(Source: Poll of Polls)
Throat Pain in Summer : సమ్మర్లో గొంతు నొప్పి, జలుబు రావడానికి కారణాలివే.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇంటి చిట్కాలు ఇవే
Summer Health Tips : వేసవిలో చాలామంది జలుబు, గొంతు నొప్పి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అసలు సమ్మర్లో ఇవి రావడానికి కారణాలేంటి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం.

Summer Infections Causes : గొంతు నొప్పి, జలుబు సమస్యలు చలికాలంలో ఎక్కువగా వస్తుంటాయి. అయితే దానికి భిన్నంగా సమ్మర్లో కూడా చాలామంది ఈ సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. అసలు వేసవిలో గొంతు నొప్పి, జలుబు వంటి సమస్యలు ఎందుకు వస్తాయి? రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎలాంటి ఇంటి చిట్కాలు ఫాలో అయితే ఈ సమస్యలు దూరమవుతాయో ఇప్పుడు చూసేద్దాం.
వేసవిలో గొంతునొప్పికి, జలుబుకి కారణాలివే
సమ్మర్లో గొంతు నొప్పి, జలుబు రావడానికి చాలా కారణాలుంటాయి. ముఖ్యంగా వేడి వల్ల ఈ రెండూ వచ్చే అవకాశం ఎక్కువ. ఎండ, ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నప్పుడు డీహైడ్రేషన్ సమస్యలు వస్తాయి. దీనివల్ల గొంతు డ్రైగా మారి నొప్పికి దారి తీస్తుంది. వేడి ఎక్కువగా ఉన్నప్పుడు చాలామంది చల్లని ఫుడ్స్, డ్రింక్స్ తీసుకుంటారు. బయట వేడికి, చల్లగా తీసుకునే ఫుడ్‌కి శరీరం భిన్నంగా స్పందిస్తుంది. ఇది కూడా గొంతు నొప్పి, జలుబుకి దారితీస్తుంది.
పొడి, ఎయిర్ కండిషన్ నుంచి వచ్చే చల్లని గాలిలో ఉండడం వల్ల కూడా గొంతు డ్రైగా మారి నొప్పికి, జలుబు, దగ్గుకు కారణమవుతుంది. కాలుష్యం, పొడి ధూళి వంటివి కూడా అలెర్జీని పెంచుతాయి. వైరల్ ఇన్ఫెక్షన్ల వల్ల కూడా గొంతు సమస్యలు వస్తాయి. పలు వైరస్లు కూడా ఇన్ఫెక్షన్లు వ్యాప్తిని పెంచుతాయి. ఇవన్నీ సమ్మర్లో పొడి దగ్గు, గొంతు నొప్పి, జలుబు సమస్యలకు దారి తీస్తాయి.
తీసుకోవాల్సిన జాగ్రత్తలివే..
సమ్మర్లో గొంతు నొప్పి, జలుబు, దగ్గు వంటి సమస్యలు రాకుండా ఉండాలంటే నీటిని తాగుతూ ఉండాలి. రోజంతా డీహైడ్రేషన్ లేకుండా నీటిని తాగాలి. చల్లని పదార్థాలను ఎక్కువగా తీసుకోకూడదు. ఏసీ ఉన్న గదుల్లో హ్యూమిడిఫైయర్ ఉపయోగించాలి. బయటకు వెళ్లినప్పుడు కాలుష్యం, దుమ్ము వల్ల ఇబ్బంది కలగకుండా మాస్క్‌లు వినియోగించవచ్చు.
ఇంటి చిట్కాలివే..
ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. కొన్నిసార్లు గొంతు నొప్పి, జలుబు సమస్యలు వస్తూనే ఉంటాయి. అలాంటప్పుడు కొన్ని ఇంటిచిట్కాలు ఫాలో అవ్వడం వల్ల సమస్యలను దూరం చేసుకోవచ్చు. గొంతునొప్పిని తగ్గించుకోవడానికి సాల్ట్ వాటర్‌తో నోటిని పుక్కిలించాలి. దీనివల్ల గొంతులో ఇరిటేషన్, మంటను తగ్గిస్తుంది. నొప్పిని దూరం చేస్తుంది. గోరువెచ్చని నీటిలో తేనెను కలిపి తీసుకోవాలి. ఇది సహజమైన యాంటీబ్యాక్టీరియల్‌గా పనిచేసి నొప్పిని దూరం చేస్తుంది.
తులసి ఆకులతో టీ చేసుకుని తాగవచ్చు. దీనిలో యాంటీబ్యాక్టిరియల్, రోగనిరోధక శక్తిని పెంచే లక్షణాలు ఉంటాయి. ఇవి జలుబు, దగ్గు, గొంతు నొప్పిని దూరం చేస్తాయి. అల్లాన్ని నీటిలో మరిగించి నిమ్మరసం కలిపి తీసుకోవచ్చు. ఇది గొంతు నొప్పిని తగ్గిస్తుంది. జలుబును దూరం చేస్తుంది. ఆవిరి తీసుకోవడం వల్ల కూడా ఈ సమస్యలను దూరం చేసుకోవచ్చు. పరిస్థితి చేజారితే వైద్యుల సహాయం తీసుకోవాలి.






















