమోటా,ఎండు మిర్చి ప్యూరీని కలుపుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి.
5. ఇప్పుడు ఈ మొత్తం మిశ్రమాన్ని ఓ అరగంట పాటూ పక్కన వదిలేయాలి.
6. తరువాత స్టవ్ మీద పెనం పెట్టి దోశెల్లా పోసుకోవాలి.
7. ఎర్రటి దోశెలు చూడగానే నోరూరేలా ఉంటాయి.
8. వీటిని కొబ్బరి చట్నీతో తింటే ఆ రుచే వేరు.
తింటే ఎంతో బలం...
ఈ దోశెల్లో వేసిన టమోటాల వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. వీటిని తినడం వల్ల విటమిన్ ఎ, విటమిన్ సి, బి విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. అలాగే ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, కోలిన్, జింక్, ఫొలేట్ అధికంగా ఉంటాయి. అలాగే ఫైటో కెమికల్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ టమోటాలు తినడం వల్ల శరీరానికి పుష్కలంగా లభిస్తాయి. టమాటోలు తినడం వల్ల చర్మానికి, జుట్టుకు మెరుపు లభిస్తుంది. ఇందులో ఉండే లైకోపీన్ మనకు చాలా అవసరం. వండిన టమోటాలు తినడం వల్లే కాదు పచ్చి టమోటాలు తినడం వల్ల కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. మధుమేహం ఉన్నవారు టమోటాలు తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. ఇందులో ఉండే క్రోమియం చక్కెర స్థాయిలు తగ్గించడానికి ఉపయోగపడుతుంది. టమోటాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
టమోటా దోశ పైన చెప్పిన విధంగా మీరు చేయలేకపోతే... ఇన్ స్టెంట్‌గా ఇలా కూడా టమోటా దోశ చేసుకోవచ్చు.
View this post on Instagram
Also read: కుళ్లిపోయిన మాంసం వాసన వేసే పండు ఇది, అయినా ఇష్టంగా తింటారు