Stroke: ఆహారం, నీళ్లు మింగడం కష్టంగా ఉందా? అది చాలా డేంజరస్ సంకేతం
కొన్ని లక్షణాలను, సంకేతలను తేలికగా తీసుకోవడం వల్లే రోగాలు ముదిరిపోయాక కానీ బయటపడడం లేదు.
కొన్ని ప్రమాదకరమైన వ్యాధులు ప్రాధమిక దశలోనే కొన్ని రకాల లక్షణాలను చూపిస్తాయి. ఆ లక్షణాలను తేలికగా తీసుకోవడం, పట్టించుకోకపోవడం వల్ల వ్యాధి లేదా ఆరోగ్య పరిస్థితి ముదిరిపోయాక కానీ గుర్తించలేరు వైద్యులు. అందుకే లక్షణాలు ఏవైనా తేడాగా అనిపించగానే వైద్యులను సంప్రదించడం చాలా ఉత్తమం. బ్రెయిన్ స్ట్రోక్ కూడా రావడానికి ముందే కొన్ని లక్షణాలను బయటపెడుతుంది. వాటిని గమనించి చికిత్స తీసుకోకపోతే చాలా నష్టం జరగవచ్చు.
స్ట్రోక్ ఎందుకు వస్తుంది?
మెదడుకు రక్త సరఫరా, ఆక్సిజన్ సరఫరా చేసే ధమనిలో అడ్డంకులు ఏర్పడినప్పుడు స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంది. అంటే మెదడుకు ఆక్సిజన్ సరిగా అందకపోయినా, రక్తం సరిగా చేరకపోయినా ఈ అత్యవసర స్థితి ఏర్పడుతుంది. స్ట్రోక్ రాగానే వెంటనే వైద్య సహాయం అందకపోతే చాలా ప్రమాదం. స్ట్రోక్ అసోసిసియేషన్ చెబుతున్న ప్రకారం శాశ్వత పక్షవాతం వచ్చే అవకాశం ఉంది. మరణం కూడా సంభవించవచ్చు.
లక్షణాలు ఇలా ఉంటాయి?
స్ట్రోక్ వచ్చే ముందు లక్షణాలు కొన్ని తీవ్రంగానే ఉంటాయి. ముఖం ఆకారం మారచ్చు. నవ్వలేకపోవడం, ముఖం ఒక వైపుగా లాగేసినట్టు అవ్వడం, నోరు పడిపోవడం వంటివి కలగవచ్చు. అలాగే ఆహారం, నీళ్లు మింగడంలో ఇబ్బందిగా అనిపిస్తుంది. ఈ లక్షణాన్ని పెద్దగా ఎవరూ పట్టించుకోరు కానీ ఇది తీవ్రమైన ఆరోగ్యపరిస్థితికి సంకేతం కావచ్చు.
1. స్పష్టంగా మాట్లాడలేకపోవడం
2. తిమ్మిర్లు అధికంగా పట్టి రెండే చేతులు ఎత్తలేకపోవడం
3. విషయాలు త్వరగా అర్థం కాకపోవడం
4. తల తిరగడం
5. గందరగోళంగా అనిపించడం
6. మసకగా కనిపించడం
7. తీవ్రమైన తలనొప్పి
స్ట్రోక్ రాకుండా జాగ్రత్త పడడం ఎలా?
నేషనల్ హెల్త్ సర్వీస్ ఆఫ్ ఇంగ్లాండ్ ప్రకారం జీవనశైలిలో కొన్ని మార్పులు చేయడం ద్వారా స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు.
1. ధూమపానం చేయడం మానేయాలి.
2. సమతులాహారాన్ని తీసుకోవాలి.
3. పీచుపదార్థాలు అధికంగా ఉండే ఆహారాన్ని తినాలి.
4. వ్యాయామం రోజూ చేయాలి.
5. ఆరోగ్యానికి అవసరమైన కొవ్వులు ఉండే ఆహారాన్ని తినాలి.
6. పండ్లు, తాజా కూరగాయలు అధికంగా ఆహారంలో ఉండేట్టు చూసుకోవాలి.
7. తృణధాన్యాలను తినాలి.
అధిక బరువు వద్దు
అధిక బరువు ఎన్నో అనర్థాలకు దారితీస్తుంది. వాటిల్లో స్ట్రోక్ కూడా ఒకటి. రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిలను ఎలా నియంత్రణలో ఉంచుకుంటారో అలా బరువు పెరగకుండా కూడా నియంత్రణలో ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. అధికరక్తపోటు వల్ల బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం పెరుగుతుంది. గుండె, మెదడు ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తుండాలి.
Also Read: టేస్టీ ఆంధ్రా దిబ్బరొట్టె, చేయడం చాలా సులువు