NTR Style Mutton Pulao : ఎన్టీఆర్ స్టైల్ మటన్ పలావ్.. సండే స్పెషల్‌గా హీరో రెసిపీని ఫాలో అయిపోండి
Mutton Pulao Recipe : ఎన్టీఆర్ వంటలు బాగా చేస్తారని అందరికీ తెలుసు. ఆయన తినడానికి, వండడానికి కూడా బాగా ఇష్టపడతారు. మరి ఆయన స్టైల్లో మటన్ పలావ్‌ని ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం.

NTR Style Mutton Pulao Recipe : బిగ్‌బాస్ హోస్ట్‌గా ఎన్టీఆర్ సీజన్ 1 చేశారు. అప్పట్లో ఈ షోకి ఆయనవల్లే బాగా క్రేజ్ వచ్చింది. ఆ సమయంలో ఎన్టీఆర్ గురించి ఎన్నో విషయాలు అందరికీ తెలిసాయి. వాటిలో ఆయన కుకింగ్ స్కిల్స్ కూడా బయటకొచ్చాయి. అప్పటి బిగ్‌బాస్ కంటెస్టెంట్లకోసం ఆయన మటన్ పలావ్‌ని స్వయంగా ఆయన చేత్తొ వండి పెట్టారు. ఆయన చేసిన సింపుల్, టేస్టీ మటన్ పలావ్ రెసిపీని మీరు కూడా ఇంట్లో ఫాలో అయిపోవచ్చు. మరి ఇంతకీ ఎన్టీఆర్ స్టైల్ మటన్ పలావ్‌ని ఎలా చేయాలి? కావాల్సిన పదార్థాలు ఏంటి? ఫాలో అవ్వాల్సిన టిప్స్ ఏంటి వంటి విషయాలు ఇప్పుడు చూసేద్దాం.
కావాల్సిన పదార్థాలు
మటన్ - 1 కేజీ
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 2 టీస్పూన్లు
కారం - రెండు టేబుల్ స్పూన్లు
గరం మసాల - ఒకటిన్నర టేబుల్ స్పూన్
ఉప్పు - రుచికి తగినంత
మిరియాల పొడి - అర టీస్పూన్
బాస్మతి బియ్యం - రెండు కేజీలు
ధనియాల పొడి - రెండు టేబుల్ స్పూన్లు
నూనె - రెండు టీస్పూన్లు
పెరుగు - కప్పు
నూనె - 1 టేబుల్ స్పూన్
దాల్చిన చెక్క - 2
మిరియాలు - అర టీస్పూన్
యాలకులు - 4
లవంగాలు - 4
షాజీరా - 1 టీస్పూన్
ఉల్లిపాయలు - 1 కప్పు
పుదీనా - 1 కప్పు
టమాటాలు - అరకప్పు
ఉప్పు - రుచికి తగినంత
తయారీ విధానం
ముందుగా మటన్‌ని బాగా కడిగి కుక్కర్లో వేసుకోవాలి. దానిలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. దానిలో కారం, గరం మసాల, ఉప్పు, మిరియాల పొడి, ధనియా పౌడర్, నూనె, పెరుగు వేసుకుని పూర్తిగా మిక్స్ చేసుకోవాలి. మటన్‌కి ఈ మసాలాలు పూర్తిగా పట్టిన తర్వాత స్టౌవ్ వెలిగించి.. కుక్కర్‌ని దానిమీద పెట్టుకోవాలి. తీసుకున్న మటన్‌ని బట్టి మూడు లేదా నాలుగు విజిల్స్ వచ్చేవరకు మటన్‌ని ఉడికించుకోవాలి. రెండు విజిల్స్ని మంట ఎక్కువ మీద ఉంచి.. మిగిలిన రెండు విజిల్స్ మంటను తగ్గించి దానిపై ఉడికించాలి. ఇది ఉడికేలోపు బాస్మతి రైస్‌ని కడిగి పక్కన పెట్టుకోవాలి.
మటన్ ఉడికిన తర్వాత దానిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టౌవ్ వెలిగించి పెద్ద గిన్నె పెట్టుకోవాలి. దానిలో నూనె వేసుకోవాలి. నూనె వేగిన తర్వాత దానిలో దాల్చిన చెక్క, మిరియాలు, యాలకులు, లవంగాలు వేసుకోవాలి. షాజీరాను కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలను, పచ్చిమిర్చిని వేసి కలుపుకోవాలి. ఉల్లిపాయలు ఉడుకుతున్న సమయంలో పుదీనా కూడా వేసుకోవాలి. ఈ రెండు ఉడికిన తర్వాత దానిలో టమాటాలు వేసి మగ్గనివ్వాలి.
టమాటాలు మగ్గిన తర్వాత దానిలో ఉడికించుకున్న మటన్ వేసి కలిపి రెండు నిమిషాలు ఉల్లిపాయలు అన్ని కలిసేలా ఉడికించుకోవాలి. అనంతరం ముందుగా నానబెట్టుకున్న బాస్మతిరైస్ వేసుకోవాలి. బాస్మతి రైస్ బాగా నానితే.. ఒక కప్పు రైస్‌కి ఒక కప్పు నీళ్లు వేసుకోవాలి. బాగా నానకపోతే.. ఒక కప్పు రైస్‌కి.. ఒకటిన్నర కప్పు నీళ్లు వేసుకోవాలి. ఇలా వేసుకున్న చివర్లో ఉప్పు వేసి రుచి చూసుకుని.. బాగా కలిపి ఉడకనివ్వాలి.
మధ్యలో ఓసారి కలుపుకోవాలి. బాస్మతి రైస్ ఉడికిపోతే మటన్ పులావ్ రెడీ అయిపోయినట్లే. అయితే దీనిని ఉడికించుకునేందుకు మంటను చిన్నగా పెట్టి ఉడికించుకోవాలి. అప్పుడే మటన్ ఫ్లేవర్ రైస్‌కి కూడా వస్తుంది. అన్నం ఉడికితే స్టౌవ్ ఆపేసుకోవాలి. అంతే ఎన్టీఆర్ స్టైల్ మటన్ పలావ్ రెడీ. దీనిని నేరుగా తిన్నా.. రైతాతో లాగించినా టేస్ట్ అదిరిపోతుంది. మరి ఈ వీకెండ్ మీరు కూడా ఈ టేస్టి మటన్ పులావ్‌ను సిద్ధం చేసుకుని హాయిగా లాగించేయండి.
Also Read : టేస్టీ మటన్ దొన్నె బిర్యానీ రెసిపీ.. మిలాద్ ఉన్ నబీ స్పెషల్‌గా దీనిని చేసుకుని లాగించేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

