Rasam Powder: చారు పొడి కొనుక్కుంటున్నారా? ఇలా సులువుగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు
రసం పొడి కొనుక్కునేవారే ఎక్కువ. ఇంట్లో మీరే శుచిగా చేసుకోవచ్చు.
పట్టణాల్లో రసం అంటారు, గ్రామాల్లో చారు అంటారు. ఏదైనా ఒక్కటే. రసం పొడిని వేయండి ఇప్పుడు అలవాటుగా మారింది. మంచి రుచి వస్తుండడంతో చాలా మంది రసం పొడి వాడేందుకు ఇష్టపడుతున్నారు. దాని ధర కూడా తక్కువేమీ లేదు. నిజానికి చారు పొడి తయారు చేయడం చాలా సులువు. అయిదు నిమిషాల్లో రెడీ అయిపోతుంది. ఒక్కసారి చేసుకుంటే ఆరునెలల తాజాగా నిల్వ ఉంటుంది. అందులోనూ ఇంట్లో మీరే స్వయంగా తయారు చేసుకుంటారు కాబట్టి శుచిగా, శుభ్రంగా వస్తుంది. రోజూ చారు చేసుకునే వాళ్లకి ఈ పొడి బాగా ఉపయోగపడుతుంది.
కావాల్సిన పదార్థాలు
ధనియాలు - ఒక కప్పు
జీలకర్ర - ఒక స్పూను
వెల్లుల్లి రెబ్బలు - పది
కరివేపాకులు - గుప్పెడు
మిరియాలు - ఒక స్పూను
ఎండుమిరపకాయలు - ఎనిమిది
మినపప్పు - ఒక స్పూను
ఇంగువ - పావు స్పూను
తయారీ ఇలా...
1. కళాయిలో నూనె ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి, మిరియాలు, మినపప్పు వేసి వేయించాలి. వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి.
2. కళాయిలో కాస్త నూనె వేసి ఎండు మిరపకాయలు వేయించాలి.
3. ఇప్పుడు మిక్సీ జార్లో అన్నింటినీ వేయాలి. చివర్లో ఇంగువ పొడి కూడా కలపాలి.
4. అన్నీ కలిపి మిక్సీలో పొడిగా చేస్తే చారు పొడి రెడీ అయినట్టే.
5. మిక్సీ జార్ మూత తీయగానే పొడి ఘుమఘుమ లాడిపోతుంది.
6. ఈ పొడితో చారు చేశాక పైన కొత్తిమీర చల్లితే ఆరోజు చారు అదిరికపోవడం ఖాయం.
చారు లేదా రసం అవసరమా?
చాలా మంది మెట్రో నగరాల్లో చారును తినడం తగ్గించేశారు. నిజానికి జీర్ణ వ్యవస్థ ఆరోగ్యానికి ఇది చాలా మేలు చేస్తుంది. ఆహారాన్ని సులువుగా జీర్ణమయ్యేలా చేస్తుంది. చారులో ప్రధానంగా చింతపండును ఉపయోగిస్తారు. గ్యాస్ తగ్గించడానికి, మలబద్దకం వంటి సమస్యలు రాకుండా అడ్డుకుంటుంది చారులోని పోషకాలు. చారులో హైడ్రాక్సి సిట్రిక్ యాసిడ్ అధికంగా ఉండడం వల్ల కొవ్వు ఉత్పత్తి తగ్గుతుంది. చారన్నం తినడం వల్ల బరువు కూడా తగ్గుతారు. దీనిలో ఫైబర్ అధికంగా ఉంటుంది కాబట్టి అజీర్ణం అనే సమస్య రాదు. డయేరియా రాకుండా అడ్డుకుంటుంది. చింతపండు చారును రోజూ తినడం వల్ల పొట్ట క్యాన్సర్, పెద్ద పేగు క్యాన్సర్ వంటివి రాకుండా అడ్డుకుంటుంది.
Also read: ముఖంపై కనిపించే ఈ లక్షణం ఉదర క్యాన్సర్‌కు సంకేతం కావచ్చు
Also read: Viral: ‘అందరికీ వాన పడుతోంది, మాకే లేదు’ అంటూ కోపంతో అతనిపైనే కేసు పెట్టిన రైతు, వైరల్ అయిన ఫిర్యాదు