మీ పిల్లలకు ఫోన్లు ఇస్తున్నారా? వారి ‘మెదడు’ను పాడుచేస్తోంది మీరే - ఎంత నష్టమో చూడండి
పసి పిల్లలను ఎక్కువ సమయం పాటు స్క్రీన్ ముందు ఉంచితే మెదడుకు నష్టం అని నిపుణులు అంటున్నారు. ఇది శాశ్వత నష్టానికి కూడా దారితీయొచ్చట.
మా బాబు వయసు 10 నెలలు కూడా లేదు. కానీ వాడికి టాబ్‌లో యూట్యూబ్ వాడంతట వాడే వీడియోలు తెరిచి చూసేస్తాడు. ఎన్ని తెలివి తేటలో నా బిడ్డకు అనుకుంటూ మురిసిపోతున్నారా? మా పాప స్మార్ట్ ఫోన్లో కార్టూన్ చూస్తే గానీ ముద్ద నోట్లో పెట్టడు.. అంటూ గొప్పగా చెప్పుకుంటున్నారా? మా బుడ్డొడు వీడియో గేములు ఎంత బాగా ఆడతాడో అంటూ.. వారి ప్రతిభను చూసి సంతోషపడిపోతున్నారా? అయితే, వారి మెదళ్లను మీరే పాడు చేస్తున్నారని గుర్తుంచుకోండి. భవిష్యత్తులో అది మందబుద్దికి దారితీయొచ్చు.
ఇది ఎందుకు ఆలోచించరు?
పెద్దలకే స్క్రీన్ టైం పెరిగే కొద్దీ మానసిక అనారోగ్యాలు కలుగుతున్నాయని ఒకవైపు మానసిక నిపుణులు గగ్గోలు పెడుతుంటే.. మనం బాల్యంలోనే పిల్లల చేతికి మొబైళ్లు ఇచ్చేసి వారి స్క్రీన్ టైమ్‌ను పెంచేస్తున్నాం. అన్నం తింటారనో, ఏడుపు ఆపుతారనో మొబైళ్లను వారి చేతిలో పెట్టి చేతులు దులిపేసుకుంటున్నాం. కానీ, అక్కడ కాస్త సహనం వహించి.. వారిని వేరే మాటల్లో పెట్టి.. ఆ అలవాటును తప్పిస్తే, భవిష్యత్తు చక్కదిద్దినవాళ్లం అవుతాం. ఇంకా మీరు ఏం కాదులే అనే నిర్లక్ష్య వైఖరి కనబరుస్తున్నారా? అయితే, మీరు తప్పకుండా తాజా అధ్యయనంలో బయటపడిన ఈ విషయాలు గురించి తెలుసుకోవల్సిందే.
మెదడుకు చాలా నష్టం
పసి పిల్లలను ఎక్కువ సమయం పాటు స్క్రీన్ ముందు ఉంచితే మెదడుకు నష్టం అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చిన్నగా మొదలయ్యే ఈ సమస్య శాశ్వతంగా మెదడను నాశనం చేయొచ్చని చెబుతున్నారు. పిల్లలు అప్రమత్తంగా ఉండేందుకు, ఎమోషన్స్ అదుపులో పెట్టుకునేందకు, చెప్పింది అర్థం చేసుకుని చేసేందుకు కొంత శ్రమించాల్సి ఉంటుంది. అందుకోసం మెదడు కొంచెం ఎక్కువ పనిచెయ్యాల్సి ఉంటుంది.
అధ్యయనంలో భాగంగా నిపుణులు.. 12 నెలల వయసున్న పిల్లలు ప్రతి రోజు స్క్రీన్ మీద ఎంత సమయం గడుపుతారో తెలియజేయాలని తల్లిదండ్రులను కోరారు. గంట కంటే తక్కువా? లేక ఒకటి నుంచి రెండు గంటలా? లేక రెండు నుంచి నాలుగు గంటలా? అంతకు మించిన సమయం స్క్రీన్ మీద గడుపుతారా? అని వివిధ గ్రూపుల్లో ప్రశ్నించారు.
అనంతరం ఆయా పిల్లల బ్రెయిన్ యాక్టీవిటి 12, 18 నెలలు పరీక్షించి చూశారు. ఎక్కువ సమయం పాటు కాన్సంట్రేషన్ నిలుపగలిగె సమయం, ఇంపలైవ్ నెస్ కంట్రోల్ చేసే తీరును 9 సంవత్సరాల వయసు పిల్లల్లోనూ గమనించి చూశారు. అయితే ఎక్కువ సమయం పాటు స్క్రీన్ మీద గడిపే పిల్లల బ్రెయిన్ వేవ్ ఫ్రీక్వెన్సీ తక్కువగా ఉన్నట్టు తెలిసింది. ఫలితంగా అప్రమత్తంగా ఉండేందుకు కష్టపడాల్సి వస్తోందని నిపుణులు తమ అభిప్రాయాన్ని తెలియజేశారు.
మెదడు ఎదుగుదలపై చెడు ప్రభావం
పుట్టినప్పటి నుంచి కూడా మెదడు ఎదుగుదల చాలా వేగంగా జరుగుతుంది. అయితే, శ్రద్ధ పెట్టడం, భావోద్వేగ నియంత్రణ అనేవి అభివృద్ధి చెందడానికి మాత్రం కాస్త ఎక్కువ సమయం పడుతుంది. స్క్రీన్ మీద వెంటవెంటనే మారే చిత్రాలు, మిరిమిట్లు గొలిపే లైట్ల వల్ల మెదడు ఎదుగుదల మీద ప్రభావం పడుతుంది. ఇలా మారే చిత్రాలు, లైట్లు పసివారి కాగ్నిటివ్ స్కిల్స్ మీద ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతున్నాయట.
భవిష్యత్ తరాల మెదడు పనితీరు మీద స్క్రీన్ ప్రభావం నేరుగా ఉంటోందనే విషయాన్ని అంత తేలిగ్గా తీసుకునే విషయం కాదని సింగపూర్‌కు చెందిన ప్రొఫెసర్ చోంగ్ యాప్ సెంగ్ ఓ మీడియా సంస్థతో తెలిపారు. మీ పిల్లలను స్క్రీన్ నుంచి కాపాడుకోకుంటే తర్వాత కాలంలో మీ పిల్లలు చదువులో వెనుకపడి పోవచ్చు. కాబట్టి, మొబైల్.. ట్యాబ్.. కంప్యూటర్.. ల్యాప్ టాప్.. టీవీల ప్రభావం పిల్లలపై పడకుండా చూసుకోవడం ఉత్తమ మార్గం.
Also Read: కరివేపాకు ఇలా తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు అసలు పెరగవు