Dancing Plague: ఆగకుండా డాన్స్ చేయడమే ఈ వ్యాధి లక్షణం, వందల మంది దీని బారిన పడ్డారు
ఇది ఒక విచిత్రమైన వ్యాధి. ఇది సోకితే ఆగకుండా డాన్స్ చేస్తూనే ఉంటారు.
ప్రపంచంలో ఎన్నో వింత వ్యాధులు ఉన్నాయి. ఆధునిక కాలంలోనే కాదు 500 ఏళ్ల క్రితం కూడా ఇలాంటి వింత వ్యాధులు ఉన్నాయి. అలాంటి వాటిలో ఒకటి డాన్సింగ్ ప్లేగ్. 15వ శతాబ్దంలో ఇది వ్యాపించి 100 మంది ప్రాణాలు కూడా తీసింది. ఇది ఎందుకు వస్తుందో, దీనికి చికిత్స ఏమిటో కూడా తెలియదు. ఒక వింత వ్యాధిగా ఇది చరిత్రలో నిలిచిపోయింది.
ఫ్రాన్స్‌లో స్ట్రాస్ బర్గ్ అనే నగరంలో 1518లో జూలైలో ఈ వింత వ్యాధి ప్రబలింది. ఒక మహిళ ఒంటరిగా రోడ్డుపై నృత్యం చేస్తూ కనిపించింది. దీన్ని ప్రజలు చూసి నవ్వుకున్నారు. అయితే ఆమె తన ఇంటికి వెళ్ళాక ఏకాంతంగా కూడా అదే పనిగా నృత్యం చేస్తూ ఉంది. ఎందుకలా చేస్తుందో ఎవరికి అర్థం కాలేదు. ఒక వారం రోజులు తర్వాత మరో ముగ్గురు డాన్స్ చేయడం మొదలుపెట్టారు. వారు ఎంతకీ డాన్స్ చేయడం ఆపలేదు. రోజులు గడుస్తున్న కొద్ది ఆ నగరంలోని నాలుగో వందల మంది దాకా నృత్యం చేయడం ప్రారంభించారు. వారంతా కూడా నృత్యాన్ని అందంగా చేయడం లేదు, పూనకం వచ్చినట్టు కరాళ నృత్యం చేయడం మొదలుపెట్టారు. అది వారికి ఇష్టం లేకుండానే జరుగుతోందని చూసేవారికి అర్థం అయిపోతుంది. శరీరం నీరసించిపోయి వారు కింద పడిపోయేదాకా డాన్స్ చేస్తూనే ఉన్నారు. వారిని ఆపడం అప్పటి వైద్యుల తరం కాలేదు.
ఇలా డాన్స్ చేసినవారిని ఏం చేయాలో తెలియక అప్పటి అధికారులు ఒక పెద్ద గదిలో వీరందరినీ బంధించారు. వారు అక్కడ డాన్స్ చేస్తూ మూర్చపోయారు. వారిలో వందమంది దాకా మరణించారు.విపరీతమైన ఒత్తిడి కారణంగా మనుషుల్లో ఇలాంటి విపరీత ప్రవర్తనలు వస్తాయని వివరించారు అప్పటి వైద్యులు.
మొదట్లో ఇలా డాన్స్ చేసే వారిని చూసి వారికి దెయ్యాలు పట్టాయని అనుకున్నారు నగరవాసులు. చివరికి అదొక వింత వ్యాధిగా తేల్చారు. 1518లో ఈ ఘటన జరిగినప్పటికీ... ఇప్పటికీ దీనిపై పరిశోధనలు జరుగుతున్నాయి. వారికి ఎందుకు ఆ వ్యాధి సోకింది అనే రహస్యాలను తెలుసుకొనేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తూనే ఉన్నారు. అప్పట్లో వారంతా ‘రై పిండి’తో చేసే రొట్టెను తినేవారని, ఇది ఫంగల్ వ్యాధికి కారణమై వారి శరీరంలో కలుషితమైందని.. అదే ఇలా మూర్ఛలను, విపరీత ప్రవర్తనను కలిగించిందని చెబుతున్న శాస్త్రవేత్తలు కూడా ఉన్నారు. ఏది నిజమో తెలియదు కానీ ఇప్పటికీ డాన్సింగ్ ప్లేగు అనే వ్యాధి ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. ఈ మిస్టరీని ఎప్పటికి మన శాస్త్రవేత్తలు చేధిస్తారో చూడాలి.
Also read: కొంతమంది పిల్లలు మట్టి, బలపాలు తింటారు, ఎందుకో తెలుసా?
Also read: మా నాన్న మళ్లీ పెళ్లి చేసుకుంటానంటున్నారు, నాకు ఇష్టం లేదు
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.