Weight Loss Tips: ఈజీగా బరువు తగ్గాలా? జస్ట్ ఈ 5 సూత్రాలు పాటిస్తే చాలు
బరువు తగ్గడం కష్టమైన విషయమే. ముఖ్యంగా నడుము చుట్టూ పేరుకున్న కొవ్వు తగ్గించుకోవడం ఇంకా కష్టం. కాబట్టి, ఈ 5 సూత్రాలు క్రమం తప్పక పాటించండి.
కొందరు ఎంత తిన్నా బరువు పెరగరు. మరికొందరు ఏమీ తినకపోయినా బరువు పెరిగిపోతారు. సన్నగా పెద్దగా ఆరోగ్య సమస్యలేవీ ఉండవు. కానీ, బరువు పెరిగితేనే.. ప్రపంచంలో ఉన్న అడ్డమైన అనారోగ్యాలు చుట్టుకుంటాయ్. అందుకే, వీలైనంత వరకు ప్రతి ఒక్కరూ బరువు పెరగకుండా జాగ్రత్తపడాలి. కానీ, ఈ బిజీ లైఫ్‌లో అదెలా సాధ్యం? అందుకే, ఈ ఐదు సింపుల్ టిప్స్ పాటించి చూడండి. క్రమం తప్పకుండా పాటిస్తే.. నెల రోజుల్లోనే మార్పు చూడవచ్చేమో!
తగినంత ప్రొటీన్ తీసుకోవాలి
శరీర కణజాలాల పెరుగుదలకు, హీలింగ్‌కు అవసరమైన పోషకాలలో ప్రొటీన్ ఒకటి. కండరాలు, ఎముకలు బలంగా ఎదిగేందుకు ఇది చాలా అవసరం. అంతేకాదు ఆహారంలో తగినంత ప్రొటీన్ ఉంటే కడుపు నిండుగా ఉండి త్వరగా ఆకలి కూడా అనిపించదు. అదనంగా తీసుకునే చిరుతిండి తగ్గుతుంది. సాధారణంగా చిరుతిండి అదనపు క్యాలరీలను చేర్చుతుంది. కనుక బరువు పెరిగే ప్రమాదం ముఖ్యంగా నడుము చుట్టు కొలత పెంచే ప్రమాదం పొంచి ఉంటుంది.
తినే ప్లేట్ పరిమాణం
చాలా మందికి పెద్ద ప్లేట్ లో భోం చెయ్యడం ఇష్టంగా ఉంటుంది. ప్లేట్ ఎంత పెద్దగా ఉందనే దానితో సంబంధం లేకుండా ప్లేట్ నిండా పదార్థాలు వడ్డించుకోవడం అలవాటు ఉంటుంది. తీసుకునే ఆహారం పరిమాణం తగ్గించాలంటే ముందుగా ప్లేట్ సైజ్ తగ్గించాలని వైద్యులు సలహా ఇస్తున్నారు. చిన్న ప్లేట్ లో తిన్నపుడు ఎక్కువ తినేశారని అనుకునేలా చేస్తుందట. ప్లేట్ పెద్దగా ఉంటే ఎక్కువ వడ్డించేసుకుని ఎక్కువ తినేస్తారని అంటున్నారు.
సాఫ్ట్ డ్రింక్స్/ఆల్కహాల్ వద్దు
సాఫ్ట్ డ్రింక్స్ , ఆల్కహాల్ లో కేవలం క్యాలరీలు మాత్రమే ఉంటాయి. ఎలాంటి పోషకాలు ఉండవు. ఆల్కహాల్ వల్ల ఆకలి కూడా పెరుగుతుంది. అందువల్ల ఎక్కువ ఆహారం తీసుకుంటారు. వీటికి బదులుగా బ్లాక్ టీ లేదా గ్రీన్ టీ తీసుకోవడం మంచిది. మూడు కప్పుల బ్లాక్ టీ నడుము చుట్టు కొలత తగ్గించేందుకు తోడ్పడుతుందని రుజువైంది.
సరైన వర్కవుట్
నడి వయసుకు వచ్చిన తర్వాత జాగింగ్ కంటే కూడా మెరుగైన వర్కవుట్ అవసరమని వైద్యులు చెబుతున్నారు. రెసిస్టెంట్ ట్రైనింగ్ మజిల్ డెన్సిటీ పెంచుతుంది. కేలోరీలను కూడా ఖర్చు చేస్తుంది. అంతేకాదు పొత్తికడుపు భాగంలోని ఆబ్స్ ను బలోపేతం చేస్తుంది.
తగినంత నిద్ర
సాయంత్రాలు నిద్ర పోవాలని అనిపిస్తోందంటే మీకు రాత్రి నిద్ర చాలడం లేదని అర్థం. తరచుగా నిద్ర లేని రాత్రులు గడిపితే రకరకాల అనారోగ్యాలకు కారణం కావచ్చు. వాటిలో బరువు పెరగడం కూడా ఒకటి. రాత్రి కేవలం నాలుగు గంటలు నిద్ర పొయ్యేవారితో పోలిస్తే తొమ్మిది గంటలు నిద్ర పోయే వారి కంటే సగటున 300 కేలరీలు ఎక్కువ తినేస్తారట. నిద్ర సరిగా లేని వారిలో నడుము చుట్టు కొలత పెరిగే ప్రమాదం 9 శాతం ఎక్కువ. అయితే తొమ్మిది గంటల కంటే ఎక్కువ నిద్రపోయే వారిలో కూడా నడుము చుట్టు కొలత పెరిగే ప్రమాదం ఉంటుందని గుర్తుంచుకోవాలి.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.