Telugu Recipe: పాలకూర కిచిడీ - పోషకాల లంచ్ బాక్స్ రెసిపీ
పాలకూరతో చేసే కిచిడీ పెడితే పిల్లలకు అన్ని రకాల పోషకాలు అందుతాయి.
పాలకూర తినే పిల్లలు చాలా తక్కువ. ఎందుకో ఆకుకూరలంటేనే వారు ఇష్టపడరు. కానీ పాలకూర కచ్చితంగా తినమని పోషకాహార నిపుణులు సిఫారసు చేస్తారు. వారితో పాలకూర సులువుగా తినిపించాలంటే ఇలా కిచిడీలా చేసి పెట్టండి.
కావాల్సిన పదార్థాలు
బియ్యం - అర కప్పు
పాలకూర - రెండు కట్టలు
పెసర పప్పు - పావు కప్పు
పచ్చిమిర్చి - రెండు
అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక స్పూను
ఉల్లిపాయ - ఒకటి
గరం మసాలా - అర స్పూను
మిరియాల పొడి - పావు స్పూను
జీలకర్ర - ఒక స్పూను
ఉప్పు - రుచికి సరిపడా
కారం - అర స్పూను
పసుపు - చిటికెడు
నూనె లేదా నెయ్యి - రెండు స్పూన్లు
తయారీ ఇలా
1. పాలకూరను తరిగి నీటిలో శుభ్రంగా కడగాలి. కళాయి స్టవ్ మీద పెట్టి పాలకూర తరుగు, చిటికెడు పసుపు వేసి వేయించాలి.
2. పాలకూర నీరంతా దిగి కూరంతా ముద్దగా ఒక దగ్గరికి వస్తుంది. అప్పుడు స్టవ్ కట్టేయాలి. పాలకూర వేయించడం కిచిడీ పచ్చి వాసన రాకుండా ఉంటుంది.
3. ఇప్పుడు పాలకూరను మిక్సీలో మెత్తగా రుబ్బుకోవాలి.
4. ముందే బియ్యం, పెసరపప్పు రెండింటినీ ఓ పావుగంటసేపు నానబెట్టాలి.
5. స్టవ్ మీద కుక్కర్ పెట్టి రెండు స్పూన్ల నెయ్యి లేదా నూనె వేసుకోవాలి. వేడెక్కాక అందులో జీలకర్ర, మిరియాల పొడి వేయాలి.
6. నిలువుగా తరుక్కున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి వేయించాలి.
7. అవి వేగాక అల్లం వెల్లుల్లి పేస్టు, కారం, పసుపు, గరం మసాలా వేసి వేయించాలి.
8. అన్నీ వేగాక పాలకూర పేస్టు కూడా వేసి వేయించాలి.
9. అన్నీ బాగా వేగాక బియ్యం, పెసరపప్పు, ఉప్పు వేసి కలుపుకోవాలి.
10. అన్నం ఉడకడానికి సరిపడా నీళ్లు పోసుకుని కుక్కర్ మూత పెట్టు కోవాలి.
11. మూడు విజిల్స్ వరకు ఉంచి స్టవ్ కట్టేయాలి.
12. మూత తీశాక గరిటెతో బాగా కలపాలి. పాలకూర కిచిడీ రెడీ అయినట్టే.
పాలకూరలో ఎన్నో పోషకాలు ఉంటాయి. కచ్చితంగా పిల్లల చేత తినిపించాలి. పాలకూరలో విటమిన్ ఎ, సిలు పుష్కలంగా ఉంటాయి. అలాగే ఇందులో పొటాషియం అధికంగా ఉంటుంది. కాబట్టి అధిక రక్తపోటు వచ్చే అవకాశం తగ్గుతుంది. హైబీపీ ఉన్న వాళ్లు పాలకూర తింటే రక్తపోటు పెరగకుండా అదుపులో ఉంటుంది. చర్మ క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా తగ్గుతుంది. కంటి ఆరోగ్యానికి పాలకూరలోని పోషకాలు చాలా అవసరం. ఇందులో లుటీన్,జియాంతిన్ అనే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి కంటి శుక్లాలు రాకుండా అడ్డుకుంటాయి. ఇందులో ఉండే విటమిన్ ఎ కూడా కంటి చూపును మెరుగుపరుస్తుంది. అధిక బరువు తగ్గడంలో ఇది సహాయపడుతుంది. ఆకలిని నియంత్రిస్తుంది. జీర్ణ సమస్యలు తగ్గుతాయి. పాలకూర తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. హార్ట ఎటాక్ వచ్చే అవకాశం తగ్గుతుంది. ఇందులో ఉండే విటమిన్ కె నాడీ మండల వ్యవస్థపై ప్రభావం చూపిస్తుంది. మెదడు చురుగ్గా పనిచేస్తుంది. కాబట్టి చదువుకునే పిల్లలకు దీన్ని తినిపించడం చాలా మేలు.
Also read: మనిషికి మాత్రమే గుండె పోటు ఎందుకు వస్తుంది? మిగతా జీవులకు ఎందుకు రాదు?