(Source: ECI/ABP News/ABP Majha)
Salman Health: సల్మాన్ ఖాన్‌కున్న ఆరోగ్య సమస్య ఇదే, ఇదో వింత రోగం
సల్మాన్ ఖాన్ ఎన్నో ఏళ్ల నుంచి పట్టి పీడిస్తున్న ఆరోగ్య సమస్య ఒకటుంది.
సల్మాన్ ఖాన్ ఎక్కువ సేపు మాట్లాడలేకపోయేవారు, మాట్లాడితే మూతి వంకర పోయేది, ముఖంలోని నరాల్లో తీవ్ర నొప్పి వచ్చేది. వైద్య పరీక్షల తరువాత తెలిసింది ఆయనకు ట్రైజెమినల్ న్యురాల్జియా అనే నరాల సమస్య ఉందని. అది కూడా కేవలం ముఖంలో ఉండే నరాలకే. ఈ సమస్య ఉన్న వారిలో అధిక శాతం మందిలో ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తుందట. కానీ సల్మాన్ ఖాన్ తనకున్న సమస్య గురించి తెలుసుకున్నాక దాన్ని అధిగమిస్తూనే ఉన్నారు. మానసికంగా ధైర్యంగా ఉండడంతో పాటూ, వైద్యుల సూచన మేరకు మందులు వాడుతూ,జాగ్రత్తలు తీసుకుంటూ ఇప్పటికి ఎంతో సంతోషంగా సినిమాల్లో నటిస్తున్నారు. తనకున్న ఈ నరాల సమస్య గురించి రెండేళ్ల క్రితం ఆయన స్వయంగా చెప్పారు. అప్పటివరకు ఎవరికీ తెలియదు.
ఏంటి సమస్యా?
ట్రైజెమినల్ న్యూరాల్జియా సమస్య ఉన్న వారిలో ముఖ భాగం చాలా నొప్పిని కలిగిస్తుంది. ఎల్లప్పుడూ ఉండకపోయినా కొన్ని నిమిషాల పాటూ కరెంట్ షాక్ కొట్టినంత నొప్పిని కలిగించి పోతుంది. బ్రష్ చేయడం, మేకప్ వేసుకోవడం వంటి చిన్న చిన్న సమస్యలు కూడా విపరీతమైన నొప్పిని కలిగిస్తాయి. అలా అని 24 గంటలు ఈ నొప్పి ఉండదు. వస్తూ పోతూ వేధిస్తుంది. యాభైఏళ్లు దాటిన వారిలోనే అధికంగా ఈ సమస్య కనిపిస్తుంది. ముఖ్యం మగవారి కన్నా ఆడవారిలో కలుగుతుంది.
ఇది ఎందుకొస్తుంది?
ఈ సమస్యను టిక్ డౌలౌరెక్స్ అని కూడా పిలుస్తారు. ముఖంలో ఉండే ట్రైజెమినరల్ నరాల పనితీరు దెబ్బతిన్నప్పుడు ఇలా సమస్య వస్తుంది. ఈ నరాలను ధమని లేదా సిర రక్తనాళాలు అనుకోకుండా నొక్కేయడం వల్ల, అక్కడ కలిగే ఒత్తిడి వల్ల ఈ సమస్య రావచ్చు. ఈ నొక్కేయడాన్ని వాస్కులర్ కంప్రెషన్ అని కూడా అంటారు.
ఇలా అనిపిస్తే అదే..
ఈ వింత రోగం లక్షణాలు ఎలా ఉంటాయంటే...
1. విద్యుత్ షాక్‌లాగా తీవ్రమైన నొప్పి వస్తుంది.
2. ఒక్కోసారి ముఖాన్ని తాకినా, నమిలినా, మాట్లాడినా, బ్రష్ చేసుకున్నా నొప్పి హఠాత్తుగా దాడి చేస్తుంది.
3. నొప్పి కొన్ని సెకన్ల నుంచి నిమిషాల పాటూ ఉంటుంది.
4. ట్రైజెమినల్ నరాలు కలిగి ఉన్న ముఖ భాగాలన్నీ అంటే చెంపలు, దవడ, దంతాలు, చిగుళ్లు, పెదవులు, కళ్లు, నుదురు భాగాల్లో నొప్పి వస్తుంది.
5. ఒక్కోసారి నొప్పి ముఖానికి ఓ వైపు మాత్రమే వస్తుంది.
6. దీనికి చికిత్స తీసుకోకపోతే నొప్పి తీవ్రంగా మారుతుంది.
చికిత్స
పరిస్థితి తీవ్రంగా ఉంటే సర్జరీ చేయాల్సిన అవసరం పడుతుంది. లేకుంటే వైద్యులు ట్యాబ్లెట్లు, ఇంజెక్షన్ల ద్వారా తీవ్రతను తగ్గిస్తారు. ముఖ భాగంలో తరచూ నొప్పి వస్తుంటే ఆలస్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం.
Also read: ఆహారం, నీళ్లు మింగడం కష్టంగా ఉందా? అది చాలా డేంజరస్ సంకేతం