Dengue Fever: బాబోయ్ వానలు - దాడికి సిద్ధమవుతోన్న డెంగ్యూ దోమలు, వెంటనే ఈ జాగ్రత్తలు పాటించండి.. లేకపోతే తెలుసుగా?
Dengue symptoms: మస్కిటో రిపల్లెంట్స్ వాడడం, దోమల పెరుగదలకు అనుకూలమైన వాతావరణం లేకుండా చూసుకోవడం, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం చాలా అవసరం.
Dengue Tips in Telugu: వర్షాలు దంచికొడుతున్నాయ్. ఇక దోమలు.. జనాలపై దాడికి సిద్ధమవుతాయి. భయానక వ్యాధులను అంటగడతాయి. వాటిలో అత్యంత ప్రమాదకరమైనది డెంగ్యూ. డెంగ్యూ సాధారణంగా 8-10 రోజుల పాటు వేధించే వ్యాధి. డెంగ్యూ దోమ కాటేస్తే.. నాలుగు రకాల వైరస్‌లు సంక్రమిస్తాయి. వాటిలో ఒకటి డెంగ్యూకు కారణమవుతుంది.
వ్యాధి లక్షణాలు
డెంగ్యూ సోకినపుడు జ్వరం అధికంగా ఉంటుంది. తలనొప్పి, ఒళ్లు నొప్పులు కూడా ఉంటాయి. వికారంగా ఉండడం, శరీరం మీద దద్దుర్లు రావడం వంటివి సాధారణ లక్షణాలుగా చెప్పవచ్చు. డెంగ్యూ తీవ్రమైనపుడు కడుపు నొప్పి, వాంతులు, చిగుళ్లు, ముక్కు నుంచి రక్తస్రావం, విపరీతమైన అలసట వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి.
దోమల వ్యాప్తి
నిలిచి ఉన్న నీరు, వెచ్చదనం దోమలు పెరిగేందుకు అనువైన వాతావరణం. ముఖ్యంగా డెంగ్యూ వ్యాపింపజేసే ఈడీస్ ఈజిప్టి దోమలు పెరిగేందుకు అలాంటి వాతావరణం చాలా సహకరిస్తుంది. అందుకే, మీరు ఏ మాత్రం నిర్లక్ష్యం వహించవద్దు. కేవలం మురికి నీళ్ల వల్లే కాదు. మీ ఇంటి బయట లేదా లోపల ఉండే ఏ వస్తువులో నీరు నిలిచి ఉన్నా.. అందులో డెంగ్యూ దోమలు ఫ్యామిలీ పెట్టేస్తాయి.
వర్షాకాలంలో వ్యాపించే డెంగ్యూ నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకునేందుకు తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవేమిటో తెలుసుకుందాం.
నిలవ నీరు ఉండకూడదు
పూలకుండీలు, కూలర్లు, ఏవైన ఆరుబయట వదిలి మరచిపోయిన చిన్నచిన్న పాత్రలు, పాత టైర్లు వంటి వాటిలో నీరు నిలిచి ఉండకుండా చూసుకోవాలి.
మంచినీళ్లు నిల్వ ఉండే ప్రదేశాలు
⦿ ఓవర్ హెడ్ ట్యాంక్స్ , సంప్‌లు వంటి మంచి నీటిని నిలువ చేసుకునే ట్యాంకులను, కంటైనర్లను తరచుగా శుభ్రం చేసుకోవాలి. వాటి మీద తప్పకుండా మూత ఉండేలా జాగ్రత్త పడాలి.
⦿ పరిసరాలను జాగ్రత్తగా గమనించాలి. ఎక్కడా నీరు నిలవకుండా చూసుకోవాలి.
⦿ మస్కిటో రిపల్లెంట్స్ ఉపయోగించాలి. ధరించే దుస్తుల మీద ఉపయోగించేవి, చర్మం మీద ఉపయోగించే మస్కిటో రిపల్లెంట్లు వాడడం వల్ల దోమలు కుట్ట కుండా నివారించుకోవచ్చు.
⦿ DEET, పికారిడిన్ లేదా నిమ్మ, యూకలిప్టస్ నూనె కలిగిన మస్కిటో రిపల్లెంట్లను వాడడం మంచిది.
⦿ చేతులు, కాళ్లు కప్పి ఉండేలా దుస్తులు ధరించాలి. కాళ్లకు సాక్సులు, బూట్లు కూడా ధరించాలి. దోమలు ఎక్కువగా ఉండే సాయం సమయాల్లో తప్పక ఈ జాగ్రత్తలు తీసుకోవాలి.
⦿ వీలైతే దోమతెరల్లో నిద్రించడం మంచిది. ఇంట్లోకి దోమలు చేరకుండా కిటికీలు, తలుపులకు స్క్రీన్లను అమర్చుకోవాలి.
⦿ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. చెత్తను నిలువ చెయ్యకుండా ఎప్పటికప్పుడు తీసెయ్యాలి. ఇంటి పరిసరాల్లో చెత్త చేరకుండా జాగ్రత్త పడాలి. చెత్త కలిగిన పరిసరాల్లో కూడా దోమలు వృద్ధి చెందవచ్చు.
⦿ తీవ్రమైన జ్వరం, తలనొప్పి, కళ్ల వెనుకగా నొప్పి, కీళ్లు, కండారాల్లో నొప్పి, దద్దర్లు ఉంటే అది డెంగ్యూ కావచ్చు. ఈ లక్షణాలు కనిపిస్తే డాక్టర్ సలహా తీసుకోవడం అవసరమని గుర్తించండి.
Also Read : Sadhguru Health Tips: కఫం వేధిస్తోందా? సద్గురు సూచనలు పాటించి చూడండి - ఇలా చేస్తే వెంటనే ఉపశమనం
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.