New Year Workout Goals: ఆరంభ శూరత్వం వద్దు - క్రమం తప్పకుండా జిమ్‌కు వెళ్లాలంటే ఈ టిప్స్ పాటించండి
Workouts : కొత్త ఏడాది చాలామంది ఉత్సాహంగా ఎక్సర్ సైజులు, వర్కౌట్స్ ప్రారంభించాలని చూస్తారు. కొద్ది రోజుల తర్వాత అన్నీ మానేస్తారు. మళ్లీ పరిస్థితి మొదటికి వస్తుంది. అలా కాకుడదంటే ఈ టిప్స్ పాటించండి.
New Year Gym Tips in Telugu : కొత్త ఏడాది వస్తుందంటే చాలు.. ఈసారి తప్పకుండా ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలని, ఫిట్‌నెస్ పొందాలనే లక్ష్యం పెట్టుకుంటారు. 1వ తేదీన జిమ్‌లో జాయిన్ అవుతారు. 2వ తేదీన ఆ ఎఫెక్ట్‌తో ఒళ్లు నొప్పులు వస్తాయి. దీంతో సెలవు పెడతారు. మూడో రోజు నీరసంగా జిమ్‌కు వెళ్తారు. ఒళ్లు నొప్పులు ఎక్కువై నాలుగో రోజు సెలవు పెడతారు. ఐదవ రోజు వెళ్దామ్ లే.. అనుకుంటారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో మీకు తెలిసిందే. ఇలాంటివారినే ఆరంభ శూరులని అంటారు. ఫిట్‌నెస్ గోల్స్ రీచ్ అవ్వాలనే టార్గెట్ మంచిదే. కానీ, కచ్చితమైన లక్ష్యం.. సాధించాలనే చిత్తశుద్ధి లేకపోవడం, బద్దకం మిమ్మల్ని ముందుకు సాగనివ్వవు. అలా జరగకూడదంటే తప్పకుంటా ఈ నియమాలు పాటించాలి.
డైలీ వర్కౌట్ మిస్ కాకుండా ప్లాన్ చేసుకోండి:
ఒక్కోసారి మనం పని బిజీలో పడి వర్కౌట్ చేయడం బద్దకిస్తూ ఉంటాం. ఒక్కరోజు వర్కౌట్ చేయకపోయినా అది మీ శరీరంపై ఎంతో ప్రభావం చూపిస్తుంది. ముఖ్యంగా ఒకరోజు వర్కౌట్ చేయకపోతే, మరుసటి రోజు కూడా మీకు వర్కౌట్ చేయబుద్ధి కాదు. ఇలా మీ వర్కౌట్ అటకెక్కుతాయి. ఈ సమస్య నుంచి బయట పడాలంటే మీరు మీ షెడ్యూల్స్ మార్చుకోవాల్సి ఉంటుంది.
వర్కౌట్స్ బోర్ కొట్టకుండా చేసుకోండి:
మీరు ఒకే చోట నిలబడి వ్యాయామం చేస్తుంటే మాత్రం బోర్ కొట్టకుండా ఏర్పాట్లు చేసుకోండి.ముఖ్యంగా ట్రెడ్ మిల్ పై వాకింగ్, జాగింగ్ వంటి కార్డియో ఎక్సర్ సైజులు చేస్తుంటే మాత్రం మీరు కాస్త రిలాక్స్ అవడం కోసం కొద్దిగా సంగీతం వినడం వంటివి చేయవచ్చు. ప్రత్యేకించి మీరు అమితంగా ఇష్టపడే మోటివేషనల్ మ్యూజిక్ వింటూ వర్కౌట్ చేయవచ్చు. ఇలా చేయడం ద్వారా మీరు వ్యాయమం స్కిప్ చేసే అవకాశం తగ్గుతుంది.
స్నేహితులతో కలిసి వర్కౌట్ చేయండి:
మీ స్నేహితులతో కలిసి ఎక్సర్ సైజలు చేయడం ద్వారా మీరు ఒకరిని ఒకరు ప్రేరేపించుకొని వర్కౌట్ చేయవచ్చు. తద్వారా మీరు ఉత్సాహంతో లక్ష్యాలను చేదించవచ్చు. ఒంటరిగా వర్కౌట్ చేయడం అనేది మనల్ని బోర్ కొట్టిస్తుంది. బడ్డీ వర్కవుట్‌లను షెడ్యూల్ చేయడం కష్టంగా అనిపిస్తే లేదా మీరు దూరపు స్నేహితుడితో కలిసి వర్చువల్‌గా ఒకరినొకరు ప్రోత్సహించుకుంటే వర్కౌట్ చేయవచ్చు. జూమ్ యాప్ ద్వారా కలిసి మీరు వర్కౌట్ చేయవచ్చు. కొన్ని రకాల యాప్స్ ద్వారా మీరు వర్చువల్ గా కలిసి వర్కౌట్ చేయవచ్చు.
