Jidipappu Upma Recipe : జీడిపప్పు ఉప్మా విత్ పల్లీ చట్నీ.. నోరూరించే కాంబినేషన్, టేస్టీ రెసిపీ ఇదే
Upma : వేడి వేడి జీడిపప్పు ఉప్మాను టేస్టీగా చేసుకుని దానిలోకి అదిరిపోయే కాంబినేషన్‌గా పల్లీ చట్నీ చేసుకుంటే పర్ఫెక్ట్ బ్రేక్‌ఫాస్ట్‌ని ఎక్స్పీరియన్స్ చేసుకోవచ్చు. రెసిపీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం.

Jidipappu Upma : ఉప్మాను కొందరు అస్సలు ఇష్టపడరు. కానీ మరికొందరు ఇష్టంగా చేసుకుని తింటారు. సరిగ్గా చేసుకోవాలే కానీ ఉప్మాను మించిన టేస్టీ బ్రేక్‌ఫాస్ట్ మరొకటి ఉండదు. దానిలో జీడిపప్పు కూడా వేస్తే టేస్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మరి అలాంటి టేస్టీ జీడిపప్పు ఉప్మాను సరైన కొలతలతో కొన్ని టిప్స్ ఫాలో అవుతూ చేస్తే రుచి అదిరిపోతుంది. దానికి కాంబినేషన్‌గా పల్లీ చట్నీ కూడా చేసుకుంటే ఆల్ సెట్. మరి ఈ రెండు రెసిపీలను ఎలా చేసుకోవాలి? కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం.
కావాల్సిన పదార్థాలు
ఉప్మా రవ్వ - 2 గ్లాసులు (సూజీ రవ్వ)
పచ్చిమిర్చి - 8
కరివేపాకు - 2 రెబ్బలు
అల్లం - అంగుళం
ఉల్లిపాయలు - పెద్దది ఒకటి
నిమ్మకాయ - 1
నెయ్యి - 100 గ్రాములు
పచ్చిశనగపప్పు - 1 స్పూన్
ఆవాలు - 1 స్పూన్
జీలకర్ర - 1 స్పూన్
మినపప్పు - 1 స్పూన్
జీడిపప్పు - 50 గ్రాములు
తయారీ విధానం
ముందుగా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం ముక్కలుగా కోసుకోవాలి. ఉల్లిపాయలను పొడుగ్గా, పచ్చిమిర్చిని సన్నగా, అల్లాన్ని తురుముకుని ఉప్మాకోసం సిద్ధం చేసుకోవాలి. ఇప్పుడు స్టౌవ్ వెలిగించి దానిపై మందపాటి కడాయి పెట్టాలి. దానిలో కాస్త నెయ్యి వేసి.. జీడిపప్పు వేసి వేయించుకోవాలి. జీడిపప్పు గోల్డెన్ రంగు వచ్చేవరకు వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో ఉప్మా రవ్వ వేసుకుని మాడిపోకుండా వేయించుకోవాలి. దోరగా వేయించుకుంటే ఉప్మా రుచి నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇప్పుడు రవ్వను కూడా తీసేసి పక్కన పెట్టుకోవాలి.
కడాయిలో నెయ్యి వేసి దానిలో పచ్చిశనగపప్పు వేసి కాసేపు వేయించుకోవాలి. అవి దోరగా మారుతున్నాయనుకున్నప్పుడు మినపప్పు వేసుకోవాలి. అవి రంగు మారేప్పుడు ఆవాలు, జీలకర్ర వేయాలి. అవి కాస్త వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయలు కాస్త మగ్గిన తర్వాత దానిలో పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం వేసి వేయించుకోవాలి. వాటిలో తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు దానిలో నీళ్లు వేసుకోవాలి. ఒక్క గ్లాసు రవ్వ తీసుకుంటే దానికి మూడు గ్లాసుల నీళ్లు పోసుకోవాలి. మీరు ఎలా తీసుకున్నా కొలత ఇలా ఉండేలా చూసుకుంటే పర్ఫెక్ట్ ఉప్మా వస్తుంది.
నీళ్లు మరుగుతున్నప్పుడు నిమ్మకాయ రసాన్ని పిండుకోవాలి. ఇప్పుడు ముందుగా వేయించుకున్న ఉప్మా రవ్వను కొంచెం కొంచెంగా వేస్తూ కలపాలి. ఉప్మా రవ్వ ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండాలి. ఇలా కలిపేప్పుడు జీడిపప్పు వేసుకోవాలి. రెండు నిమిషాలు ఉడికించి స్టౌవ్ ఆపేయాలి. ఇప్పుడు దానిపై కాస్త నెయ్యి వేసి పక్కన పెట్టేయాలి. 5 నిమిషాల తర్వాత దానిని కలిపితే టేస్టీ టేస్టీ జీడిపప్పు ఉప్మా రెడీ.
పల్లీ చట్నీ కాంబినేషన్‌తో..
ఉప్మాను ఇలా నేరుగా తినొచ్చు. కానీ దానిని పల్లీ చట్నీతో తింటే ఆ రుచి నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. దీనికోసం ముందుగా పల్లీలు వేయించుకోవాలి. నూనె వేసి దానిలో కాస్త జీలకర్ర ఓ పది పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. వెల్లుల్లి రెబ్బలపై తొక్క తీసి ఓ 5 వేసి దానిలో వేయించుకోవాలి. స్టౌవ్ ఆపేసి చింతపండు నానబెట్టుకుని.. పల్లీలపై పొట్టు తీసుకోవాలి. ఇప్పుడు మిక్సీలో పల్లీలు, పచ్చిమిర్చి మిశ్రమం వేసుకుని మిక్సీ చేసుకోవాలి. చింతపండు గుజ్జు కూడా వేసి చట్నీ చేసుకోవచ్చు. దీనిని నేరుగా తినొచ్చు. లేదా తాళింపు వేసుకుని చట్నీకి కాంబినేషన్‌గా తీసుకోవచ్చు.






















