Fatigue Foods: అలసట, నీరసం వేధిస్తున్నాయా? వీటిని తినడం తగ్గిస్తే ఉత్సాహంతో ఉరకలేయచ్చు
నీరసం, అలసట అధికంగా కలగడానికి కొన్ని రకాల ఆహారాలు కారణం అవుతాయి.
ఉదయం లేచినప్పటి నుంచే నీరసం వేధిస్తుంది. చిన్న పని చేసినా అలసట. ఒక పక్క బాగానే తింటున్నా మరోపక్క ఈ నీరసం, అలసట వేధించడం ఏంటో అర్థం కాదు చాలా మందికి. వైద్యుడిని సంప్రదిస్తే బలానికి సప్లిమెంట్లు ఇస్తారు. అవి వేసినా కూడా అదనంగా బలం చేకూరుతుంది కానీ, అలసట తగ్గదు. మీకు రోజు మొత్తంలో అలసట, నీరసం వేధిస్తుంటే మీరు తినే ఆహారంపై ఓసారి దృష్టి పెట్టండి. కొన్ని రకాల ఆహారాల వల్ల శక్తి రాదు కదా సరికదా శరీరంలో నిస్సత్తువగా మారుతుంది. అలాంటి పదార్థాలను ఆహారంలో తగ్గించుకుంటే ఆరోగ్యం సొంతమవుతుంది.
చక్కెర పదార్థాలు
చక్కెర నిండిన పదార్థాలు రుచికి బావుంటాయి. కానీ శరీరానికి మాత్రం చాలా నష్టం కలిగిస్తాయి. చక్కెరతో నిండి ఆహారం వల్ల రక్తంలో ఒకేసారి గ్లూకోజ్ స్థాయిలు పెరుగుతాయి. ఇది కాసేపటికి తగ్గిపోతుంది కానీ ఫలితంగా అలసట పెరుగుతుంది. తీపి పదార్థాలు బరువు పెరిగేందుకు కారణమవుతాయి. సోడా, కేకులు, డోనట్స్, స్వీట్లు వంటి ఆహారాన్ని తగ్గించాలని వైద్యులు సూచిస్తున్నారు.
హైడ్రోజనేటెడ్ నూనెలు
ఈ నూనెను కేక్ మిక్స్, రెడీ టు మేకింగ్ ఫుడ్స్, క్రీమ్స్ వంటి వాటిలో ప్రిజర్వేటివ్స్ గా వాడతారు. ఈ నూనెల్లో కొవ్వు, సోడియం అధికంగా ఉంటాయి. ఇవి అలసటను పెంచుతాయి.
కాఫీ
కాఫీ ఒకట్రెండు సార్లు తింటే మంచిదే. కానీ అధికంగా తాగితే మాత్రం ఇతర సమస్యలు వచ్చే అవకాశం ఉంది. చాలా మేల్కొని ఉండేందుకు కాఫీని అధికంగా తాగుతుంటారు. ఇది నెమ్మదిగా దీర్ఘకాలిక అలసటకు కారణం అవుతుంది. అప్పటికప్పుడు చురుకుదనాన్ని కలిగిస్తుంది కానీ, కాలం గడిచేకొద్దీ అలసటగా మారుతుంది. అందుకే కాఫీ మితంగా తాగాల్సిన అవసరం ఉంది.
ఫ్రైడ్ ఫుడ్
ఫ్రెంచ్ ఫ్రైస్, ఫ్రైడ్ చికెన్, ఆనియన్ రింగ్స్ వంటివి నూనెలో డీప్ ఫ్రై చేసి అమ్ముతారు. కొన్నింటిని మసాలా దట్టించి డీప్ ఫ్రై చేస్తారు కూడా. అలాంటివి రోజూ తినేవారు ఉన్నారు. ఇలాంటి చిరుతిండడి వల్ల కూడా శరీరానికి అలసట, నీరసం కలుగుతుంది. నూనెలో వేయించే పదార్థాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.
ప్రాసెస్ చేసిన ఆహారాలు
బర్గర్లు, కోల్డ్ నట్స్, ఫ్రోజెన్ డెజర్ట్‌లు, పిజాలు వంటివి ప్రాసెస్ చేసిన ఆహారాల జాబితాలోకి వస్తాయి. వీటిలో అధికమొత్తంలో కేలరీలు, కొవ్వు, సోడియం అధికంగా ఉంటాయి. శరీరానికి పోషకాహారాన్ని అందించే బదులు ఇవి మన శరీరంలోని శక్తిని లాగేసుకుంటాయి. ఇవి సాధారణం కంటే అధికంగా అలసిపోయేలా చేస్తాయి.
Also read: ఏడాదికి పన్నెండుకోట్లకు పైగా అవాంఛిత గర్భాలు, అందులో మన దేశం వాటా ఎంతో తెలుసా?