Mango Recipe: పచ్చి మామిడి కాయలతో టేస్టీ హల్వా, తింటే మైమరచిపోతారు
మామిడి కాయలతో చేసే టేస్టీ స్వీటు ‘మ్యాంగో హల్వా’.
వేసవిలో విరివిగా దొరికేవి మామిడి కాయలు. పుల్లపుల్లగా, తీయతీయగా రుచి తగిలే మామిడి కాయలతో హల్వా చేసుకుని తింటే ఆ రుచే వేరు. తినే కొద్దీ మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది. మామిడి కాయల్లో ఎన్నో పోషకాలు ఉన్నాయి. వాటితో వండిన వంటకాలు తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుంటామి. వీటి వల్ల రొమ్ము, పెద్ద పేగు వంటి క్యాన్సర్లు వచ్చే అవకాశం తగ్గుతుంది. మహిళలు మామిడి పండ్లు, కాయలు తినడం వల్ల పాదాల పగుళ్లు తగ్గుతాయి. నిద్రలేమితో బాధపడే వారికి ఒక మామిడి పండను తింటే రాత్రి చక్కగా నిద్రపడుతుంది.
కావాల్సిన పదార్థాలు
మామిడి కాయలు - రెండు (మీడియం సైజువి)
సగ్గు బియ్యం - అరకప్పు
నెయ్యి - అరకప్పు
పంచదార - రెండు కప్పులు
జీడిపప్పు - అయిదు పలుకులు
కొబ్బరి పాలు - రెండు కప్పులు
జాజికాయ పొడి - చిటికెడు
ఉప్పు - చిటికెడు
ఫుడ్ కలర్ - గ్రీన్ కలర్ (పచ్చగా వచ్చేందుకు)
ఫుడ్ కలర్ మీకు నచ్చితే వాడుకోవచ్చు. లేదా వదిలేయచ్చు.
తయారీ ఇలా
1. సగ్గు బియ్యాన్ని ముందురోజు రాత్రే శుభ్రంగ కడిగి నీళ్లలో నానబెట్టుకోవాలి.
2. మామిడి కాయలు పుల్లవి, తీయనివి ఏవైనా ఎంచుకోవచ్చు. పొట్టు తీసేసి ముక్కలుగా కోసుకోవాలి.
3. ఆ ముక్కలను మిక్సీలో వేసి మెత్తగా చేసుకోవాలి.
4. స్టవ్ పై కళాయి పెట్టి నెయ్యి వేసుకోవాలి. అందులో మామిడి గుజ్జుని వేసి వేయించాలి.
5. గుజ్జు కాసేపే వేగాక కొబ్బరిపాలు పోయాలి. మిశ్రమాన్ని బాగా కలపాలి.
6. మిశ్రమం కాసేపు ఉడికాక బాగా నానిన సగ్గుబియ్యం కూడా వేయాలి.
7. కాసేపు ఉడికించాక అందులో పంచదార కలపాలి. బాగా కలిపాక మరో అయిదు నిమిషాలు ఉడకనివ్వాలి.
8. తరువాత ఉప్పు, యాలకుల పొడి, జాజికాయ పొడి, ఫుడ్ కలర్ కలపాలి. వీటిని బాగా కలిసేలా గరిటెతో తిప్పాలి.
9. మిశ్రమం చిక్కగా అయ్యే వరకు చిన్న మంటపై ఉడికించాలి.
10. దించడానికి ముందు నెయ్యి వేసి మళ్లీ కలపాలి. స్టవ్ కట్టేయాలి.
11. ఒక ప్లేట్ కు నెయ్యి రాసి ఈ వేడి మిశ్రమాన్ని వేయాలి.
12. ప్లేటంతా మిశ్రమం పరుచుకునేలా వేసుకున్నా పైన జీడిపప్పులు చల్లుకోవాలి.
13. చల్లారక హల్వా కాస్త గట్టి పడుతుంది. ముక్కలుగా కోసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మామిడి కాయ తీయనిది అయితే కేవలం తీపిగానే ఉంటుంది, అదే పుల్లనిదైతే పుల్లపుల్లగా బావుంటుంది.
Also Read: ఎంత ప్రయత్నిస్తున్నా పొట్ట తగ్గడం లేదా? దానికి ఈ అలవాట్లే కారణం
Also read: అమ్మను పెళ్లి దుస్తుల్లో అలా చూసి, నిజమైన ఆనందం అంటే ఇది, వీడియో చూడాల్సిందే