Simple Breaksfast: టేస్టీ ఆంధ్రా దిబ్బరొట్టె, చేయడం చాలా సులువు
ఆంధ్రా వారికి ఇష్టమైన అల్పాహారం దిబ్బరొట్టే, తింటే ఎంతో బలం కూడా.
దిబ్బరొట్టెలో ప్రధానంగా వాడేవి రెండే పదార్థాలు, అవి మినపప్పు, ఇడ్లీనూక. ఇందులో మినపప్పు ఆరోగ్యానికి అవసరమైన పోషకాలన్నీకలిగి ఉంటుంది. మినుముల్లోని పోషకాలు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్దకం, ఉబ్బసం వంటి సమస్యలు దరిచేరవు. మహిళలకు, పిల్లలకు వారానికి కనీసం మూడు సార్లయిన మినుములతో వండే ఆహారాలను తినిపించాలి. వారిలోనే రక్తహీనత సమస్య అధికంగా ఉంటుంది. మినపప్పులోని గుణాలు రక్తహీనత రాకుండా అడ్డుకుంటాయి. డయాబెటిస్ ఉన్న వారికి మినుములతో చేసే ఆహారాలు చాలా మేలు చేస్తాయి. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను పెరగకుండా నియంత్రిస్తాయి. ఎముకల పటుత్వానికి కూడా మినుములు అవసరం. వీటిల్లో కాల్షియం, పొటాషియం, ఐరన్, మెగ్నిషియం వంటి ముఖ్య పోషకాలు లభిస్తాయి. ఇవి ఎముకలు పటిష్టంగా మారి, కీళ్ల వాతం, ఆర్థరైటిస్ వంటి సమస్యలు రావు. యాంటీఇన్ఫ్లమేటరీ గుణాలు ఈ పప్పు దినుసుల్లో అధికం. శరీరంలో వాపు లక్షణాలను ఇది తగ్గిస్తుంది. గుండె జబ్బును నివారించే గుణం కూడా మినుముల్లో అధికం. రక్తంలో చక్కెర, చెడు కొలెస్ట్రాల్ చేరకుండా తగ్గిస్తుంది. అల్పాహారాన్ని పుష్టిగా తీసుకోవాలని చెబుతారు పెద్దలు. అల్పాహారంగా తినే ఆహారంతో రోజంతా ఉత్సాహంగా ఉంటుంది. దిబ్బరొట్టె తినడం వల్ల రోజంతా శక్తివంతంగా, చురుగ్గా ఉంటారు.
కావాల్సిన పదార్థాలు
మినప్పప్పు - ఒక కప్పు
ఇడ్లీ రవ్వ - రెండు కప్పులు
ఉప్పు - రుచికి సరిపడా
నూనె - ఒకటిన్నర స్పూను
తయారీ ఇలా
1. మినపప్పును బాగా కడిగి రాత్రి నానబెట్టుకోవాలి.
2. ఉదయాన మినప్పప్పును మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకోవాలి.
3. ఆ రుబ్బులో ఇడ్లీరవ్వను కలపాలి. రుబ్బు, ఇడ్లీ రవ్వ బాగా కలిసేలా చూసుకోవాలి.మరీ జారేలా కాకుండా రుబ్బు కాస్త గట్టిగా ఉండేలా చూసుకోవాలి. ఉప్పును కూడా కలిపి ఓ అరగంట పక్కన పెట్టుకోవాలి.
4. ఇలా పక్కన పెట్టడం వల్ల మినప రుబ్బులో ఇడ్లీ రవ్వ బాగా కలుస్తుంది.
5. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి. నూనె కాస్త కాగాక దిబ్బరొట్టెను వేసుకోవాలి. పలచగా వేస్తే అట్టు అవుతుంది. అదే దళసరిగా వేస్తే దిబ్బరొట్టె అవుతుంది.
దిబ్బరొట్టెకు మంచి జోడీ కొబ్బరి చట్నీ. కొబ్బరి చట్నీతో దిబ్బరొట్టె తింటే మళ్లీ మళ్లీ తినాలనిపించడం ఖాయం
Also read: ఈ చిత్రంలో నిద్రపోతున్న పిల్లి ఉంది, ఎక్కడుందో కనిపెట్టండి చూద్దాం