Telugu Recipes: ఇంట్లో ఇలా సోయా ఉల్లి పెసరట్టు చేస్తే నోరూరిపోవడం ఖాయం
ఎప్పుడూ దోశెలు ఒకేలా చేసుకుంటే బోరు కొడుతుంది. ఇలా ఉల్లి పెసరట్టు చేసుకుని తింటే రుచి అదిరిపోతుంది.
దోశెలు, ఇడ్లీలు, పూరీలు.. ఎప్పుడూ ఇదే టిఫిన్ బోర్ కొడుతుంది. ఒకసారి సోయా చంక్స్, ఉల్లి పాయలు, పెసర పప్పు కలిపి దోశెలు వేస్తే రుచి అదిరిపోతుంది. మార్కెట్లో సోయా చంక్స్ లభిస్తాయి. వాటిని కొని పెసరట్టులో భాగం చేసుకోవచ్చు. దీన్ని చేయడం చాలా సులువు. ఎక్కువ సమయం కూడా పట్టదు. పిల్లలకు, పెద్దలకు దీని రుచి నచ్చుతుంది.
కావాల్సిన పదార్థాలు:
పెసరపప్పు - రెండు కప్పులు
సోయా చంక్స్- ఒకటిన్నర కప్పు
ఉల్లిపాయ (పెద్దది) - ఒకటి
అల్లం - చిన్న ముక్క
జీలకర్ర - ఒకటిన్నర స్పూను
ఉప్పు - రుచికి తగినంత
మిరియాల పొడి - అర టీస్పూను
కరివేపాకు - ఒక రెమ్మ
నూనె - సరిపడినంత
తయారీ విధానం
1. నాలుగు గంటల ముందే పెసరపప్పును కడిగి నానబెట్టుకోవాలి.
2. సోయా చంక్స్‌ను కూడా అరగంట ముందే నీళ్లలో నానబెట్టాలి. ఇవి త్వరగా నానిపోతాయి. కనుక అరగంట ముందు నీళ్లలో వేసుకుంటే సరిపోతుంది.
3. పెసరపప్పు బాగా నానాక ఉల్లిపాయలు, కరివేపాకు, అల్లం ముక్కలుగా తరుగు కోవాలి.
4. మిక్సీలో పెసరపప్పు ఉల్లిపాయ తరుగు, సోయా చంక్స్, అల్లం తరుగు, కరివేపాకు, మిరియాల పొడి జీలకర్ర వేసి మెత్తగా రుబ్బుకోవాలి.
5. అవసరమైనంత నీరు కలుపుకుని దోశె వేయడానికి వీలుగా కలుపుకోవాలి. రుచి కోసం ఉప్పు వేయాలి.
5. స్టవ్ మీద పెనం పెట్టి నూనె రాయాలి. పెనం బాగా వేడెక్కాక రుబ్బును వేసుకోవాలి. దోశెలా పలుచగా వేయాలి.
6. రెండు వైపులా బాగా కాల్చుకుని కొబ్బరి చట్నీతో తింటే రుచి బావుంటుంది.
సోయా చంక్స్ లో ప్రోటీన్, ఫైబర్ అధికంగా ఉంటాయి. ఎంత తిన్నా కొలెస్ట్రాల్ చేరదు. ఒమెగా త్రీ ఫ్యాటీ ఆమ్లాలు లభిస్తాయి. యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. పెసరపప్పులో కూడా ఎన్నో మంచి గుణాలు ఉన్నాయి. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. కంటి చూపును మెరుగుపరుస్తుంది. గుండె, ఎముకల ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కనుక ఈ సోయా ఆనియన్ పెసరట్టు పెద్దలతో పాటూ పిల్లలు తిన్నా ఆరోగ్యమే. ఈ దోశెలో వాడినవన్నీ కూడా ఆరోగ్యకరమైనవే. పెసర పప్పు, సోయా చంక్స్, అల్లం, ఉల్లిపాయ, మిరియాల పొడి... ఇవన్నీ కూడా మన శరీరానికి కావాల్సిన పోషకాలను అందిస్తాయి. పెసరపప్పులో ప్రొటీన్, ఐరన్, విటమిన్ బి6, నియాసిన్, ఫోలేట్ అధికంగా ఉంటాయి. బరువు తగ్గడానికి కూడా పెసరపప్పు చాలా సహకరిస్తుంది. గ్యాస్, జీర్ణ సమస్యలు రాకుండా ఈ పప్పు అడ్డుకుంటుంది. ఈ దోశె తినడం వల్ల శరీరానికి మంచి పోషణ లభిస్తుంది.
Also read: అందంగా మెరవాలనుకుంటున్నారా? అయితే ఇలాంటి ఆహారాలను దూరం పెట్టండి
Also read: ఈ పండ్లు ఎక్కడైనా కనిపిస్తే కచ్చితంగా తినండి, గుండె జబ్బులు రాకుండా ఉంటాయి
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.