Durian Fruit: కుళ్లిపోయిన మాంసం వాసన వేసే పండు ఇది, అయినా ఇష్టంగా తింటారు
ఈ పండు మీరు ఇంత వరకు తిని ఉండరు, కానీ ఇది పోషకాహారంలో ముందుంటుంది.
ఆపిల్, పుచ్చకాయ, జామ, ద్రాక్ష, అరటి పండు... ఇవే మనం ఎక్కువగా తినే పండ్లు. కొన్ని పండ్లు సీజనల్ గా దొరుకుతాయి. మనం ఇప్పుడు ఓ పండు గురించి చెప్పుకోబోతున్నాము. దాని పేరు దురియన్. మీలో తక్కువ మందే ఈ పండును చూసుంటారు. చూడటానికి చిన్న పరిమాణంలో ఉన్న పనస పండులా కనిపిస్తుంది ఇది. పనస పండు ముక్కలు చేయగానే ఆ సువాసనకే నోరూరిపోతుంది. కానీ ఈ దురియన్ పండు కత్తిరిస్తే ముక్కు మూసుకుని దూరంగా పారిపోతారు.అంత కంపు కొడుతుంది ఈ పండు. ఈ వాసన ఎంత భయంకరంగా ఉంటుందంటే కుళ్లిపోయిన మాంసం వాసన వస్తుంది. ముక్కు మూసుకుని మరీ తినేసే వాళ్లు ఎంతోమంది ఉన్నారు.
ఎందుకు తినాలి?
అంత దుర్వాసన కొడుతున్నా కూడా ఈ పండును ఎందుకు తినాలి? ఆరోగ్యం కోసం. దీనిలో చాలా పోషకాలు ఉన్నాయి. ఫైబర్, విటమిన్ సి, పొటాషియం, బి విటమిన్లు అధికంగా ఉంటాయి. అలాగే యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ మన శరీరానికి ఎంతో ఆవశ్యకమైనవి. ఈ పండ్ల రుచి కూడా అంత బాగోదు. కొన్ని తీపిగా, కొన్ని చేదుగా, కొన్ని రెండూ కలిపిన రుచిని కలిగి ఉంటాయి.
దాదాపు పుచ్చకాయంత పరిమాణంలో పెరుగుతుంది. ఈ పండు అంతదూరంలో ఉండగానే దుర్వాసన ముక్కుపుటాలను తాకుతుంది. ఈ పండుకెందుకంతా దుర్వాసనో తెలుసుకునేందుకు చాలా పరిశోధనలు జరిగాయి. అందదులో ఇథనెధియోల్ అనే రసాయన సమ్మేళం వల్ల ఈ వాసన వచ్చి ఉంటుందని తేలింది. అయితే ఈ పండులో ఆ సమ్మేళనం ఎలా ఉత్పత్తి అవుతుందో మాత్రం తెలియరాలేదు. దురియన్ పండు పక్వానికి వచ్చే దశలోనే ఈ సమ్మేళనం కూడా పెరుగుతందని ఓ కథనం చెబుతోంది.
ఒక ఆపిల్ పండు ఇచ్చే పోషకాల కన్నా 30 శాతం అధికంగా ఒక దురియన్ పండు ఇస్తుంది. ఇది చూడటానికి పనసపండులా కనిపిస్తున్నప్పటికీ, దానికీ ఈ పండుకు అసలు సంబంధమే లేదు. రెండు వేరు వేరు జాతులకు చెందిన పండ్లు. పండులను ఒలిస్తే పెద్ద తొనల్లా వస్తాయి. వాటిని రోజుకు రెండు తింటే చాలు. గుండెకు ఎంతో అవసరమైన మోనోశాచురేటెడ్ కొవ్వులు, విటమిన్లు, పొటాషియ, మెగ్నీషియం, ఐరన్ వంటి ఖనిజాలు అధికంగా ఉంటాయి. ఫైబర్ కంటెంట్ కూడా అధికం.
ఏఏ దేశాల్లో...
ఈ పండు ఆగ్నేయాసియాకు చెందినది. ఇండోనేషియా, థాయిలాండ్, మలేషియం, ఫిలిప్పీన్స్ వంటి దేశాల్లో ఇది పెరుగుతుంది. మన దేశంలో పెరగదు. ఎవరైనా మొక్క తెచ్చి పెంచితే పెరిగే అవకాశాలున్నాయి కానీ ఈ పండ్లను మనం తినలేం.
Also read: అనారోగ్యంగా ఉన్నప్పుడు జిమ్‌కు వెళ్తున్నారా? గుండె పోటు ప్రమాదం పొంచి ఉండొచ్చు
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.