సెప్టిక్ షాక్ చాలా ప్రాణాంతం - ఈ లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయొద్దు
సెప్టిక్ షాక్ శరీరంలోని ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, కాలేయం వంటి వైటల్ ఆర్గాన్స్ మీద ప్రమాదకర ప్రభావం చూపించే సెప్సిస్ కండిషన్. అంతేకాదు ప్రాణాంతకం కూడా.
ఏదైనా ఇన్ఫెక్షన్‌కు గురైన తర్వాత బీపీ అకస్మాత్తుగా పడిపోయి ప్రాణాంతక పరిస్థితి ఏర్పడుతుంది. ఇలాంటి పరిస్థితిని సెప్టిక్ షాక్ అంటారు.
ఏ రకమైన బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అయినా సరే ఈ పరిస్థితికి దారితియ్యవచ్చు. చికిత్స చెయ్యకుండా వదిలేస్తే ప్రాణాంతకం కూడా కావచ్చు. బలహీనంగా అనిపించడం, గుండె వేగం పెరగడం, చలిగా అనిపించడం, వణుకు రావడం, శ్వాస వేగంగా పెరగడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొన్ని సార్లు ఎలాంటి కారణం లేకుండానే చెమటలు పట్టడం, మానసిక స్థితిలో మార్పు రావడం, కన్ఫ్యూజన్ వంటి లక్షణాలు కూడా సెప్సిస్ లో కనిపిస్తాయి.
సెప్సిస్ వల్ల చిన్నచిన్న రక్తనాళాలకు హాని కలిగించే రక్తం పరిసర భాగాల్లోని కణజాలాల్లోకి చేరితుంది. దానివల్ల గుండె రక్త ప్రసరణ సామర్థ్యం తగ్గిపోవచ్చు. ఇలా రక్తప్రసరణ తగ్గినపుడు మెదడు, కాలేయం వంటి ముఖ్యమైన అవయవాలకు రక్తం తగినంత అందక పోతే మరణానికి కారణం కావచ్చు.
కొంత మందిలో లక్షణాలు బయటికి తెలుస్తుంటాయి, అనారోగ్యంగా ఉన్నారని గుర్తించడం సులభంగానే ఉంటుంది. కానీ కొంత మందిలో సెప్టిక్ షాక్ లక్షణాలు పెద్దగా కనిపించవు. ఇలాంటి వారిలో పరిస్థితి విషమించడానికి ముందు కొన్ని ప్రత్యేక లక్షణాలు కనిపిస్తాయి. వాటి గురించి తెలుసుకుందాం.
సెప్సిస్‌లో సాధారణంగా కనిపించే లక్షణాలు
- లేచి నిలబడలేక పోవడం
- తల తిరగడం, లేదా లైట్ హెడెడ్ నెస్
- నిద్రలేమి, మగతగా ఉండడం
- తీవ్రమైన కన్ఫ్యూజన్, మానసిక స్థితి గందరగోళంగా ఉండడం
- విరేచనాలు, వాంతులు, వికారంగా ఉండడం
- చర్మం పాలిపోయి చల్లగా అనిపించడం
ఈ లక్షణాలు కనిపిస్తే అత్యవసర పరిస్థితిగా గుర్తించి వెంటనే డాక్టర్ ను సంప్రదించడం అవసరం.
పసిపిల్లలు, వృద్ధులు, గర్భిణులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధ పడుతున్న వారు, నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు చాలా ప్రాణాంతక ప్రమాదంలో పడవచ్చు. కనుక వీలైనంత త్వరగా స్పందించడం అవసరం. ఇన్ఫెక్షన్ కు కారణం ఏమిటి, ఏఏ అవయవాలు సెప్సిస్ ప్రభావానికి లోనయ్యాయి అనేదాని మీద చికిత్స ఆధారపడి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
తేలిక పాటి సెప్సిస్ నుంచి చాలామంది కోలుకుంటారు. కానీ సెప్టిక్ షాక్ కు గురైన వారిలో 30-40 శాతం వరకు మరణాలకు ఆస్కారం ఉంటుంది. లంగ్ ఫేయిల్యూర్, హార్ట్ ఫేయిల్యూర్, కిడ్నీ ఫేయిల్యూర్, అసాధారణ రక్త స్కందన వంటి సమస్యలు వచ్చినపుడు కోలుకోవడం కష్టమవుతుందనేది నిపుణుల అభిప్రాయం. కాబట్టి ఇన్ఫెక్షన్ తర్వాత సెప్సిస్ లక్షణాలు మైల్డ్ గా కనిపించినా సరే వైద్య సలహా తీసుకోవడం అవసరమని గుర్తించాలి.
Also read : Chewing Gum Side Effects: నమిలింది చాలు, ఊసేయండి - చూయింగ్ గమ్‌తో ఈ సమస్యల్లో పడతారు జాగ్రత్త!
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial