Sadhguru Health Tips: కఫం వేధిస్తోందా? సద్గురు సూచనలు పాటించి చూడండి - ఇలా చేస్తే వెంటనే ఉపశమనం
శరీరంలో శ్లేష్మం ఎక్కువగా చేరినపుడు దగ్గు, ఆయాసం వంటి ఇబ్బందులు ఏర్పడుతాయి. ఈ శ్లేష్మాన్ని తొలగించుకునేందుకు సద్గురు సూచించిన ఇంటి చిట్కాలు నిజంగా పనిచేస్తాయా? నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం.
కఫం అంటే శ్లేష్మం, నీరు, మృత కణాలతో కూడిన శ్వాస వ్యవస్థలోని శ్లేష్మ పొర ద్వారా ఉత్పత్తి అయిన మందపాటి పదార్థం గా చెప్పవచ్చు. ఇది శరీరంలోకి ప్రవేశించిన వ్యాధి కారకాలను శరీరానికి హాని చెయ్యకుండా శ్వాస కోశాల్లోకి చేరకుండా ఆపేందుకు ఉపయోగపడుతుంది. ఇన్ఫెక్షన్లు, అలెర్టీల వల్ల దీని ఉత్పత్తి పెరుగుతుంది. ఫలితంగా దగ్గు, శ్వాసలో ఇబ్బంది, ముక్కు దిబ్బడ వంటి సమస్యలు వస్తాయి.
వాతావరణ పరిస్థితుల్లో మార్పుల వల్ల నిరోధక వ్యవస్థ బలహీన పడడం వల్ల జలుబు, దగ్గు, జ్వరం, కఫం ఏర్పడడం వంటి ఇబ్బందులు తలెత్తుతాయి. సమస్య చాలా తీవ్రంగా ఉంటే తప్ప డాక్టర్ సలహా అవసరం లేదు. ఇంట్లో చేసుకునే కొన్ని చిన్నచిన్న చిట్కాలతో ఈ అసౌకర్యాలను తగ్గించుకోవచ్చు. సద్గురు జగ్గీవాసుదేవ్ ఈ కఫ సమప్యల నుంచి బయట పడేందుకు కొన్ని మార్గాలను సూచిస్తున్నారు. అ వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
సద్గురు తన ఇస్ స్టాగ్రామ్ ద్వారా ఈ వివరాలను తన ఫాలోవర్స్ తో పంచుకున్నారు.
- దగ్గు, కఫం చేరినట్టు అనిపించగానే ముందుగా పాలు, పాల ఉత్పత్తులను మానెయ్యాలి. 10-12 నల్ల మిరియాలు తీసుకుని వాటిని దంచుకోవాలి. మెత్తని పొడి చెయ్యకూడదు. బరకగా దంచుకోవాలి. వీటిని రాత్రంతా తేనెలో నానబెట్టాలి. ఇలా నానబెట్టిన తేనెమిరియాల మిశ్రమాన్ని 8-12 గంటల తర్వాత నమిలి మింగాలి. ఇది కఫాన్ని తొలగిస్తుంది.
- ప్రాణాయామ సాధన వల్ల సహజంగానే కఫం తొలగిపోతుంది. ముఖ్యంగా కపాలభాతి క్రమం తప్పకుండా చెయ్యడం వల్ల శరీరంలో వేడి జనించి కఫం పూర్తిగా కరిగి పోతుందని సద్గురు చెప్పారు.
- అస్తమా, సైనసైటిస్ వంటి సమస్యలతో బాధ పడేవారు పసుపును మిరియాలతో కలిపి తీసుకోవడం వల్ల కఫం తగ్గుతుంది. పసుపు, వేప, కర్పూరవల్లి వంటి రకరకాల కాంబినేషన్లకు పసుపును బేస్ గా ఉపయోగించి తయారు చేసుకొని తీసుకోవచ్చు.
ఈ చిట్కాలు పనిచేస్తాయా?
కఫం చేరినట్టు అనిపించినపుడు పాల ఉత్పత్తులు తీసుకుంటే కొంత మందిలో శ్లేష్మ ఉత్పత్తి మరింత పెరుగుతుంది. దీని వల్ల శ్వాసలో ఇబ్బంది, గొంతులో అసౌకర్యం కలిగించవచ్చు. అందుకే పాలు, పాల సంబంధిత ఉత్పత్తులను తీసుకోవద్దు. అవి మానేస్తే త్వరగా లక్షణాలు ఉపశమించే అవకాశం దొరుకుతుంది.
నల్ల మిరియాల్లో ఎక్స్ పెక్టరెంట్ లక్షణాలను కలిగి ఉంటాయి. కనుక కఫాన్ని తగ్గించడంలో మంచి పాత్ర పోషిస్తాయి. మిరియాల్లెపి పెపరీన్ వంటి సమ్మేళనాలు పలుచని శ్లేష్మాన్ని కూడా శ్వాస వ్యవస్థ నుంచి తొలగించగలుగుతాయి.
యోగాలో భాగమైన ప్రాణాయామం ద్వారా శ్వాసను మన అదుపులో ఉంచుకునే అభ్యాసం వల్ల ఊపిరితిత్తుల సామర్థ్యం మెరుగవుతుంది. శ్వాసవ్యవస్థలోని కండరాలు కూడా బలం పుంజుకుంటాయి. ఆక్సిజన్ ఇన్ టేక్ పెరుగుతుంది. ఫలితంగా కఫం క్లియర్ అవుతుందని డాక్టర్లు కూడా అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా కపాలభాతి, భస్త్రిక వంటి ప్రాణాయామ పద్ధతుల్లో లోతుగా జరిగే ఉచ్ఛ్వాస నిశ్వాసల వల్ల అదనపు శ్లేష్మాన్ని తొలగించడంలో సహాయపడతాయి. మొత్తం శ్వసకోశ ఆరోగ్యానికి ప్రాణాయామం ఎంతో ఉపయోగకరం.
పసుపులో ఉండే క్రీయాశీలక సమ్మేళనం కర్క్యూమిన్ వల్ల యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్ లక్షణాలు కలిగి ఉంటుంది. శ్లేష్మ ఉత్పత్తిని, దగ్గును తగ్గించడానికి పసుపు దోహదం చేస్తుంది.
Also Read : వామ్మో, వానాకాలం - ఆహారం విషయంలో జాగ్రత్త, ఈ నియమాలు పాటిస్తేనే మీరు సేఫ్
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.