Post Abortion Care : అబార్షన్ తర్వాత ఇలా చేస్తే వేగంగా కోలుకుంటారు
వివిధ కారణాలతో కొందరికి అబార్షన్ అవుతుంది. అయితే దీని నుంచి కోలుకుని.. మళ్లీ ఎప్పుడు ప్రెగెన్సీ ప్లాన్ చేసుకోవాలనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Post Abortion Care : అమ్మ అని పిలిపించుకోవాలని చాలామందికి ఉంటుంది. ఎన్నో కలలతో గర్భం దాల్చిన తర్వాత.. ఏదో అనుకోని సంఘటన లేదా శరీరంలోని మార్పుల కారణంగా అబార్షన్ అవుతుంది. లేదంటే గర్భంలోని పిండం పెరుగుదలలో మార్పుల వల్ల కూడా అబార్షన్ జరగవచ్చు. సామాజిక కారకాలతో సహా వివిధ కారణాల వల్ల.. లేదంటే ఆ తల్లి అభ్యర్థన వల్ల కూడా అబార్షన్ చేస్తారు. ఆరోగ్య సంరక్షణ కోసం గైనకాలజిస్టులు చేసే సాధారణ ప్రక్రియగా కూడా దీనిని చెప్పవచ్చు. అయితే అసురక్షిత పరిస్థితుల్లో దీనిని చేస్తే అది స్త్రీకి ప్రాణపాయం కలిగిస్తుంది.
ఏ కారణం అనేది పక్కన పెడితే.. ప్రతి సంవత్సరం 25 మిలియన్ల అబార్షన్స్ జరుగుతున్నాయని ఓ నివేదిక వెల్లడించింది. ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రసూతి మరణాలకు, అనారోగ్యాలకు ప్రధానకారణాలలో ఒకటి. అయితే అబార్షన్ చేయించుకున్న తర్వాత సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల చాలా మంది మహిళలు అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. మరి ఈ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు, సంరక్షణ చర్యలు తీసుకోవాలో? ఎన్ని రోజుల తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
అబార్షన్ చేయించుకోవాలనుకునే వారు మొదటి త్రైమాసికంలో అనగా నాలుగు నుంచి 13 వారాలు.. లేదా రెండవ త్రైమాసికంలో అంటే 13 నుంచి 24 వారాల్లో అబార్ట్ చేయించుకోవచ్చు. అయితే ప్రెగ్నెన్సీ దశ ఎంత ముదిరితే పరిస్థితి అంత దిగజారిపోతుంది. కాబట్టి ఈ సమయం అబార్షన్‌కు అనువైనదని గైనకాలజిస్ట్లు చెప్తున్నారు. ఈ సమయంలో మీరు అబార్షన్‌పై ఏదొక నిర్ణయం తీసుకోవాలి. అనంతరం మీరు ఆరోగ్యం నుంచి పూర్తిగా కోలుకోవడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
వైద్యుల పర్యవేక్షణ..
అబార్షన్ తర్వాత రక్తస్రావం, నొప్పి లేదా మీరు ఇన్ఫెక్షన్ సంకేతాలు వంటి ఏవైనా సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడితే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ఒకవేళ పేషెంట్‌కి బాగానే ఉంటే అదే రోజు డిశ్చార్జ్ చేయవచ్చు. ఈ సమయంలో నొప్పి తగ్గేందుకు యాంటీబయాటిక్స్ ఇస్తారు. ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండేందుకు ఈ కోర్సును కచ్చితంగా పూర్తి చేయాలి. నెగెటివ్ బ్లడ్ గ్రూప్ ఉన్నట్లుయితే.. అవసరాన్నిబట్టి యాంటీ డి ఇంజెక్షన్ ఇస్తారు.
ఇంటికి వెళ్లిన తర్వాత..
అబార్షన్ తర్వాత ఆ వ్యక్తి పూర్తిగా విశ్రాంతి తీసుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రెగ్నెన్సీ తర్వాత ఎన్నిరోజులకు అబార్షన్ చేయించుకున్నారనే దానిపై ఈ రెస్ట్ ఆధారపడి ఉంటుంది. అబార్షన్ సమయంలో ఎక్కువగా రక్తస్రావం అయినవారు.. ఎక్కువ కాలం విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ శస్త్ర చికిత్స తర్వాత కొన్ని వారాలపాటు మీకు నొప్పిగా ఉండొచ్చు. ఈ నొప్పి లేదా తిమ్మిరిని మీరు మందులను ఉపయోగించి ఉపశమనం పొందవచ్చు.
అలా జరిగితే.. వైద్యుడిని సంప్రదించాలి..
అబార్షన్ చేయించుకున్న తర్వాత నాలుగు వారాలకు రక్తస్రావం ఉంటుంది. అయితే కొన్ని సందర్భాలలో వారం మాత్రమే ఈ సమస్య ఉంటుంది. ఈ సమయంలో టాంపాన్లు, పీరియడ్స్ కప్పులకు బదులుగా శానిటరీ ప్యాడ్స్ ఉపయోగించడం మంచిది. పొత్తికడుపు వద్ద నొప్పి, అసాధారణమైన లేదా అసహ్యకరమైన వాసన వంటి ఇన్ఫెక్షన్లు వెంటనే వైద్యులను సంప్రదించాలి. కళ్లు తిరిగినా.. మైకము కమ్మినా.. భారీ రక్తస్రావమైన కూడా వెంటనే డాక్టర్ దగ్గరు వెళ్లాలి. లేదా బంధువులు వారిని ఆస్పత్రికి తీసుకెళ్లాలి. ఈ సమయంలో బాధితులు మానసికంగా డిస్టర్బ్ అవుతారు కాబట్టి వారికి తగినంత ప్రశాంతత దొరికేలా చూసుకోవాలి. వారు ఎక్కువగా ఇబ్బంది పడుతుంటే సైక్రియాట్రిస్ట్ దగ్గరకు తీసుకెళ్లాలి.
తదుపరి గర్భం..?
వైద్య, శస్త్రచికిత్స్ రెండూ సురక్షితంగా జరిగితే మళ్లీ గర్భవతి కావడానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. అయినప్పటికీ.. ఇన్ఫెక్షన్ లేదా మానని గాయాలు గర్భం ధరించే సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తాయి. కాబట్టి మీరు మళ్లీ ప్రెగ్నెన్సీ పొందాలనుకున్నప్పుడు.. అబార్షన్ తర్వాత మీరు వైద్యుని సంప్రదించాలి. వారి సూచనల మేరకు మీరు మీ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు.
Also Read : సీజనల్ వ్యాధులు రాకుండా ఉండాలంటే, శీతాకాలంలో ఈ సూప్ తాగండి
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.