Diabetes Health Care: డయాబెటిస్ ఉందా? ఈ పరీక్ష తప్పక చేయించుకోవాలి లేదంటే ముప్పుతప్పదు
Health Tips in Telugu | మధుమేహం శరీరంలోని గుండె, కిడ్నీ, నాడీ వ్యవస్థ వంటి ముఖ్యమైన అన్ని అవయవాల మీద దుష్ప్రభావాన్ని చూపుతుంది. కొత్త అధ్యయనం మరింత ఆశ్చర్యకరమైన విషయాలను వెల్లడించింది.
Diabetics Health Tips | డయాబెటిస్ శరీరంలోని అన్ని ముఖ్యమైన అవయవాల మీద తీవ్రమైన ప్రభావం చూపుతుంది. టైప్ 2 డయాబెటిస్ తో బాధపడుతున్న వారికి కార్డియో వాస్క్యూలార్ డీసీజ్ తో పాటు హార్ట్ ఫెయిల్యూర్ ప్రమాదం కూడా పొంచి ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. టైప్2 డయాబెటిస్ తో బాధ పడుతున్న వారిలో సంపూర్ణ ఆరోగ్య వంతులతో పోల్చినపుడు 21 శాతం, కార్డియో వాస్క్యూలార్ సమస్యలు వస్తే 31 శాతం హార్ట్ ఫేయిల్యూర్ సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువ అని అధ్యయనకారులు చెబుతున్నారు.
నలుగురిలో ఒకరికి హార్ట్ ఫెయిల్యూర్!
ప్రపంచ వ్యాప్తంగా సంభవిస్తున్న మరణాల్లో గుండె జబ్బుల వల్ల మరణించే వాళ్లే అత్యధికం. ప్రతి నలుగురు డయాబెటిస్ పేషెంట్లలో ఒకరు హార్ట్ ఫెయిల్యూర్ ప్రమాదంలో ఉన్నారట. ఈ అధ్యయనం మన దేశంలో ముంబై, ఢిల్లీ నగరాల్లోని రెండు లాబ్ ల వాళ్లు నిర్వహించారు. దాదాపుగా 2000 మంది పేషెంట్ల శాంపిల్స్ ఆ అధ్యయనం కోసం ఉపయోగిచాంరు. HbA1c విలువలు 6.5 కంటే ఎక్కువ నమోదైన వారి సాంపిల్స్ లో చిన్న వయసులోనే హార్ట్ ఫేయిల్యూర్ కు కారణమయ్యే NT- proBNP బయో మార్కర్ ను గుర్తించారు. 1,054 మంది పేషెంట్ల శాంపిల్స్ చూసిపనపుడు దాదాపుగా 34 శాతం మందిలో కార్డయోవాస్క్యూలార్ సమస్యల వచ్చే ప్రమాదం ఉన్నట్టు గుర్తించారు.
పట్టణప్రాంతాల్లో నివసించే మధుమేహుల్లో హార్ట్ పేయిల్యూర్ ప్రమాదం ఎక్కువ అని ముంబైకి చెందిన ఒక ఎండోక్రైనాలజిస్ట్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. NT- proBNP పరీక్ష సమస్య మొదలుకాక ముందే తెలుసుకునే అవకాశాన్ని ఇస్తుంది. కనుక సమస్య తిరిగి కోలుకోలేని దశకు చేరుకోక ముందే డాక్టర్లు ఈ పరీక్ష గురించి పేషేంట్లకు అవగాహన కలిగించి పరీక్ష చేయించుకునేందుకు ప్రోత్సహించాలని కూడా ఈ అధ్యయనకారులు సూచిస్తున్నారు.
అవగాహనే ముఖ్యం
ఈ అధ్యయనాన్ని ఒక మేలుకొలుపుగా భావించాల్సిన అవసరం ఉంది. మధుమేహులు పెద్ద ప్రమాదంలో ఉన్నారని అర్థమైన తర్వాత వెంటనే తగిన జాగ్రత్తలు తీసుకోవడం, సమస్య గురించి అవగాహన కల్పించడం చేస్తే చాలా మందిని ప్రమాదం నుంచి కాపాడడం సాధ్య పడుతుందని ముంబైలో ఒక లాబ్ కు చెందిన సీఈఓ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఇలాంటి జాగ్రత్తలతో డయాబెటిస్ వల్ల కలిగే ప్రమాదకర దుష్ప్రభావాల నుంచి చాలా మంది మధుమేహులను రక్షించుకోవచ్చు. NT- proBNP అనే బయోమార్కర్ పరీక్ష చాలా అధునాతనమైన పరీక్షా విధానం. దీని ద్వారా గుండె ఆరోగ్యం మీద డయాబెటిస్ భారం ఎంతవరకు ఉంటుందనేది తెలుసుకోవడం సులభం అవుతుంది. ఈ పరీక్షతో గుండె పనితీరు, ఆకారంలో తేడాలు మొదలు కాక ముందే కనిపెట్టడం సాధ్యమవుతుంది.
ఈ పరీక్ష గురించిన అవగాహన లేక ఇప్పటికే పెద్ద సంఖ్యలో పేషెంట్లు ప్రాణాంతక స్థితికి చేరుకున్నారు. ఇంకెంతో మంది ప్రాణాలు కోల్పోయారు. కనుక ఇక నుంచైనా వైద్య నిపుణులు తమ వద్దకు వచ్చే పేషెంట్లకు ఈ పరీక్ష చేయించుకోవాల్సిందిగా సలహా ఇవ్వాలని ఈ అధ్యయనంలో పాలుపంచుకున్న నిపుణులు సూచిస్తున్నారు. HbA1c పరీక్ష మాదరిగానే ఈ బయోమార్కర్ పరీక్ష కూడా తప్పకుండా చేయించుకోవడం వల్ల ప్రాణాలను ముప్పులో పడకుండా నివారించుకోవడం సాధ్యమవుతుందని ఈ అధ్యయనం ద్వారా మరోసారి స్పష్టమైంది.