కొంతమంది పిల్లలు మట్టి, బలపాలు తింటారు, ఎందుకో తెలుసా?
మట్టి, బలపాలు తినడం అనేది ఎక్కువ మందిలోనే మనం చూస్తూ ఉంటాము.
ఆహారం కానివాటిని తినే అలవాటు కొంతమంది పిల్లల్లో కనిపిస్తుంది. కొంతమంది చాక్పీసులు తింటే, మరి కొంతమంది బియ్యం తింటారు. ఇంకొందరు పలకపై రాసే బలపాలను తినేస్తూ ఉంటారు. పిల్లల్లోనే కాదు గర్భిణుల్లో కూడా ఈ లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. ఇలా ఆహారం కాని వాటిని తినాలనిపించేలా చేయడానికి కారణం ‘పైకా’ అనే డిజార్డర్. ఇదొక మానసిక రుగ్మత. కొన్ని రకాల పోషక లోపాలు ఉన్న వారిలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. ముఖ్యంగా రక్తహీనత సమస్యతో ఉన్నవారు ఇలా బియ్యం, పలక పుల్లలు, చాక్ పీసులు, మట్టి వంటివి తినడానికి ఆసక్తి చూపిస్తారు. అలాగే మానసిక ఒత్తిడితో బాధపడుతున్న వారు కూడా ఇలాంటివి తినడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. జింక్, కాల్షియం, ఐరన్ వంటి పోషక లోపాలు ఉన్నవారిలో కూడా మట్టి, బలపాలు తినాలన్న కోరిక అధికంగా ఉంటుంది. కొంతమంది గోడని గీక్కుంటూ ఆ సున్నాన్ని తినేస్తూ ఉంటారు. ఈ పైకా సమస్య ఉన్నవారు ఆహారంగా పరిగణించని వాటిని తినడానికి ఇష్టపడతారు. ఎక్కువగా చిన్నపిల్లలే ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు. పోషకాహార లోపంతో పాటు, గర్భధారణ సమయంలో కూడా ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి. గర్భిణులకు మట్టి తినాలనిపించడం, పలక పుల్లలు, సున్నం తినాలనిపించడం వంటివి జరుగుతూ ఉంటాయి. అలా అనిపించినప్పుడు తేలిగ్గా తీసుకోకూడదు. ఒకసారి వైద్యులను సంప్రదించి పోషకాహార లోపం ఏదైనా ఉందేమో తెలుసుకోవడం చాలా అవసరం. ఈ సమస్యను కొన్ని రకాల మందులు, విటమిన్ల సాయంతో చికిత్స చేస్తారు.
ప్రపంచంలోని పిల్లల్లో ఏడాది నుంచి ఆరేళ్ల వయసు లోపల ఉన్న వారిలో పది శాతం నుండి 30% మందిలో ఈ పైకా డిజార్డర్ కనిపిస్తోంది. ఇది పెద్దలకు కూడా రావచ్చు. ఈ డిజార్డర్ ఎందుకు వస్తుంది? అనేది కచ్చితంగా కారణం తెలియదు. ఇది కొన్ని రకాల వైద్య పరిస్థితులతో కూడా సంబంధం కలిగి ఉంది. సికిల్ సెల్ వ్యాధి ఉన్నా, ఇనుము లోపం ఉన్నా, జన్యుపరమైన రుగ్మతలు ఉన్నా, ఓసీడీ వంటి సమస్యలు ఉన్నా కూడా ఈ పైకా అనే రుగ్మత వచ్చే అవకాశం చాలా ఎక్కువ. వీరికి మానసిక వైద్యులకు కౌన్సిలింగ్‌తో పాటు ట్రీట్మెంట్ చాలా అవసరం.
మీ పిల్లలు మట్టి, సున్నం, చాక్‌పీసులు, బలపాలు తింటున్నట్టు మీరు గమనించినట్లయితే వెంటనే వైద్యుల్ని సంప్రదించండి. వారికి ఎలాంటి పోషకాహార లోపం లేకుండా చూడండి. కాలేయం, హిమోగ్లోబిన్, విటమిన్ పరీక్షలు చేయించండి. అనారోగ్య సమస్యలు ఏమైనా ఉంటే ఇట్టే తెలిసిపోతాయి. అలాగే పిల్లలు బరువుకు తగ్గ ఎత్తు ఉన్నారో లేదో చూసుకోండి. పిల్లల ఆహారంలో తాజా కూరగాయలు, పండ్లు, నువ్వులు, అవిసె గింజలు, నట్స్, పాలు, పెరుగు వంటివి ఉండేలా చూసుకోండి. ఇవన్నీ కూడా ఎలాంటి పోషకాహార లోపం రాకుండా కాపాడతాయి.
Also read: మా నాన్న మళ్లీ పెళ్లి చేసుకుంటానంటున్నారు, నాకు ఇష్టం లేదు
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.