Protein Laddu: పిల్లలకు రోజూ ఒక ప్రొటీన్ లడ్డూ, ఎలా చేయాలంటే
శక్తివంతమైన శరీరానికి ప్రొటీన్లు చాలా అవసరం. ప్రొటీన్ లడ్డూను పిల్లలు, పెద్దలు ఎవరు తిన్నా పోషకాహార లోపం తలెత్తదు.
శరీరానికి అవసరమైన పోషకాలలో ప్రోటీన్లు చాలా ముఖ్యమైనవి. పిల్లలకు రోజూ ప్రొటీన్లు పెట్టాల్సిన అవసరం ఉంది. ప్రొటీన్లు కోసమే రోజుకో గుడ్డు తినిపించమని చెబుతారు వైద్యులు. కొందరు పిల్లలు గుడ్డు రోజూ తినేందుకు ఇష్టపడరు. ఇక శాకాహారుల విషయానికి వస్తే వారికి గుడ్డు వాసనే పడదు. అలాంటి వారి కోసమే ప్రొటీన్ లడ్డూ. ఇది పూర్తిగా మొక్కల ఆధారిత ఉత్పత్తులతోనే తయారు చేస్తాం. రోజుకో లడ్డూ పిల్లలకు పెడితే చాలు వారిలో ప్రొటీన్ లోపం తలెత్తే అవకాశం ఉండదు. ఈ ప్రొటీన్ లడ్డూను బాదం, పిస్తా, నువ్వులు, వేరు శెగన వంటి సీడ్స్ తయారుచేస్తాం కనుక బోలెడంత బలం. ఇంకా ఎన్న అదనప్పు ప్రయోజనాలు.
కావాల్సిన పదార్థాలు
వేరు శెనగ పలుకులు - వంద గ్రాములు
నువ్వులు - వంద గ్రాములు
బాదం పలుకుల తరుగు - మూడు స్పూన్లు
పిస్తా తరుగు - రెండు స్పూన్లు
ఎండు కొబ్బరి - వంద గ్రాములు
సన్ ఫ్లవర్ సీడ్స్ తరుగు - రెండు స్పూనులు
గుమ్మడి గింజల తరుగు -రెండు స్పూనులు
ఖర్జూర తరుగు - 50 గ్రాములు
బెల్లం - 200 గ్రాములు
అంజీర్లు - మూడు (తరిగేయాలి)
నీళ్లు - సరిపడినన్ని
తయారీ ఇలా
1. వేరు శెగన పలుకులు, నువ్వులు, బాదం పలుకులు, పిస్తాలు, పొద్దు తిరుగడు గింజలు, గుమ్మడి గింజలు అన్నీ ముందుగానే తరిగేసి సిద్ధంగా ఉంచుకోవాలి.
2. ఆ తరుగును ఒక నిమిషం పాటు చిన్న మంట మీద వేయించాలి.దీని వల్ల పచ్చి వాసన రాదు.
3. ఎండుకొబ్బరిని కూడా వేసి వేయించాలి.
4. స్టవ్ కట్టేసి ఆ మిశ్రమంలో అంజీర్ తరుగు, ఖర్జూర ముక్కల తరుగు కూడా వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి.
5. ఇప్పుడు మరో పక్క బెల్లాన్ని గిన్నెలో వేసి నీళ్లు పోసి స్టవ్ పై పెట్టాలి.
6. తీగ పాకం వచ్చే వరకు కలుపుతూ ఉండాలి.
7. తీగ పాకం వచ్చేసరికి స్టవ్ కట్టేయాలి.
8. పాకం వేడి మీద ఉన్నప్పుడే నట్స్ మిశ్రమాన్ని అందులో వేసి బాగా కలపాలి.పాకం మరీ పలుచగా కాకుండా గట్టిగా అయ్యేలా చూసుకోవాలి.
9. చల్లారాక ఉండలుగా చుట్టుకుని గాలి చొరబడని డబ్బాలో వేసి పెట్టుకోవాలి. అంటే ప్రొటీన్ లడ్డూ సిద్ధమైనట్టే.
10. ఆ డబ్బాలను ఫ్రిజ్ లో పెట్టుకుంటే నెల రోజుల పాటూ తాజాగా ఉంటాయి.