Prawns Recipe: గోంగూర రొయ్యల ఇగురు - వేడి వేడి అన్నంతో అదిరిపోతుంది
గోంగూర రొయ్యల కూరను ఎలా వండాలో చాలా మందికి తెలియదు. అలాంటివారి కోసమే ఈ రెసిపీ.
రొయ్యల బిర్యానీ, రొయ్యల వేపుడు, రొయ్యల ఇగురు... ఎప్పుడు రొయ్యలతో ఇవే వంటలైతే బోరు కొట్టేస్తుంది. ఓసారి గోంగూర రొయ్యల కూర చేసుకుని తినండి. చాలా టేస్టీగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో కలుపుకుని తింటే రుచి అదిరిపోతుంది. చపాతీలతో కూడా ఈ రొయ్యల కూర బావుంటుంది.
కావాల్సిన పదార్థాలు
రొయ్యలు - అరకేజీ
గోంగూర - ఒక కట్ట
ఉల్లిపాయ - ఒకటి
అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక స్పూను
పచ్చిమిర్చి - అయిదు
ధనియాల పొడి - ఒక టీస్పూను
పసుపు - పావు స్పూను
గరం మసాలా - అర టీస్పూను
జీలకర్ర పొడి - అర స్పూను
ఉప్పు - రుచికి సరిపడా
నూనె - తగినంత
తయారీ ఇలా
1. రొయ్యలు శుభ్రంగా కడిగి పక్కన కాస్త ఉప్పు, పసుపు వేసి బాగా కలిపి ఒక పావుగంట పక్కన పెట్టండి.
2. స్టవ్ మీద కళాయి పెట్టి అర స్పూను నూనె వేయాలి. నూనె వేడెక్కాక గోంగూర ఆకులు, పచ్చి మిర్చి వేసి వేయించాలి. వాటిని మిక్సీలో మెత్తగా రుబ్బుకోవాలి.
3. ఇప్పుడు మరో కళాయిలో నూనె వేయాలి. అందులో ఉల్లిపాయలు సరిగా తరిగి వేయించాలి.
4. ఉల్లిపాయలు వేగాక అల్లం వెల్లుల్లి పేస్టే వేసి వేయించాలి.
5. అన్నీ వేగాక పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి కలపాలి.
6. ఆ మిశ్రమంలో రొయ్యలు, ఉప్పు వేసి కలపాలి.
7. అయిదు నిమిషాలు ఉడికాక, ముందుగా చేసుకున్న గోంగూర పేస్టును వేసి కలపాలి.
8. ఒక గ్లాసు నీళ్లు వేసి మూత పెట్టి చిన్న మంట మీద ఉడికించాలి.
9. అరగంట పాటూ ఉడికించాక చిక్కని గ్రేవీలా అయ్యాక స్టవ్ కట్టేయాలి.
గోంగూర తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలున్నాయి.దీనిలో పొటాషియం, ఐరన్ అధికంగా ఉంటాయి. రక్త హీనత ఉన్న వారు గోంగూర తినడం వల్ల ఆ సమస్య నుంచి బయటపడవచ్చు. రక్తపోటు కూడా అదుపులో ఉంటుంది. మధుమేహంతో బాధపడేవారు గోంగూర తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. అందుకే మధుమేహం ఉన్న వారు రెండు రోజులకోసారి గోంగూరను తినాలి. దీనిలో విటమిన్ ఎ అధికంగా ఉంటుంది. ఇది కంటి చూపును మెరుగుపరుస్తుంది. దంత సమస్యలు కూడా దూరంగా ఉంటాయి. రేచీకటి ఉన్న వారు గోంగూరను తినడం చాలా అవసరం.
ఈ రెసిపీలో వాడిన రొయ్యలు కూడా అనేక పోషకాలను కలిగి ఉంటాయి. వీటిలో ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు అధికంగా ఉంటాయి. అది గుండె రక్త నాళాల్లో పూడికలు పడకుండా చూస్తాయి. రొయ్యలు తినడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు రాకుండా ఉంటాయి. ఇవి ఎముకలకు బలాన్ని ఇస్తాయి. అలాగే క్యాన్సర్ కణాలు శరీరంలో పెరగకుండా కాపాడతాయి. రొయ్యలు పెంచడంలో ఎలాంటి పురుగుల మందులు వాడరు కాబట్టి వీటిని తినడం మంచిదే. ముఖ్యంగా రొయ్యలు తింటే బరువు పెరగరు. వారంలో రెండు మూడు సార్లు తినవచ్చు. దీనిలో కొవ్వులు ఉండదు కాబట్టి, అధిక బరువు తగ్గాలనుకునే వారు రొయ్యలను తమ ఆహారంలో భాగం చేసుకోవచ్చు.
Also read: మనదేశంలో ప్రతి నలుగురిలో ముగ్గురికి విటమిన్ డి లోపం - చెబుతున్న టాటా ల్యాబ్స్ సర్వే