పర్సనల్ ట్రైనర్ ని నియమించుకోండి:
పర్సనల్ ట్రైనర్ వర్కవుట్ అయితే మీరు వర్కౌట్ స్కిప్ చేసే అవకాశం ఉండదు. మీరు వ్యాయామం క్రమం తప్పకుండా చేయాలంటే వ్యక్తిగత ట్రైనర్ సరైన మార్గం అనే చెప్పాలి. వ్యక్తిగత శిక్షకులు తమ క్లయింట్‌లను జవాబుదారీగా ఉంచడమే కాకుండా, మీరు వర్కౌట్ స్కిప్ చేయకుండా వారు డిఫరెంట్ వర్కవుట్ లను డిజైన్ చేస్తారు. తద్వారా మీరు ఫిట్ నెస్ కోల్పోకుండా ఉంటారు. పర్సనల్ ట్రైనర్ తో పని చేయడం వలన మీరు మీ సమయాన్ని గరిష్టంగా పెంచుకోవచ్చు. ప్రతి దశలో ఏమి చేయాలో మీ శిక్షకుడు మీకు చెప్తాడు కాబట్టి, దానిని మీరు ఫాలో అయితే సరిపోతుంది. మీరు అనవసరంగా శక్తిని వృథా చేయాల్సిన అవసరం లేదు.
చిన్న లక్ష్యాలను నిర్దేశించుకోండి:
మీరు చిన్న లక్ష్యాలను సెట్ చేసుకోవడం ద్వారా వర్కౌట్ ప్లాన్ కంటిన్యూ చేయవచ్చు. ముఖ్యంగా మీరు వర్కౌట్స్ ప్లాన్ చేసే సమయంలో బరువు తగ్గాలని, రిపిటీషన్స్ పెంచాలని ఇలా చిన్న లక్ష్యాలను ఏర్పాటు చేసుకుంటే మీరు మీ టార్గెట్ రీచ్ అవగలరు. అంతే కాదు మీరు ఫిట్ నెస్ కాపాడుకోగలరు. ఉదాహరణకు, మీరు రోజుకు 10,000 అడుగులు వేయాలి అనుకొని వర్కౌట్ స్టార్ట్ చేస్తే అది నెమ్మదిగా లక్ష్యం వెైపు వెళ్తుంది.
ఇతర వ్యాయామాలపై దృష్టి పెట్టండి:
క్లాసిక్ కార్డియో, స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ముఖ్యమైన వర్కౌట్స్, కానీ ఇవి రెగ్యులర్ గా చేసే మీరు బోర్ ఫీలవుతారు. అలాంటప్పుడు మీరు సాంప్రదాయేతర వ్యాయామాలు చేయాలి. గేమ్స్, డ్యాన్స్, రోప్ జంపింగ్, ట్రాంపోలిన్ జంప్ కు వెళ్లడం, బాక్సింగ్ వంటివి మిమ్మల్ని ఫిట్ నెస్ తో ఉంచుతాయి.
టైం అనేది చాలా ముఖ్యమైనది:
వర్కౌట్ చేసే సమయంలో మీరు టైం చూసుకోవడం అనేది చాలా ముఖ్యమైనది. ప్రతి రోజు ఒకే సమయంలో వర్కౌట్ చేయడం ద్వారా మీరు శరీరాన్ని ఫిట్ గా చేసుకోవచ్చు. అయితే ఒక్కోసారి మీకు టైం కుదరనప్పుడు పనిచేసే సమయంలోనే ఇతర వర్కౌట్స్ చేయాల్సి ఉంటుంది. అయితే లంచ్ టైం, డిన్నర్ టైం తర్వాత వర్కౌట్స్ చేయకూడదు. సాధారణంగా నిద్ర లేచిన తర్వాత తెల్లవారుజామున అయితే వర్కౌట్స్ చేసేందుకు చాలా అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు.
ఏదో ఒక పని చేయండి:
మీరు పనిలో బిజీగా ఉన్నప్పుడు కూడా వర్కౌట్ అనేది మిస్ కావద్దు. ఇందుకు మీకు మీరే పనిని సెట్ చేసుకోండి. పని మధ్యలో కాసేపు చిన్న చిన్న వ్యాయామాలు చెయ్యండి. మెట్లు ఎక్కడం, ఆఫీసులో వాకింగ్ చేయడం. జాగింగ్ చేయడం వంటివి కూడా మీకు వర్కౌట్ అనుభూతిని అందిస్తాయి.
Also Read : అమ్మాయిలు న్యూ ఇయర్ పార్టీ కోసం మీ చర్మాన్ని, జుట్టుని సిద్ధం చేసుకోండిలా
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.