Skin Cancer : పుట్టుమచ్చలు ఎక్కువ అవుతుంటే జాగ్రత్త.. చర్మ క్యాన్సర్ హెచ్చరికలు ఇవే
Skin Cancer Warning Signs : స్కిన్ క్యాన్సర్ అంటే కేవలం ఎండకు ఎక్కువగా ఎక్స్పోజ్ అయ్యే చర్మం మీదనే కాదు.. ఈ భాగాల్లో వచ్చే మార్పులు కూడా చర్మ క్యాన్సర్కి సంకేతమేనంటున్నారు నిపుణులు.

Hidden Signs of Dangerous Skin Cancer : చాలా మంది చర్మ క్యాన్సర్‌ను కేవలం ఎండ, సన్‌బర్న్‌తో ముడిపెడతారు. పుట్టుమచ్చలలో మార్పులను గమనించమని, సూర్యరశ్మి నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవాలని చెబుతారు. కానీ చర్మ క్యాన్సర్ ముఖ్యంగా మెలనోమా.. ఎండ తగలని శరీర భాగాలలో కూడా వస్తుందని ఎక్కువమందికి తెలియదు. ఇలాంటి దాగి ఉన్న మెలనోమాలు చాలా ప్రమాదకరమైనవిగా మారుతాయి. ఎందుకంటే అవి త్వరగా గుర్తించరు కాబట్టి.. ప్రమాదం పెరుగుతుంది.
ఎలా రక్షించుకోవాలి?
చర్మ క్యాన్సర్ నుంచి రక్షించుకోవడానికి రెగ్యులర్‌గా మీ శరీరాన్ని పరీక్షించుకోవాలి. కానీ ఇబ్బంది ఏమిటంటే.. మనం తరచుగా స్కిన్ ఎక్స్పోజ్ అయ్యే భాగాలను మాత్రమే చూస్తాము. కానీ మనం పట్టించుకోని అవయవాలలో అనేక తీవ్రమైన కేసులు వస్తాయి. సూర్యరశ్మి వల్ల DNA దెబ్బతినడం, కొన్ని జన్యుపరమైన కారణాలు, బలహీనమైన రోగనిరోధక వ్యవస్థలు కలిసి చర్మ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయని అంటున్నారు.
చర్మ క్యాన్సర్ లక్షణాలు గుర్తించండిలా
చెవి వెలుపలి భాగంలో పొడి, పొలుసుల చర్మం లేదా నెమ్మదిగా పెరుగుతున్న తెల్లటి ముద్దలా మారుతుంది. ఇది నొప్పి కలిగించదు. కాబట్టి దీనిని చాలామంది నిర్లక్ష్యం చేస్తారు. సకాలంలో చికిత్స చేయకపోతే.. అది లోపలి చెవి, అక్కడ ఉన్న ఎముకలకు వ్యాప్తి చెందుతుంది. గోరు కింద వచ్చే క్యాన్సర్‌ను సబ్‌ంగువల్ మెలనోమా అంటారు. ఇది చేతులు లేదా కాళ్ళ గోళ్ల కింద నల్లటి లేదా ముదురు మచ్చలుగా కనిపిస్తుంది. పురుషులలో జననేంద్రియాల చర్మంపై కూడా అనుమానాస్పదమైన పుండ్లు చర్మ క్యాన్సర్‌కు సంకేతం కావచ్చు. కాబట్టి ఈ భాగాలను కూడా చెక్ చేసుకోవడం అవసరం.
కంటిలో వచ్చే మెలనోమా కంటిలోని తెల్లటి భాగంలో లేదా కనుపాప చుట్టూ ముదురు మచ్చలుగా కనిపిస్తుంది. అదే సమయంలో కనురెప్పలపై ఏర్పడే చిన్న, గట్టి ముద్దలు వేగంగా పెరుగుతాయి. ఇది చర్మ క్యాన్సర్ దూకుడు రూపాలలో ఒకటిగా చెప్తారు. నాలుక, నోటి లోపల కూడా క్యాన్సర్ వస్తుంది. ముఖ్యంగా ధూమపానం చేసే లేదా ఎక్కువ మద్యం సేవించే వారిలో ఈ సమస్య ఉంటుంది. ఇక్కడ ముద్దలు, నయంకాని పుండ్లు, తిమ్మిరి, తెల్లటి గట్టి మచ్చలు ప్రమాదానికి సంకేతం కావచ్చు.
ఈ భాగాలలో కూడా క్యాన్సర్ రావచ్చు
పాదాల అరికాళ్ళలో, అరచేతులలో కూడా చర్మ క్యాన్సర్ వస్తుంది. ముదురు రంగు చర్మం ఉన్నవారిలో ఇది ఎండ తగలని భాగాలలో ఎక్కువగా కనిపిస్తుంది. తలపై చర్మం, ముఖ్యంగా పలుచటి జుట్టు లేదా బట్టతల ఉన్నవారిలో కూడా క్యాన్సర్ దాగి ఉండవచ్చు. పెదవులపై వచ్చే చర్మ క్యాన్సర్ పురుషులలో ఎక్కువగా కనిపిస్తుంది. ధూమపానం, మద్యం, HPV ఇన్ఫెక్షన్‌తో ముడిపడి ఉంటుంది. అదనంగా టాటూ ఉన్న భాగాలలో పుట్టుమచ్చలు లేదా మచ్చలు దాగి ఉండవచ్చు. దీనివల్ల మార్పులను గుర్తించడం కష్టం అవుతుంది.
నిపుణులు ఏమంటున్నారంటే..
కుటుంబంలో ఎవరికైనా చర్మ క్యాన్సర్ చరిత్ర ఉంటే.. చర్మం చాలా తెల్లగా, ఎక్కువ పుట్టుమచ్చలు ఉంటే లేదా ఎక్కువ కాలం బయట ఉండవలసి వస్తే, అదనపు జాగ్రత్తలు తీసుకోవడం అవసరం అని నిపుణులు అంటున్నారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి మీ శరీరాన్ని పరీక్షించుకోండి. అద్దం సహాయం తీసుకోండి. లేదా మీ ప్రియమైన వారిని కూడా గమనించమని చెప్పండి. చర్మ క్యాన్సర్‌ను ఎంత త్వరగా గుర్తిస్తే.. చికిత్స అంత సులభంగా, ప్రభావవంతంగా ఉంటుంది.
గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు























