Sleeping: మీలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? అయితే రోగనిరోధక శక్తి తగ్గినట్టే
తగినంత నిద్రలేకపోతే దాని ప్రభావం రోజంతా కనిపిస్తుంది. అంతే కాదు ఇతర అనారోగ్య సమస్యలకి దారి తీస్తుంది.
శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే కడుపు నిండా తిండి మాత్రమే సరిపోదు. కంటి నిండా నిద్ర అవసరం. ఈ రెండింటిలో ఏది సక్రమంగా లేకపోయినా దాని ప్రభావం శరీరంపై పడుతుంది. కానీ బిజీ లైఫ్ షెడ్యూల్ వల్ల చాలా మంది ఈ రెండింటి మీద అశ్రద్ధ చూపిస్తున్నారు. మరి ముఖ్యంగా స్మార్ట్ ఫోన్స్ వచ్చిన తర్వాత నిద్ర కరువైపోయింది. రాత్రి పగలు అనే తేడా లేకుండా గంటల తరబడి ఫోన్ చూస్తే టైమ్ గడిపేస్తున్నారు. దీని వల్ల నిద్రలేమి సమస్య వచ్చేస్తుంది. అదొక్కటే రాదండోయ్ దానితో పాటు తోడుగా గుండె జబ్బులు, మధుమేహం, కంటి సంబంధిత సమస్యలు కూడా తీసుకొచ్చేస్తుంది. నిద్రలేమి రోగనిరోధక శక్తి పనితీరుపై నేరుగా ప్రభావం చూపిస్తుందని ఇటీవలే ఈ నివేదిక వెల్లడించింది.
నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ ప్రచురించిన అధ్యయనం ప్రకారం.. నిద్ర, సిర్కాడియన్ వ్యవస్థ రోగనిరోధక పనితీరుపై బలమైన ప్రభావం చూపిస్తుందని వెల్లడించింది. మన శరీరంలో సైటోకిన్స్ అనే ప్రోటీన్లని విడుదల చేస్తుంది. వీటిలో కొన్ని నిద్రాణి ప్రోత్సహించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఒత్తిడిలో ఉన్నప్పుడు లేదా ఇన్ఫెక్షన్ లేదా ఇన్‌ఫ్లమేషన్ తో బాధపడుతున్నప్పుడు కొన్ని ఇతర సైటోకిన్ల సంఖ్య పెరుగుతుంది. నిద్ర లేకపోవడం వల్ల ఈ సైటోకిన్ల ఉత్పత్తిని ప్రభావితం చేస్తుంది. దీని ఫలితంగా రోగనిరోధక శక్తి తగ్గిపోయి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.
నిద్రలేమి వల్ల అనారోగ్యానికి గురి కావడమే కాదు అనారోగ్యం నుంచి ఎంత త్వరగా కోలుకుంటాం అనేది ఆధారపడి ఉంటుందని వెల్లడించారు. ఎక్కువ కాలం నిద్ర లేకపోవడం వల్ల మధుమేహం, ఊబకాయం, గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. తగినంత నిద్ర లేకపోతే శరీరంలో ఆక్సిడెంట్లు పెరిగి రోగనిరోధకశక్తి తగ్గిపోతుంది. ఇది గుండెని ప్రభావితం చేస్తుంది. నిద్రపోయేటప్పుడు పరిధియా, రక్తశోషరస కణుపుల్లో భేదం ఏర్పడి రోగనిరోధక కణాలు గరిష్ఠ స్థాయికి చేరుకుంటాయి. ఒక వేళ నిద్ర సరిగా పోకపోతే సైటోకిన్ల ఉత్పత్తి తగ్గిపోతుంది.
నిద్రలేమి రోగనిరోధక శక్తిని ప్రభావితం చేస్తుందనేందుకు సంకేతాలు
⦿ తరచూ శ్వాసకోశ సమస్యలు
⦿ శరీరంలో నొప్పులు
⦿ రక్తంలో చక్కెర/గ్లూకోజ్ స్థాయిలు పెరగడం
⦿ రక్తపోటు పెరుగుదల
నిద్రలేమి వల్ల చిరాకు, పగటి పుట నిద్రపోవడం, అలసట, బద్ధకం, తరచుగా ఇన్ఫెక్షన్స్, గుండె జబ్బులతో పాటు ఇతర సమస్యలు కూడా వస్తాయి.
అధిగమించడం ఎలా?
మనం ఆరోగ్యంగా ఉండాలంటే సుమారు 7 నుంచి 9 గంటల నిద్ర అవసరం. వయస్సుని బట్టి నిద్ర అవసరమయ్యే సమయం మారుతూ ఉంటుంది. తగినంత శారీరక శ్రమ ఉంటే హాయిగా నిద్ర పడుతుంది. వీలైనంత వరకు పడుకునే గదిలోకి ఫోన్ తీసుకురాకుండా ఉండటమే మంచిది. క్రమం తప్పకుండా ఒకే సమయానికి నిద్ర పోవడం అలవాటు చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల అన్నీ పనులు సమయానికి జరుగుతాయి. నిద్రించే గదిలో వెలుతురు లేకుండా చూసుకోవాలి. లైట్లు ఉండటం వల్ల నిద్రకు ఆటంకం కలుగుతుంది.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also Read: ఎక్స్ పైర్ అయిన ఫుడ్ తింటే ఏమవుతుంది? వాటి వల్ల వచ్చే అనర్థాలేంటి?