Mushroom Powder: పుట్టగొడుగుల పొడిని ఇలా తయారు చేసి పెట్టుకుంటే రోజూ వాడుకోవచ్చు
ఆహారాలను పొడి రూపంలో దాచుకుంటే ఎక్కువకాలం నిల్వ ఉంటాయి. అవసరమైనప్పుడు వాటిని వాడవచ్చు.
పుట్టగొడుగుల రుచే కాదు, ఆరోగ్య ప్రయోజనాలు ఎక్కువే. కాకపోతే ఎప్పుడు పడితే అప్పుడు పుట్టగొడుగులు లభించవు. అవి తాజాగా దొరికినప్పుడే కొనుక్కొని వండుకోవాలి. వీటికి అభిమానులు ఎక్కువ. ముఖ్యంగా మాంసాహారులు పుట్టగొడుగులను తినేందుకు ఆసక్తి చూపిస్తారు. వాటి రుచి అంటే నాన్ వెజ్ ప్రియులకు ఎంతో ఇష్టం. అయితే పుట్టగొడుగులను పౌడర్ రూపంలో దాచుకోవచ్చు. అలా దాచుకొని నచ్చినప్పుడు కూరల్లో భాగంగా కలుపుకోవచ్చు. దీనికి తయారు చేయడం కూడా చాలా సులువు.
ఇలా చేయండి
ఇంట్లోనే పుట్టగొడుగుల పొడిని తయారు చేయడానికి పోషకాలు నిండిన పుట్టగొడుగుల రకాలను ఎంచుకోవాలి. వాటిని నీటిలో వేసి కడగాలి. తర్వాత టిష్యూలతో సున్నితంగా తుడిచేయాలి. మురికి, చెత్త, తడి లేకుండా తొలగించాలి. ఇప్పుడు ఆ పుట్టగొడుగులను సన్నగా, ముక్కలుగా కట్ చేసుకోవాలి. బేకింగ్ షీట్లో వాటిని వేసి ఒవేన్ లో ఉంచాలి. ఓవెన్ను 150 నుంచి 200° డిగ్రీల వద్ద వేడి చేయాలి. అవి పూర్తిగా పొడిగా, పెళుసుగా అయ్యేవరకు ఓవెన్లో వేడి చేయాలి. బాగా ఎండాక పుట్టగొడుగులను మిక్సీలో వేసి పొడిగా మార్చుకోవాలి. గాలి చొరబడని కంటైనర్ లో వీటిని వేసి దాచుకోవాలి. ఓవెన్ లేకపోతే ఇప్పుడు మండే ఎండలకు పుట్టగొడుగులు రెండు రోజుల్లోనే పెళుసుగా ఎండిపోతాయి. అలా ఎండబెట్టాక పొడిగా మార్చుకోవచ్చు.
ఈ పుట్టగొడుగుల పొడిని అనేక విధాలుగా ఉపయోగించుకోవచ్చు. కూరలు వండుతున్నప్పుడు అదనపు రుచి కోసం కలుపుకోవచ్చు. లేదా సలాడ్ లపై చల్లుకోవచ్చు. సూప్ తయారు చేసుకోవచ్చు. ఎలా చేసుకున్నా ఇది అందించే ఆరోగ్య ప్రయోజనాలు ఎక్కువే.
పుట్టగొడుగులు తినడం వల్ల లేదా పుట్టగొడుగుల పొడిని తినడం వల్ల రోగనిరోధక శక్తి బలోపేతం అవుతుంది. డయాబెటిస్ రోగులకు మష్రూమ్స్ వరమనే చెప్పాలి. రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించడంలో ఇవి సహాయపడతాయి. వీటిలో సెలీనియం ఉంటుంది. ఇది శరీరంలో చేరే హానికర ఫ్రీ రాడికల్స్‌తో పోరాడడానికి సాయపడతాయి. పుట్టగొడుగుల పొడిని తీసుకోవడం వల్ల రక్తప్రసరణ మెరుగుపడుతుంది. గుండె జబ్బులు వచ్చే అవకాశాలు తగ్గుతాయి. పుట్టగొడుగుల పొడిలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి శరీరాన్ని ఆక్సీకరణ ఒత్తిడి నుంచి కాపాడడానికి సహకరిస్తాయి. సెల్యులార్ డ్యామేజ్‌ను కూడా నిరోధిస్తాయి. వీటిలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి కనుక బరువు పెరుగుతారన్న భయం లేదు. పుట్ట గొడుగుల పొడి కూరలకు మంచి మసాలాగా ఉపయోగపడుతుంది. కూర చిక్కగా, గ్రేవీలా అయ్యేందుకు ఈ పొడి ఉపయోగ పడుతుంది.
Also read: ఈ ఎమోజీలలో ఒకటి మాత్రం భిన్నంగా ఉంది, దాన్ని 15 సెకండ్లలో కనిపెడితే మీరు సూపర్
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.