High Blood Pressure : 30 ఏళ్ల వయసులో అధిక రక్తపోటు.. ఇది సాధారణమా? లేదా ప్రమాదానికి సంకేతమా?
Hypertension in Your 30s : యువతలో హై బీపీ కేసులు రోజు రోజుకి పెరుగుతున్నాయి. అందుకే ఈ సైలంట్ కిల్లర్‌ను లైట్‌గా తీసుకోవద్దని చెప్తున్నారు నిపుణులు. అందుకే జాగ్రత్తగా ఉండాలంటున్నారు.

High Blood Pressure in Your 30s : అధిక రక్తపోటును సైలంట్ కిల్లర్ అంటారు. ఇది లక్షణాలు స్పష్టంగా కనిపించేవరకు ఎలాంటి ముఖ్యమైన లక్షణాలు కలిగించకుండా నెమ్మదిగా శరీరాన్ని దెబ్బతీస్తుంది. అందుకే దీనిని సైలంట్ కిల్లర్ అంటారు. వయసు పెరిగే కొద్ది వచ్చే ఈ సమస్య.. ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా వస్తుంది. మరి 30 ఏళ్ల వయసులో అధిక రక్తపోటు వస్తే అది సాధారణమా? లేదా ఏదైనా పెద్ద ప్రమాదానికి సంకేతమా? నిపుణులు ఏమంటున్నారంటే..
రక్తపోటు లేదా అధిక రక్తపోటు ఒకప్పుడు వృద్ధుల లేదా మధ్య వయస్కుల వ్యాధిగా చెప్పేవారు. ఇది 50 లేదా 60 సంవత్సరాల తర్వాత మాత్రమే వస్తుందని అనుకునేవారు. కానీ ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. ఎందుకంటే ఈ సమస్య ఇప్పుడు 20, 30 ఏళ్ల యువకులకు కూడా వస్తుంది. అత్యంత ఆందోళనకరమైన విషయం ఏమిటంటే వారిలో చాలామందికి వారికి రక్తపోటు పెరిగిందని కూడా తెలియదు. అందుకే దీనిని సైలంట్ కిల్లర్ అంటారు.
ఎలాంటి లక్షణాలు లేకుండా హై బీపీ నెమ్మదిగా శరీరాన్ని దెబ్బతీస్తుంది. దాని లక్షణాలు స్పష్టంగా కనిపించే సమయానికి.. గుండె, మూత్రపిండాలు, మెదడు, కళ్లను దెబ్బతీస్తుంది. మరి మీ 30 ఏళ్లలో అధిక రక్తపోటు సాధారణమా లేదా మరింత తీవ్రమైన అనారోగ్యానికి సంకేతమా అనే ప్రశ్నను లేవనెత్తుతుంది.
అధిక రక్తపోటు అంటే ఏమిటి?
మన ధమనులలో రక్తపోటు సాధారణం కంటే ఎక్కువగా ఉంటే దానిని అధిక రక్తపోటు అంటారు. మరి రక్తపోటు రీడింగ్‌లను రెండు సంఖ్యలలో కొలుస్తారు. గుండె రక్తాన్ని పంప్ చేసినప్పుడు సిస్టోలిక్ పీడనం, గుండె విశ్రాంతిగా ఉన్నప్పుడు డయాస్టొలిక్ పీడనం. సిస్టోలిక్ రక్తపోటు 140 mmHg లేదా అంతకంటే ఎక్కువ ఉంటే లేదా డయాస్టొలిక్ రక్తపోటు 90 mmHg లేదా అంతకంటే ఎక్కువ ఉంటే అధిక రక్తపోటుగా పరిగణిస్తారు.
30 ఏళ్ల వయసులో అధిక రక్తపోటు నార్మలేనా?
30 ఏళ్ల వయసులో అధిక రక్తపోటు వస్తే అది సాధారణం కాదని చెప్తున్నారు నిపుణులు. ఇది మీ జీవనశైలి తప్పు దిశలో వెళుతుందనడానికి సంకేతం. మీ శరీరం అంతర్గత ఒత్తిడిని ఎదుర్కొంటోందని అర్థం. ఇది భవిష్యత్తులో గుండెపోటు, స్ట్రోక్ లేదా మూత్రపిండాల సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది. అందువల్ల 30 ఏళ్ల తర్వాత ప్రతి ఒక్కరూ సంవత్సరానికి కనీసం 1-2 సార్లు వారి రక్తపోటును తనిఖీ చేసుకోవాలని సూచిస్తున్నారు.
అధిక రక్తపోటు ఇప్పటికే మీ ఫ్యామిలీలో ఉన్నవారికి ఉంటే.. వారు మరింత అప్రమత్తంగా ఉండాలి. అందుకే సకాలంలో పరీక్షలు చేయించుకోవడం వల్ల గుండెపోటు, స్ట్రోక్, మూత్రపిండాల వైఫల్యం, దృష్టి నష్టం, అకాల వృద్ధాప్యం వంటి తీవ్రమైన సమస్యలను నివారించవచ్చని చెప్తున్నారు.
అధిక రక్తపోటుకు కారణమిదే..
నేటి ఆధునిక జీవనశైలే దీనికి అతిపెద్ద కారణం. వైద్యులు, ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. యువతలో అధిక రక్తపోటు వెనుక అనేక కారణాలు ఉన్నాయి. గంటల తరబడి మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లను చూస్తూ గడపడం, రాత్రి ఆలస్యంగా మేల్కొని ఉండటం, నిద్రలేక పోవడం, శారీరక శ్రమ తగ్గడం వల్ల రక్తపోటు పెరుగుతుంది. కెరీర్ ఒత్తిడి, జాబ్ స్ట్రెస్, ఆర్థిక, రిలేషన్ సమస్యలు ఒత్తిడిని పెంచుతాయి. ఇవి రక్తపోటును పెంచే హార్మోన్లను విడుదల చేస్తాయి.
ఉప్పు, నూనె అధికంగా ఉండే ఫాస్ట్ ఫుడ్.. ప్యాక్ చేసిన స్నాక్స్, షుగర్ డ్రింక్స్ క్రమంగా రక్తపోటును పెంచుతాయి. బరువు పెరగడం వల్ల గుండె ఎక్కువ పని చేస్తుంది. ఇది అధిక రక్తపోటుకు దారితీస్తుంది. బొడ్డు కొవ్వు అధిక రక్తపోటుకు ప్రధాన సూచికగా పరిగణిస్తారు. సిగరెట్లు, పొగాకు, అధిక ఆల్కహాల్ ధమనులను గట్టిపరుస్తాయి. గుండెపై ఒత్తిడి పెంచుతుంది. ఇది చిన్న వయస్సులోనే రక్తపోటు పెరగడానికి దారితీస్తుంది. కాబట్టి వాటికి దూరంగా ఉంటూ లైఫ్‌స్టైల్ మార్పులు చేసుకోవాలంటున్నారు.
గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.






















