Weight Loss: బరువు తగ్గాలనుకునే వారికి ఈ సీజన్ బెస్ట్ - ఇలా చేశారంటే కొవ్వు ఇట్టే కరిగిపోతుంది
ఈ వేసవిలో బరువు తగ్గడం చాలా సులభమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ద్రవ పదార్థాలు తీసుకుంటే కొవ్వు కరిగిపోతుంది.
వేసవి వచ్చేసింది. బరువు తగ్గాలనుకునే వారికి ఈ సీజన్ ఉత్తమమైనది. వేడిగా ఉండటం వల్ల చెమటలు ఎక్కువగా పట్టి జీవక్రియ రేటు మెరుగ్గా ఉండటం వల్ల బరువు తగ్గడం చాలా సులభమవుతుంది. అలాగే అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లకి దారి తీస్తే చల్లని ఆహారాలు కూడా ఎక్కువగా తీసుకోవాలని ఈ సీజన్ లో అనిపించడం వల్ల బరువు పెరిగేందుకు ఆస్కారం ఉంది. కానీ ఆ కోరికలు అణచుకుని ప్రయత్నిస్తే మాత్రం బరువు తగ్గడం సాధ్యమవుతుంది.
ద్రవపదార్థాలు తీసుకోవాలి: అదనపు కొవ్వుని నివారించడానికి ఆరోగ్యకరంగా బరువుని తగ్గించుకోవడానికి మీరు చేయాల్సిందల్లా ద్రవ పదార్థాలు బాగా తీసుకోవడం. వేడి వాతావరణంలో హైడ్రేట్ గా ఉండేందుకు పుష్కలంగా నీరు తాగడం చాలా అవసరం. శరీరం దాహాన్ని కోరుకున్నా కూడా అది ఆకలిగా అనిపిస్తుంది. దాని వల్ల అనవసరంగా తింటారు. దానికి బదులు నీరు తాగితే మనకు కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. అతిగా తినకుండా నిరోధిస్తుంది. తాగునీరు జీవక్రియని నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇది ఎక్కువ కేలరీలను బర్న్ చేస్తుంది. కేవలం నీళ్లే కాదు బరువు తగ్గించుకోవడానికి సత్తు, మజ్జిగ, నిమ్మరసం వంటి ఆరోగ్యకరమైన పానీయాలను కూడా చేర్చుకోవచ్చు. చల్లగా ఉండటం కోసం శీతల పానీయాలు, సోడాలు ఎక్కువగా తీసుకోవద్దని వైద్య నిపుణులు సిఫార్సు చేస్తున్నారు.
పండ్లు, కూరగాయలు: ఆరోగ్యకరమైన ఆహారంలో ముఖ్యమైన భాగం పండ్లు, కూరగాయలు. వేసవిలో బరువు పెరగకుండా ఉండటానికి మీకు సహాయపడతాయి. అవి తక్కువ కేలరీలు, అధిక పోషకాలను కలిగి ఉంటాయి. ఆరోగ్యకరమైన చిరుతిండికి అద్భుతమైన ఎంపిక. వివిధ రకాల పండ్లు, కూరగాయల ముక్కలు తినడం వల్ల మీకు పొట్ట నిండుగా సంతృప్తిగా అనిపిస్తుంది. అతిగా తినే అవకాశం తగ్గుతుంది. వీటిలో అదనంగా ఫైబర్ లభిస్తుంది. ఇది ఆకలిని క్రమబద్ధీకరిస్తుంది. ఎక్కువ సేపు కడుపు నిండుగా ఉంచుతుంది.
వాకింగ్: వేసవి కాలం యాక్టివ్ గా ఉండటానికి బయట నడిచేందుకు ఎక్కువ సమయం చూసుకోవాలి. హైకింగ్, స్విమ్మింగ్, సైక్లింగ్ వంటి సరదా కార్యకలాపాల్లో పాల్గొనాలి. కేలరీలు బర్న్ అవుతాయి. శరీర ఆకృతిలో మార్పులు వస్తాయి. సాధారణ వ్యాయామం ఆకలిని నియంత్రించడంలో సహాయపడుతుంది. బరువుని సులభంగా నియంత్రించుకోవచ్చు.
ఆహారం విషయంలో జాగ్రత్త: బరువు తగ్గించుకోవాలని అనుకుంటే చిప్స్, తీపి వంటి పదార్థాలకు దూరంగా ఉండాలి. వేసవిలో ఎక్కువగా నట్స్ తినకూడదని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే అవి వేడిగా ఉంటాయి. వేసవిలో సమస్యలను కలిగిస్తాయి. వాటికి బదులుగా ఫైబర్ పుష్కలంగా ఉండే డాలియా, ఓట్స్, క్వినోవా వంటి తేలికపాటి ఆహారాలు తీసుకుంటే మంచిది. ఇవి శరీరాన్ని తేలికగా, చల్లగా ఉంచేందుకు దోహదపడతాయి. వివిధ రకాల సలాడ్ లు కూడా ఆహారంలో భాగంగా తీసుకోవచ్చు.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.