Quinoa Upma: త్వరగా బరువు తగ్గాలనుకుంటే క్వినోవా ఉప్మా తినండి, రెసిపీ ఇదిగో
క్వినోవాతో చేసే వంటకాలతో బరువు త్వరగా తగ్గొచ్చు.
క్వినోవా సూపర్ ఫుడ్ అని చెప్పుకోవచ్చు. తెల్ల అన్నానికి బదులు క్వినోవా తింటే అధిక బరువు త్వరగా తగ్గచ్చు. క్వినోవాలో ప్రొటీన్, ఫైబర్, ఖనిజాలు, విటమిన్లు అధికంగా ఉంటాయి. క్వినోవా గ్లూటెన్ ఫ్రీ. అంటే గ్లూటెన్ కాస్త కూడా ఉండదు. కాబట్టి ఎవరైనా తినవచ్చు. అయిదు వేల ఏళ్లుగా దీన్ని భూమిపై పండిస్తున్నారు, తింటున్నారు. దక్షిణ అమెరికా, బొలీవియా, ఈక్వెడార్, చిలీ, పెరూలలో అధికంగా పండిస్తారు. కొన్నేళ్లుగా మనదేశంలో క్వినోవా పంటను పండించడం మొదలుపెట్టారు. క్వినోవా వాడకం పెరుగుతుండడం వల్ల ధర కూడా పెరుగుతూ వస్తోంది.
కావాల్సిన పదార్థాలు
క్వినోవా - ఒక కప్పు
నూనె - రెండు స్పూన్లు
ఎండు మిర్చి - ఒకటి
కరివేపాకులు - రెండు రెమ్మలు
జీలకర్ర - అర స్పూను
పెసర పప్పు - ఒక స్పూను
పచ్చి బఠానీలు - పావు కప్పు
నీళ్లు - రెండు కప్పులు
బీన్స్ - పావు కప్పు
ఉల్లిపాయ - ఒకటి
అల్లం తరుగు - ఒక స్పూను
ఆవాలు - ఒక స్పూను
మినపప్పు - ఒక స్పూను
క్యారెట్ - ఒకటి
క్యాప్సికమ్ - ఒకటి
ఉప్పు - రుచికి సరిపడా
తయారీ ఇలా
1. క్వినోవాను బాగా శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి.
2. కళాయిలో నూనె వేయాలి, వేడెక్కాక జీలకర్ర, ఆవాలు వేసి వేయించాలి.
3. అవి చిటపడలాడాక పెసరపప్పు, మినపప్పు, అల్లం తరుగు, ఎండు మిర్చి వేసి వేయించాలి.
4. ఉల్లిపాయలను సన్నగా తరిగి వాటిని కూడా నూనె వేసి వేయించాలి.
5. కరివేపాకులు కూడా వేయించాలి. తరువాత అందులో క్యారెట్, బఠానీలు, క్సాప్సికమ్, పచ్చి బఠానీలు వేసి వేయించాలి.
6. రుచికి సరిపడా ఉప్పు వేయాలి. అన్నీ బాగా వేగాక ఇప్పుడు క్వినోవా వేయాలి.
7. అందులో రెండు గ్లాసుల నీళ్లు పోసి మూత పెట్టాలి. చిన్న మంట మీద ఉంచాలి.
8. నీళ్లన్నీ ఆవిరైపోయాక పొడి పొడిగా అవుతుంది. క్వినోవా బాగా ఉడికి ఉప్మా రెడీ అయినట్టే.
ముసలివారికి, దంతాలు లేని వారికి ఇలాంటి వంటకం బాగా నచ్చుతుంది. సులువుగా తినవచ్చు. గర్భవతులకు క్వినోవా ఎంతో మేలు చేస్తుంది. దీన్ని వండేటప్పుడు కాస్త కొబ్బరిపాలు వేసి అన్నంలో వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. క్వినోవాలో ఫోలిక్ యాసిడ్ అధికంగా ఉంటుంది. అందుకే బాలింతలు, గర్భవతులను తినమని చెబుతున్నారు వైద్యులు. గర్భవతులు రెండు పూట్ల క్వినోవా రైస్ తింటే ఆమెకు కావాల్సినంత ఫోలిక్ ఆమ్లం లభిస్తుంది. సప్లిమెంట్లు వేసుకునే అవసరం ఉండదు. వీటిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. పేగులు శుభ్రపడతాయి. మలబద్ధకం రాదు. రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా చూస్తుంది. వీటిని పొట్ట నిండా తిన్నా ఎలాంటి సమస్యా ఉండదు, బరువు పెరగరు.
Also read: గుండె ఆరోగ్యాన్ని కాపాడే కొరియన్ సూపర్ ఫుడ్ ‘కిమ్చి’- దీని ఇంట్లోనే తయారు చేయొచ్చు
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.