Wall Sit: గోడ కుర్చీ శిక్ష కాదు ఆరోగ్యానికి రక్ష, రోజుకు అయిదు నిమిషాలు వేస్తే ఎన్ని ప్రయోజనాలో
గోడకుర్చీ వేయడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలున్నాయని చాలా తక్కువ మందికి తెలుసు.
గోడ కుర్చీ... ఓ నోస్టాల్జియా. స్కూలు రోజులను గుర్తుకు తెచ్చే ఓ తీయని పనిష్మెంట్. అప్పట్లో గోడు కుర్చీ వేయడం ఒక అవమానం. ఇప్పుడు మాత్రం అందమైన జ్ఞాపకం. పెద్దయ్యాక ఎవరూ గోడ కుర్చీలు వేయరు. వాటిని శిక్షగానే భావిస్తారు. నిజానికి మానసిక, శారీరక ఆరోగ్యానికి గోడకుర్చీ చాలా అవసరం. అత్యుత్తమ వ్యాయామాలలో ఇదీ ఒకటి. రోజుకు అయిదు నిమిషాలు గోడ కుర్చీ వేసినా చాలు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. దీన్ని పనిష్మెంట్ విభాగం నుంచి తీసివేసి వ్యాయామంగా భావించి రోజూ వేస్తే మంచిది.
1. గోడకు ఆనుకుని కూర్చునే గోడు కుర్చీలో ఓర్పును పెంచే గుణం ఉంది. రోజుకు అయిదు నిమిషాలు గోడకుర్చీ పొజిషన్లో కూర్చుంటే మానసికంగా చాలా శక్తివంతంగా తయారవుతారు. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతంగా ఉంచుతుంది. ఏకాగ్రతను పెంచుతుంది. ఏ విషయంపైనైనా ఫోకస్ బాగా పెట్టి ఆలోచించగల శక్తిని ఇస్తుంది.
2. నమ్మరాని విషయం ఏంటంటే గోడకుర్చీ వల్ల బరువు తగ్గొచ్చు. కండరాలను ఎక్కువ కాలం పాటూ సంకోచించేలా చేయడం వల్ల అధిక కేలరీలు ఖర్చవుతాయి. ఇలా కొన్ని సెకన్ల పాటూ కూర్చున్నా చాలు హృదయ స్పందన రేటు పెరుగుతుంది. కేలరీలు ఖర్చవ్వడం శరీరమంతా జరుగుతుంది. మీ హృదయనాళ వ్యవస్థ పని చేయడం ప్రారంభమైతే కేలరీలు బర్న్ కావడం అధికంగా ఉంటుంది.
3. శరీరం బరువుగా, బద్ధకంగా అనిపించే వారికి గోడకుర్చీ చాలా మేలు చేస్తుంది. దీన్ని క్రమం తప్పకుండా చేస్తే శరీరం తేలిక అనిపిస్తుంది. చురుగ్గా మీరు ఇటూ అటూ కదలగలుగుతారు. శరీరం చాలా ఫ్లెక్సిబుల్ గా మారుతుంది.
4. గోడకుర్చీలు శరీరంలో కోర్ స్టెబిలిటీ కోసం ఒక అద్భుతమైన వ్యాయామం. పొట్ట దగ్గరి కండరాలను బలంగా మార్చడానికి ఇది మంచి ఎక్సర్‌సైజు.
5. కాళ్లు, తొడలకు బలాన్నిస్తుంది గోడ కుర్చీ. ఎక్కువ సేపు నడిచినా, పరిగెట్టినా, పనిచేసినా అలసట రాదు. శరీరంలోని కండరాల పటుత్వానికి, శక్తికి కూడా గోడ కుర్చీ చాలా మేలు చేస్తుంది.
ఈ వ్యాయామాన్ని ఎంచక్కా ఇంట్లోనే చేసుకోవచ్చు. జిమ్ కు వెళ్లాల్సిన అవసరం కూడా లేదు. రోజుకు అయిదు నిమిషాలు అలా కూర్చోవడానికి ప్రయత్నించండి. కొన్ని రోజుల తరువాత మీ ఆరోగ్యంలో మెరుగుదలను మీరే గుర్తిస్తారు.
Also read: ఎంత కోపం వచ్చినా మీ పిల్లలతో ఈ మాటలు అనవద్దు, వారి మనసులో ఉండిపోతాయి
Also read: అధిక కొలెస్ట్రాల్‌తో బాధపడుతున్నారా? ఈ ఒక్క కూరగాయ తింటే చాలు, అంతా కరిగిపోతుంది