Contact Lens Safety Tips : కాంటాక్ట్ లెన్స్‌లు వాడుతున్నారా? అయితే జాగ్రత్త, ఈ తప్పులు అస్సలు చేయకూడదట
Lens Care Routine : కాంటాక్ట్ లెన్స్‌లు ఉపయోగించేప్పుడు కొన్ని తప్పులు అస్సలు చేయకూడదని చెప్తున్నారు నిపుణులు. అవేంటో.. లెన్సులు వాడేప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూసేద్దాం.

Precautions for Contact Lenses : కంఫర్ట్‌గా ఉంటుందని, వివిధ కారణాలతో చాలామంది లెన్స్‌లు ఉపయోగిస్తారు. ముఖ్యంగా కళ్లజోడు వాడడం ఇష్టం లేనివారు, గ్లామర్ ఇండస్ట్రీలో ఉండేవారు వీటిని ఎక్కువగా వినియోగిస్తారు. అయితే మీకు తెలుసా? లెన్స్‌లు వాడేప్పుడు సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే కంటిచూపు కోల్పోయే ప్రమాదం ఉందట. అందుకే కొన్ని తప్పులు అస్సలు చేయకూడదని చెప్తున్నారు. ఇంతకీ అవి ఏంటి? లెన్సులు వాడేప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూసేద్దాం.
లెన్స్‌లు ఏ కారణంతో వినియోగించిన సరైన పద్ధతుల్లో ఉపయోగించకపోతే కంటి ఇన్ఫెక్షన్లు వస్తాయి. కళ్లు పొడిబారడం లేదా దృష్టి కోల్పోవడం జరుగుతుంది. కాబట్టి లెన్స్ ఉపయోగించేప్పుడు కచ్చితంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చిట్కాలు తెలుసుకుందాం.
చేతులు కడుక్కోవాల్సిందే..
కాంటాక్ట్ లెన్స్‌లు పెట్టుకునేప్పుడు ముందుగా చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. చేతులు కడుక్కునేందుకు మాయిశ్చరైజర్‌ని ఇచ్చే సబ్బులు, లోషన్లు ఉపయోగించకపోవడమే మంచిది. అలాగే చేతులు శుభ్రంగా ఆరిన తర్వాత లెన్సులను పట్టుకోవాలి.
శుభ్రత
లెన్స్‌లను శుభ్రం చేసేందుకు వైద్యులు సూచించిన లెన్స్ క్లీనింగ్ సొల్యూషన్ మాత్రమే ఉపయోగించాలి. లెన్స్‌లను శుభ్రం చేయడానికి నీరు, ఉమ్మి, లేదా ఇంట్లో తయారు చేసిన ఇతర సొల్యూషన్లను ఉపయోగించకూడదు. వైద్యులు సూచించిన సొల్యూషన్‌తో రెగ్యులర్‌గా వాటిని క్లీన్ చేసుకోవాలి. అలాగే ఎయిర్ డ్రై చేయాలి.
నిద్రపోకూడదు..
లెన్స్ పెట్టుకున్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ పడుకోకూడదు. లెన్స్ పెట్టుకుని పడుకుంటే కంటి ఇన్ఫెక్షన్ల ప్రమాదం ఎక్కువ అవుతుంది. కంటికి ఆక్సిజన్ అందడం తగ్గిపోతుంది. ఎక్స్టెండ్ చేసిన లెన్స్‌లు వైద్యులు సూచిస్తే.. అప్పుడు మాత్రమే పడుకోవచ్చు. లేదంటే లెన్స్‌లు పెట్టుకుని పడుకోకూడదట.
ఆ సమయంలో వద్దు
స్విమ్మింగ్ చేసేప్పుడు, స్నానం చేసేప్పుడు లెన్స్‌ని ఉపయోగించకూడదు. లేదంటే కంటికి హానీ చేసే మైక్రోబ్స్ లోపలికి వెళ్లిపోతాయి.
ఐ మేకప్
లెన్స్ పెట్టుకోకముందు ఐ మేకప్ అప్లై చేయకూడదు. లెన్స్ పెట్టుకున్న తర్వాతే మేకప్ వేసుకోవాలి. అలాగే మేకప్ తీసేసే ముందే చేతులు శుభ్రం చేసుకుని లెన్స్‌లు తీసేయాలి.
షేర్ చేసుకోకూడదు
షేరింగ్ ఈజ్ కేరింగ్ కానీ.. కాంటాక్ట్ లెన్స్‌ని మాత్రం షేర్ చేసుకోకూడదు. ఎందుకంటే ఇవి పర్సనల్. షేర్ చేసుకోవడం వల్ల బ్యాక్టీరియా, వైరస్ ఈజీగా ట్రాన్స్ఫర్ అవుతుంది.
రిప్లెస్మెంట్
లెన్స్‌లను వైద్యులు ఎన్నిరోజులు ఉపయోగించమంటే అప్పటివరకు మాత్రమే వాటిని ఉపయోగించాలి. తర్వాత వాటిని కచ్చితంగా రిప్లేస్ చేయాలి. మీరు వాడే లెన్స్‌లు బట్టి రోజుకు లేదా వారానికి లేదా నెలకు మార్చాల్సి ఉంటుంది. ఎక్స్పైరీ తర్వాత కూడా వినియోగిస్తే కంటిచూపు దెబ్బతింటుంది.
కంటిలో దురద, పొడిబారడం, ఎర్రగా మారడం, కళ్లు కనిపించకపోవడం, నొప్పి వంటి లక్షణాలు గుర్తించినప్పుడు వెంటనే లెన్స్ తీసేసి వైద్య సహాయం తీసుకోవాలి. లెన్స్ కేస్‌ని నెల నుంచి మూడు నెలలకోసారి మార్చాలి. రెగ్యులర్‌గా చెకప్స్ చేయించుకోవాలి. దీనివల్ల కంటి ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉంటుంది.






















