Ravva Idly Recipe : టేస్టీ రవ్వ ఇడ్లీలు.. వీటి తయారీకి మినపప్పు అవసరమే లేదు
South Indian Breakfast : మీ పిల్లలు ఇడ్లీలు తినట్లేదా? రోజూ ఇడ్లీలే అంటున్నారా? అయితే మీరు వారికి రవ్వ ఇడ్లీ చేసి పెట్టండి. ఇవి మంచి టేస్ట్‌ని అందించడంతో పాటు.. ఆరోగ్యానికి హెల్ప్ చేస్తాయి.
Healthy and Tasty Breakfast Recipe : ఇడ్లీలకోసం మినపప్పు నానబెట్టాలి. వాటిని రుబ్బాలి.. పిండి కలపాలి ఇలాంటి ప్రాసెస్ చాలా పెద్దగా ఉంటుంది. అయితే మీరు ఇంత కష్టపడకుండా.. సింపుల్‌గా ఇడ్లీలు చేసుకోవచ్చు. అదేలా అనుకుంటున్నారా? మీ ఇంట్లో రవ్వ, పెరుగు ఉంటే చాలు. వాటితో మీరు కమ్మగా రవ్వ ఇడ్లీలు చేసుకోవచ్చు. ఈ కేవలం మంచి రుచిని మాత్రమే అందిస్తాయనుకుంటే పొరపాటే. ఎఁదుకంటే ఇవి మీ ఆరోగ్యానికి కూడా చాలా మంచివి. మరి ఈ టేస్టీ, హెల్తీ రెసిపీని ఏ విధంగా తయారు చేయాలో.. కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు
రవ్వ - 1 కప్పు
పెరుగు - 1 కప్పు
నీళ్లు - అవసరానికి తగినంత
బేకింగ్ సోడా - అర టీస్పూన్
నెయ్యి - 2 టేబుల్ స్పూన్లు
జీడిపప్పులు - 10
ఆవాలు - అర టీస్పూన్
శనగపప్పు - 1 టీస్పూన్
జీలకర్ర - అర టీస్పూన్
కరివేపాకు - 1 రెబ్బ
ఇంగువ - చిటికెడు
అల్లం - అంగుళం
పచ్చిమిర్చి - 2
క్యారెట్లు - 2
కొత్తిమీర - 1 కట్ట
ఉప్పు - రుచికి తగినంత
తయారీ విధానం
ముందుగా అల్లం, క్యారెట్, కరివేపాకు, కొత్తిమీరను చిన్నగా తురుముకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టౌవ్ వెలిగించి దానిపై పాన్ ఉంచండి. దానిలో నెయ్యి వేసి అది వేడి అయ్యాక దానిలో జీడిపప్పులు వేసి రోస్ట్ చేయండి. అవి మంచి గోల్డెన్ కలర్లో వేగిన తర్వాత వాటిని పాన్ నుంచి బయటకు తీసి పక్కన పెట్టండి. ఇప్పుడు అదే పాన్‌లో ఆవాలు వేయండి. అవి వేగిన తర్వాత శనగపప్పు వేసి వేయించండి. మంట తక్కువ ఉండేలా చూసుకోండి. పోపు మాడిపోకుండా తిప్పుతూ ఉండండి. శనగపప్పు వేగిన తర్వాత దానిలో జీలకర్ర, కరివేపాకు, ఇంగువ వేసి వేయించాలి. అల్లం, పచ్చిమిర్చి ముక్కలు వేసి ఫ్రై చేయండి.
అల్లం, పచ్చిమిర్చి ముక్కలు వేగిన తర్వాత రవ్వను దీనిలో వేసుకోవాలి. నెయ్యి, పోపు రవ్వలో బాగా కలిసేలా తిప్పాలి. రవ్వను వేయించుకునేప్పుడు మంటను కచ్చితంగా తక్కువగా ఉంచుకోవాలి. లేదంటే రవ్వ మాడిపోతుంది. రవ్వ వేగి కాస్త రంగు మారుతుంది. రవ్వ వేగిన తర్వాత స్టౌవ్ ఆపేసి.. మరోసారి కలిపి రవ్వను అలా ఉండనివ్వండి. ఇప్పుడు దానిలో క్యారెట్, కొత్తిమీర, ఉప్పు వేసి బాగా కలపండి. ఇప్పుడు దానిలో పెరుగు వేసి బాగా కలపండి. కచ్చితంగా కాస్త నీరు అవసరం అవుతుంది కాబట్టి.. తక్కువగా వేసుకుంటూ.. ఇడ్లీ పిండి మాదిరిగా పిండి సిద్ధమయ్యే వరకు నీరు పోస్తూ కలపండి. పిండిని బాగా కలిపి 20 నిమిషాలు మూత పెట్టి పక్కన ఉంచండి.
20 నిమిషాల తర్వాత ఇడ్లీ అంచులపై నూనె లేదా నెయ్యిని రాసి.. జీడిపప్పును ప్లేట్లలో ఉంచండి. ముందుగా రెడీ చేసుకున్న బ్యాటర్లో బేకింగ్ సోడా వేసి బాగా కలిపి.. ఇప్పుడు ఈ పిండిని పాత్రలపై ఇడ్లీలుగా వేసుకోండి. ఇడ్లీ కుక్కర్లో నీరు వేసి.. ఇడ్లీ గిన్నెలను దానిపై ఉంచి మూత పెట్టి స్టౌవ్‌ను వెలిగించండి. అవి ఉడికిన తర్వాత స్టౌవ్ ఆపేసి ఇడ్లీలను గిన్నెల్లోకి తీసుకోండి. అంతే వేడి వేడి రవ్వ ఇడ్లీ రెడీ. ఇది టేస్ట్‌లో కూడా అద్భుతంగా ఉంటుంది. దీనిని మీరు నచ్చిన చట్నీతో హాయిగా లాగించేయవచ్చు. ఈ ఇడ్లీల తయారీలో మీరు ఇతర కూరగాయలు కూడా వినియోగించుకోవచ్చు. ఇవి మీకు మరింత ఆరోగ్యాన్ని అందిస్తాయి.
Also Read : క్రిస్పీ మైసూర్ బొండాలు రెసిపీ.. నూనె ఎక్కువ పీల్చుకోకుండా ఈ టిప్ ఫాలో అయిపోండి